టీమిండియాలో భారీ పోటీ: ఒక స్థానానికి ఇద్దరు

by Shiva |   ( Updated:2021-03-24 08:56:24.0  )
టీమిండియాలో భారీ పోటీ: ఒక స్థానానికి ఇద్దరు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఇప్పుడు అత్యంత బలమైన జట్టుగా మారుతున్నది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకోగలిగే పటిష్టమైన జట్టుగా రూపొందింది. స్వదేశీ, విదేశీ అని తేడా లేకుండా అన్ని చోట్లా విజయదుంధుబి మోగిస్తున్నది. ఒకప్పుడు జట్టులో ఒక్క క్రికెటర్ గాయపడినా అతడి స్థానంలో ఎవరిని ఆడించాలనే ఆందోళన నెలకొనేది. కానీ, ఇప్పుడు సీనియర్ క్రికెటర్లు గాయాల పాలైనా.. విశ్రాంతి కోసం దూరమైనా.. మేమున్నాం అంటూ యువక్రికెటర్లు ముందుకొస్తున్నారు. అరంగేట్రం మ్యాచ్ నుంచే దుమ్ముదులిపేస్తూ.. టీమ్ ఇండియాకు విజయాలు అందిస్తున్నారు. షమీ, బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్ల గైర్హాజరీలో కూడా భారత జట్టు ఏ మాత్రం తడబడకుండా తొలి వన్డేలో విజయం సాధించింది. వాళ్లు కూడా అందుబాటులోకి వస్తే.. టీమ్ ఇండియా జట్టు కూర్పు మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందిగా మారనున్నది. ఎందుకంటే ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు.

ఆందోళన అక్కర్లేదు..

తొలి వన్డే ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఈ విజయం మాకు ఒక తీపి గురుతు అన్నాడు. అంతే కాకుండా జట్టు కూర్పుపై కూడా సంతోషం వ్యక్తం చేశాడు. జట్టులో ఇప్పుడు పోటీ పెరిగిపోయిందని.. ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు అందుబాటులో ఉన్నారని కోహ్లీ చెప్పాడు. అతడి మాటల్లో ఆనందం వెనుక బీసీసీఐ ఏళ్ల కృషి ఉన్నది. ఒకప్పుడు ఎవరైనా బ్యాట్స్‌మాన్ లేదా బౌలర్ గాయపడితే వారి స్థానాన్ని భర్తీ చేయడానికి క్రికెటర్లను వెతకాల్సి వచ్చేది. యువ క్రికెటర్లతో భర్తీ చేయాలనుకుంటే.. వాళ్లు ఒత్తిడికి తట్టుకోలేక విఫలమయ్యే వాళ్లు. అయితే ఐపీఎల్ వచ్చన తర్వాత యువ క్రికెటర్లు ఎలాంటి ఒత్తిడిని అయినా తట్టుకోగలుగుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఏ మాత్రం తక్కువగా ఉండవు. అంతే కాకుండా దేశ, విదేశాలకు చెందిన సీనియర్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంతో వారికి మంచి అనుభవం లభిస్తున్నది. ఐపీఎల్ ద్వారా బీసీసీఐ డబ్బు సంపాదనకే చూస్తున్నది అని భావించే అందరికీ ఇప్పుడు టీమ్ ఇండియా సాధిస్తున్న విజయాలే జవాబు చెబుతున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న క్రికెటర్లతో టీమ్ ఇండియా రెండు బలమైన జట్లను తయారు చేసే అవకాశం కూడా ఉన్నది.

మరింత పోటీ..

ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జట్టు అవసరాల కోసం ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌కు రెడీ అని చెప్పాడు. 2019 వరల్డ్ కప్ ముందు వరకు 4వ స్థానంలో సరైన బ్యాట్స్‌మాన్ దొరకక టీమ్ ఇండియా చాలా ఇబ్బందులు పడింది. సురేష్ రైనా జట్టు నుంచి వెళ్లిపోయాక సరైన బ్యాట్స్‌మాన్ దొరకలేదు. కానీ ఇప్పుడు ఆ స్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు. అవసరమైతే ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సూర్యకుమార్ యాదవ్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఓపెనర్లుగా రోహిత్, ధావన్ మాత్రమే కాకుండా శుభమన్‌గిల్, పంత్ కూడా సిద్దంగా ఉన్నారు. ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా లేకపోయినా.. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆ బాధ్యతలు నిర్వర్తించగలరు. ఇప్పుడు కృనాల్ పాండ్యా రూపంలో మరో ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆల్‌రౌండర్ ప్లేసులో ఇప్పుడు పాండ్యా బ్రదర్స్ ఒకరికి ఒకరు పోటీగా మారారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ వారికి పోటీగా ఇప్పుడు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉన్నాడు. భువనేశ్వర్‌కు తోడుగా బుమ్రా, షమీ లేకపోయినా.. ప్రసిధ్ కృష్ణ రూపంలో ఒక యువ పేసర్ సిద్దంగా ఉన్నాడు. మరోవైపు బెంచ్‌పై నటరాజన్, సిరాజ్, సైనీ జట్టుకు సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు. ఇలా ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతూ టీమ్ ఇండియా ఇప్పుడు బలంగా ఉన్నది. స్వదేశంలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా మేనేజ్‌మెంట్ వ్యూహాలు ఫలిస్తుండటం.. మనకు కలసి వచ్చే అంశమే.

Advertisement

Next Story

Most Viewed