వారే అసలు ఉల్లంఘనులు

by Viswanth |   ( Updated:2022-03-10 11:02:47.0  )
వారే అసలు ఉల్లంఘనులు
X

చట్టాలు అందరికీ సమానం. ఇది తరచూ మనం వినే మాట. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయి. కొందరికి చుట్టాలుగా కనిపిస్తుంటాయి. అధికార పార్టీలకు అనుకూలంగా మారిపోతాయి. మున్సిపల్ చట్టం, ఆర్‌టీఐ చట్టం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇలాంటివన్నీ బేఖాతర్. తాజాగా జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ మొదలు హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఇది కనిపిస్తుంది. గతంలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలోనూ కనిపించింది. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీకో లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకో మాత్రమే పరిమితం కాదు. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలలోనూ వ్యక్తమవుతూ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ ఇదే జరిగింది. ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలను అవే ఉల్లంఘిస్తూ ఉంటాయి. స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థలు అధికార పార్టీ చెప్పుచేతలలో పనిచేస్తుంటాయన్నది బహిరంగ రహస్యం. పంజరంలో చిలుకలు మాత్రమేనన్న విమర్శలూ లేకపోలేదు. తాజాగా టీఆర్ఎస్ ప్లీనరీని పరిశీలిస్తే నగరాన్ని గులాబీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, కటౌట్‌లతో పింక్ సిటీగా అధికార పార్టీ మార్చేస్తే పట్టించుకోవాల్సిన మున్సిపల్ అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. స్వయంగా ఆ శాఖ మంత్రే మౌనంగా ఉండిపోయారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. 'కంచే చేను మేస్తే' అన్న చందంగా మారిపోయింది. చివరకు పారదర్శక పాలనకు 'గీత' అని చెప్పుకునే ఆర్‌టీఐ చట్టం కూడా నీరుగారిపోతున్నది.

మంత్రే ఉల్లంఘనలకు పాల్పడితే

ఇంటి ఆవరణ దాటి 'టు లెట్' నోటీసు అంటించినందుకు, వీధి చివర 'వే టు' అనే చిన్న సైన్‌బోర్డు పెట్టినందుకు పెనాల్టీ విధించిన విభాగం ఇప్పుడు నిద్రపోతున్నది. సంబంధిత అధికారే లీవ్‌లో వెళ్లిపోయారు. యాదృచ్ఛికం అనుకుంటే పొరపాటే. ఉద్దేశపూర్వకంగానే సెలవులో వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రజల అసంతృప్తి, ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. పార్టీకి సంబంధించిన వ్యవహారమే అయినా ప్రభుత్వ అధికారులు, వాహనాలు సేవలో మునిగిపోయాయి. అందుకే చట్టాలు ఎప్పుడూ అధికార పార్టీకి చుట్టాలుగానే ఉంటాయనే సాధారణ అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. హైదరాబాద్ నగరాన్ని హోర్డింగ్-ఫ్రీ సిటీగా ప్రకటించి ఫ్లెక్సీలు పెట్టడానికి వీల్లేకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా డైరెక్షన్స్ జారీ చేసింది. అనుమతి లేకుండా ప్లెక్సీ, బ్యానర్, కటౌట్‌లాంటివి పెడితే రూ. 3000 జరిమానా అని పేర్కొన్నది. మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు లక్ష రూపాయల ఫైన్ వేశారు. స్వాగతం పలుకుతూ ప్లాస్టిక్‌తో కూడిన ఫ్లెక్సీ పెట్టినందుకు జరిమానా వేసినట్లు పేర్కొన్నారు. ప్లెక్సీలలో బొమ్మలు కనిపిస్తే పబ్లిసిటీ రాదని, ప్రజల గుండెలలో ఉండాలని వ్యాఖ్యానించారు. అదే మంత్రి ఇప్పుడు ప్లీనరీ సందర్భంగా 'నిబంధనలు ఉల్లంఘించినట్లు నోటీసులు ఇస్తే జరిమానా కడతాం' అంటూ సమర్థించుకున్నారు. ఉల్లంఘన అని తెలిసినా ఫైన్ కట్టడానికి సిద్ధమంటూ నిర్లక్ష్యపు ధోరణిని చాటుకున్నారు.

హుజూరాబాద్‌లోనూ యథేచ్ఛగా

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ప్రతి రోజూ పచ్చ నోట్ల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. నోట్ల కట్టలు రవాణా అవుతున్నాయి. తనిఖీలు మాత్రం మొక్కుబడిగానే జరుగుతున్నాయి. ఇప్పటివరకూ చూడనంతటి ఖరీదైన ఎన్నికగా, వందల కోట్ల రూపాయలతో జరిగే రాజకీయ క్రీడగా మారిపోయిందని రాజకీయ పార్టీలే చెప్తున్నాయి. పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులూ చేసుకుంటున్నాయి. బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో నోట్లతో ఓట్లను కొంటున్నట్లు ఆరోపించుకుంటున్నాయి. 'నోట్లు ఇస్తే తీసుకోండి. కానీ ఓటు మాత్రం మాకే వేయండి. బీరు, బిర్యానీలు ఇచ్చినా తీసుకోండి' అంటూ ఓటర్లకు పిలుపునిస్తున్నాయి. అయినా ఎన్నికల కమిషన్ చర్యలేమీ ఉండవు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటూ ఎలక్షన్ కమిషన్ పేజీలకొద్దీ నిబంధనలను రూపొందిస్తుంది. ఆచరణలో మాత్రం అమలు కనిపించదు. ఎన్నికల అబ్జర్వర్లు, వ్యయ పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లు ఇలా రకరకాల పేర్లతో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటారు. అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలో లెక్కలు వేస్తూ ఉంటారు. టీ, కాఫీ, టిఫిన్, కరపత్రం,పార్టీ జెండాలు, తోరణాలు, వాడుతున్న వాహనాలు ఇలా అన్నింటికీ దేనికెంత ఖర్చవుతుందో లెక్కలు రూపొందిస్తారు. ఇవేవీ పక్కాగా ఉండవు. పరిమితికి లోబడే ఖర్చు చేశామని అఫిడవిట్ సమర్పిస్తుంటారు అభ్యర్థులు. ఆడిటింగ్ చేసే సిబ్బందీ చూసీ చూడనట్లుగా ఓకే అని చెప్పేస్తుంటారు. పబ్లిక్‌గా కళ్ళుగప్పి మోసగిస్తుంటారు. ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతు.

పేరుకే స్వతంత్ర వ్యవస్థలు

కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేస్తుందని, ప్రభుత్వం జోక్యం చేసుకోదని చాలా మంది భావిస్తుంటారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు కూడా దీన్ని గొప్పగా చెప్తుంటారు. అనేక అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి అనుకూల తేదీలను ఖరారు చేస్తున్నదనే అపవాదును కమిషన్ భరించక తప్పడంలేదు. ఆ మాటకొస్తే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది విడతలలో నిర్వహించేలా షెడ్యూలు తయారుచేయడం వెనక బీజేపీ ప్రమేయం ఉన్నదంటూ తృణమూల్ కాంగ్రెస్ బహిరంగంగానే విమర్శించింది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా టీఆర్ఎస్ అధినేత దగ్గరుండి మరీ వాయిదా వేయించారని బీజేపీ నేతలే ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు ఉన్న స్వతంత్రత ఏపాటిదో పార్టీలే తేల్చేశాయి.

కొవిడ్ నిబంధనలూ బేఖాతర్

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూలు ఖరారుచేసిన రోజునే ప్రచారానికి సంబంధించి పాటించాల్సిన కొవిడ్ నిబంధనలను ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఇండోర్, ఔట్‌డోర్, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు ఎంత మంది హాజరుకావాలో, ప్రచారరథంపై ఎంత మందికి మించి ఉండకూడదో, వైరస్ వ్యాప్తి నివారణకు పాటించాల్సిన ప్రమాణాలేంటో పేర్కొన్నది. అప్పుడు పశ్చిమబెంగాల్‌లో వేల మందితో అమిత్ షా బహిరంగ సభలు పెట్టి ఉల్లంఘించారు. ఇప్పుడు ఇక్కడి పార్టీల నేతలూ అదే చేస్తున్నారు. కానీ కమిషన్ తరపున తిరుగుతున్న పరిశీలకులకూ ఈ నిబంధనలు పట్టవు. రాష్ట్ర పరిధిలో అమలుచేయాల్సిన రెవెన్యూ, డిజాస్టర్ విభాగాల అధికారులూ పట్టించుకోరు. కళ్ళముందు నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉండిపోతారు. చట్టాలను రూపొందించేదీ, వాటిని అమలుచేయాల్సిందీ అధికార పార్టీకి చెందినవారే. వారే ఉల్లంఘనలకు పాల్పడితే ఇక గాడిలో పెట్టాల్సింది ఎవరు? ప్రయోజనాలకు అనుగుణంగా చట్టాన్ని అమలుచేయడానికి అలవాటుపడ్డాయి అధికార పార్టీలు. ఆ చట్టాలలోని లొసుగులను అవకాశంగా తీసుకుంటున్నాయి. ఆ కారణంగానే ప్రజలలోనూ చట్టాల పట్ల గౌరవం కొరవడుతున్నది. ఆదర్శంగా నిలవాల్సిన నేతలు అడ్డదారులు ఎలా తొక్కాలో నేర్పిస్తున్నారు. అందుకే చట్టాలు అందరికీ సమానం కాదు. అధికార పార్టీకి చుట్టాలు. ఆడించినట్లు ఆడే బొమ్మలు. సమాజంలో ఈ అభిప్రాయం మారాల్సిన అవసరం ఉన్నది. అది అధికార పార్టీ నేతల నుంచే ప్రారంభం కావాలి.

ఎన్. విశ్వనాథ్

Advertisement

Next Story

Most Viewed