పీవీ సింధు క్వార్టర్స్ వరకు ఓకే.. తర్వాతే కష్టం

by Shyam |
PV Sindhu
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి మరో రెండు వారాలే మిగిలి ఉండటంతో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) డ్రాను ప్రకటించింది. ఇండియా నుంచి పురుషుల సింగిల్స్‌లో బి. సాయి ప్రణీత్, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల డబుల్స్‌లో సాత్వీక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ షెట్టి జోడీ అర్హత సాధించారు. వీరిలో సింగిల్స్ ఆడే వారికి గ్రూప్ దశలో సులభమైన డ్రానే వచ్చింది. కానీ పురుషుల డబుల్స్ జోడీ మాత్రం కష్టపడాల్సి ఉన్నది. 2016 రియో ఒలింపిక్స్ రజక పతక విజేత పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లడం సులభంగానే కనిపిస్తున్నది.

మహిళల సింగిల్స్ ‘జే’ గ్రూప్‌లో సింధు పోటీ పడనున్నది. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా సింధు 34వ ర్యాంకర్ ఎన్‌గాన్, 58వ ర్యాంకర్ పోలకార్పోవ్‌లు ఉన్నారు. వీరిద్దరితో ఆడి గ్రూప్‌లో టాప్ ర్యాంక్ సాధిస్తే సింధు ప్రీ క్వార్టర్స్‌కు చేరుకోవడం సాధ్యమే. అక్కడ జపాన్‌కు చెందిన అకామే యమగుచితో తలపడాల్సి ఉన్నది. గతంతో ఆమెపై సింధుకు మంచి రికార్డే ఉన్నది కాబట్టి క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకోవడం సులభమే అని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘డి’లో ఉన్నాడు. అతడి గ్రూప్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ కాల్జో, జిల్బర్ మన్ ఉన్నారు. వీరిద్దరిని అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. అతడు కాస్త కష్టపడితే క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంటాడని భావిస్తున్నారు.

ఇక ఎటు తిరిగి పురుషుల డబల్స్‌లోనే కాస్త కఠినమైన డ్రా వచ్చింది. భారత జోడి సాత్వీత్-చిరాగ్ తమ గ్రూప్‌లో వరల్డ్ నెంబర్ 3 జోడి యాంగ్-వాంగ్ చీ, ఇంగ్లాండ్ జోడి లేన్-సీన్ వెన్‌డీతో తలపడాల్సి ఉన్నది. ఇది బలమైన గ్రూప్ కావడంతో భారత జోడీ కనీసం క్వార్టర్స్‌కు అయినా చేరతారా అనేది అనుమానంగా మారింది. అయితే సింగిల్స్‌లో ప్రతీ గ్రూప్ నుంచి ఒక్కరే నాకౌట్‌కు చేరతారు. కానీ డబుల్స్‌లో మాత్రం గ్రూప్ నుంచి రెండు జోడీలు నాకౌట్ చేరుకుంటాయి. కాబట్టి సాత్వీక్ – చిరాగ్ జోడీ నాకౌట్ వరకు చేరుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed