- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హామీల అమలు గాలికి
ప్రతీ రాజకీయ పార్టీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలను ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ అంటూ గొప్పగా చెప్పుకుంటుంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా క్రమంలో అది ఒక హ్యాండ్ బుక్ లాంటిదని ప్రకటించుకుంటూ ఉంటాయి. హామీ ఇవ్వకున్నా చాలా పథకాలను అమలుచేస్తున్నామంటూ తమకు తాముగా కితాబునిచ్చుకుంటూ ఉంటాయి. అమలు చేయని హామీల గురించి మాత్రం చెప్పుకోవు. ఎందుకు అమలుచేయలేదో ప్రజలకు చెప్పవు. అందుకు నైతిక బాధ్యత కూడా వహించవు. ఇక మధ్యలో వచ్చే స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలప్పుడు కూడా వరాలను కుప్పలు తెప్పలుగా గుప్పిస్తుంటాయి. ఆ తర్వాత వాటిని మర్చిపోతాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలలోనూ ఇది జరుగుతున్నదే. ఆ పార్టీలకు జవాబుదారీతనంలేదు, నైతిక బాధ్యత అంతకన్నా లేదు. అమలుకు నోచుకోని హామీలకు విలువేముంది? కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నవ భారత్ అని గొప్పగా ఊదరగొడుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటూ మభ్య పెడుతుంది. కానీ, ఇచ్చిన హామీలను పట్టించుకోవు.
రెండున్నరేళ్లు గడిచినా
తెలంగాణ విషయాన్నే చూసుకుంటే తొలి టర్ములో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలలో అనేకం అమలుకు నోచుకోలేదు. ఇక రెండవ టర్ములో ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేరుతాయో తెలియదు. ఇప్పటికే రెండున్నరేళ్లయిపోయింది. మిగిలింది రెండున్నరేళ్లు. అందులో చివరి ఆరు నెలలు ఎన్నికల మూడ్‌లోనే ఉంటాయి. గడచిన రెండున్నరేళ్లలో ముట్టుకోని హామీలు రానున్న కాలంలో అమలు అవుతాయనేది అనుమానమే. ఇలా పెండింగ్‌లో పడిపోయినవన్నీ డబ్బులతో ముడిపడినవే. కరోనా పేరుతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ మొత్తుకుంటున్న ప్రభుత్వం మళ్లీ టర్ముకు వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు. 2018 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పింఛను వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించాల్సి ఉంది. ఇప్పటికీ ముట్టుకోలేదు. నిరుద్యోగ యువతకు నెలకురూ. 3,016 చొప్పున భృతి అందిస్తామని చెప్పింది. ఇప్పటివరకు నిరుద్యోగ యువత అంటే ఎవరనే నిర్వచనమూ లేదు, మార్గదర్శకాలూ లేవు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది ఉంటారని ముఖ్యమంత్రి అంచనా. అంటే నెలకు రూ. 331 కోట్లు అవసరం. పీఆర్సీ పెంపు ఇస్తామంటూ జూలై 2018 నుంచి ఊరించి చివరకు 2021 జూన్ నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. దాదాపు 19 నెలల వేతన పెంపు చేతికి అందకుండా పోయింది. కేవలం సర్వీసు రికార్డులలో మాత్రమే ఉంటుంది. ఈ ఏడాది జూన్‌లో పెరిగిన జీతాన్ని జూలైలో అందుకోనున్నట్లు జీవో కూడా జారీ అయింది. కానీ సాంకేతిక ఇబ్బందులంటూ అటకెక్కింది.
ఆర్థిక అంశాలే కారణం
ఆర్థిక అంశాలతో ముడిపడిన హామీలనేకం గాడిలో పడలేదు. స్వంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోడానికి ఒక్కో లబ్ధిదారుకు ఆరు లక్షల రూపాయల వరకూ సాయం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. రెడ్డి, వైశ్య కార్పొరేషన్లను నెలకొల్పుతామని చెప్పింది. రాష్ట్రమంతటా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పుతామని హామీ ఇచ్చింది. మహిళల (ఇందిరా క్రాంతి పథం)కే వీటి పగ్గాలు అప్పగిస్తామని చెప్పింది. 'కంటివెలుగు' తరహాలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పింది. రాష్ట్రంలోని అందరి హెల్త్ ప్రొఫైల్ తయారుచేస్తాన్నది. పోడు భూముల సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తామంటూ ఎన్నికల ప్రచార సభలోనే హామీ ఇచ్చారు. ఇవేవీ ఇప్పటివరకు కనీసంగా కాగితాలమీద కూడా కదలలేదు. రైతులకు రుణమాఫీ ప్రకటన ఇచ్చినా రూ. 25 వేల సీలింగ్ వరకు మాత్రమే అమలైంది. గత టర్ములో నాలుగేళ్లపాటు వాయిదాల పద్ధతిలో చెల్లించినట్లుగానే ఈ టర్ములో కూడా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. మిగిలింది రెండున్నరేళ్లే.
2014 నుంచీ పెండింగ్
రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత 2014లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని, ప్రకటించనివాటినీ నెరవేర్చామని పార్టీ అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల సందర్భంగా గొప్పగా చెప్పుకున్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామనీ, అమరుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామనీ, వారి పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందనీ, వారికి గృహ వసతి కల్పిస్తుందనీ, సాగుకు యోగ్యమైన భూమినీ ఇస్తుందనీ, ప్రతీ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాలు నిర్మిస్తామనీ, ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామనీ, జిల్లాలలో ఆదివాసీ భవనాలు, బంజారాహిల్స్‌లో బంజారా భవన్, ఆదివాసీ భవన్ నిర్మిస్తామనీ, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామనీ, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామనీ, ప్రజలు శాంతియుతంగా ఉద్యమించే హక్కును అమలు చేస్తామనీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ, ఇవేవీ అమలుకు నోచుకోలేదు.
ఓటు బ్యాంకు కోసమే
మేనిఫెస్టోలు కొన్ని సెక్షన్ల ప్రజలను ఉద్దేశించి రూపొందుతున్నవే. ఓటు బ్యాంకును ఆకర్షించడానికి ఉచిత హామీలను గుమ్మరిస్తున్నాయి. నిజానికి అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనే విజన్ కంటే వరాలు గుప్పించడమే ఎక్కువ. ఐదేళ్ల పాలసీ డాక్యుమెంట్‌కు బదులుగా ఏ వర్గానికి, ఏ సెక్షన్‌కు ఎలాంటి రాయితీలు, తాయిలాలు ఇస్తున్నామన్నదే కీలకమైంది. ఈ హామీల అమలుకు ఎన్ని నిధులు అవసరమవుతాయి, వాటిని ఏ విధంగా సమీకరించుకుంటాం, ఏడాదికి ఎంత ఖర్చవుతుంది లాంటివేవీ ఆ మేనిఫెస్టోల్లో కనిపించవు. ఉచిత హామీలతో నెలకు ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత అందుకుంటారు.. లాంటివాటితో ఊరిస్తుంటాయి. తమిళనాడులో మిక్సీలు, గ్రైండర్లు, కలర్ టీవీలు, లాప్‌టాప్‌లు, సైకిళ్ళు.. ఇవన్నీ ఆ కోవలోనివే. ఆ హామీలు ఆచరణ సాధ్యమేనా? ఐదేళ్ల కాలంలో అమలు చేయడం వీలవుతుందా అనే లోతులోకి వెళ్లవు. ఎన్నికలు వచ్చినప్పుడు గడచిన ఐదేళ్లలో ఏమేం ఇచ్చాం, ఏమేం చేశాం అనేవి ఉదహరిస్తాయే తప్ప చేయలేకపోయినవాటి గురించి ప్రస్తావించవు. అధికారంలోకి రావడమే పార్టీల పరమావధి. హామీల అమలు ఎందుకు ఫెయిలైంది అని పర్యవేక్షించే వ్యవస్థ కూడా లేదు. అలవికాని వాగ్ధానాలు ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించడానికి, సమాధానం రాబట్టడానికి ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలూ లేవు. ఇటు ప్రజల పక్షం వహించే ప్రతిపక్షాలూ ప్రశ్నించవు.
అమలు కాని సుప్రీంకోర్టు సూచనలు
రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు, ఐదేళ్లలో వాటి అమలు గురించి దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు చేసింది. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి మేనిఫెస్టోల విషయంలో నిర్దిష్టంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలని పేర్కొన్నది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో పేర్కొన్నట్లుగానే మేనిఫెస్టోల అమలుకు సైతం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసి రాజకీయ పార్టీలను జవాబుదారీ చేయాలని సూచించింది. ఏండ్లు గడిచినా అది అమలులోకి రాలేదు. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తున్నాం.. హామీలు అమలు చేయకపోతే ప్రజలు ఓటు వేస్తారా అని ప్రశ్నించవచ్చు. కానీ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం, జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీలాంటివీ అవసరం. తాత్కాలిక ప్రయోజనాలతో ప్రజలు ఉబ్బితబ్బిబ్బవుతారు, వారు అల్ప సంతోషులు. నోట్లే ఓట్లు కురిపిస్తాయి. హామీల అమలు కంటే తాయిలాలు, ఉచిత పథకాలే ప్రధానం అని పార్టీలు భావించినంతకాలం నైతికత నేతిబీరకాయ చందంగానే ఉంటుంది. హామీల అమలుపై నిలదీయాల్సింది ప్రతిపక్షాలు. కనువిప్పు కావాల్సింది ఓటర్లకు.
ఎన్. విశ్వనాథ్