వేడెక్కిన దుబ్బాక

by Shyam |
వేడెక్కిన దుబ్బాక
X

దిశ ప్రతినిధి, మెదక్ :
హరీశ్‌రావు, టీఆర్ఎస్ నేతలు బీజేపీపై ఎదురుదాడి మొదలుపెట్టారు. దీంతో బీజేపీ డిఫెన్స్‌లో పడి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు వ్యవహారం వైపు ఫోకస్ పెట్టింది. ఇంతకూ నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్న అంశం ఏ పార్టీకి అడ్వాంటేజ్‌గా మారింది.? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారని బీజేపీ గట్టిగానే ప్రచారం చేసింది. సిద్దిపేట సోదాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. సానుభూతి పొందే ప్రయత్నం చేసింది. బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక పోలీసుల చేతనే ఆ డబ్బును ఇంట్లో పెట్టించే కుట్రకు టీఆర్ఎస్ పాల్పడిందనే ప్రచారాన్ని ఉధృతం చేసింది. కొన్ని వీడియో దృశ్యాలలో పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పద కదలికలు బీజేపీ వాదనకు బలం చేకూర్చేలా మారాయి. బీజేపీ ఊహించినట్లుగానే ఒక సెక్షన్ ప్రజల్లో సానుభూతి లభించింది. పోలీసు, రెవెన్యూ శాఖలను టీఆర్ఎస్ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందనే ప్రచారాన్ని బీజేపీ జనంలోకి తీసుకెళ్ళింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా వెళ్ళిపోయింది. కానీ, ఇది ఎంతోసేపు నిలవలేదు.

ఆ డబ్బు అంజన్‌రావు నివాసంలోంచి బైటకు తెచ్చిందేనని రుజువు చేసే విధంగా పోలీసులు వీడియో దృశ్యాలను బైటకు విడుదల చేయడంతో మంగళవారం రాజకీయ వాతావరణం మరో రూపం తీసుకుంది. అప్పటివరకూ బీజేపీవైపు వీచిన సానుభూతి పవనాల్లో తేడా కనిపించింది. ఇంట్లో నోట్ల కట్టలతో అంజన్ రావు, ఆయన భార్య పోలీసులతో మాట్లాడుతున్న సంభాషణలు, దృశ్యాలను టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మల్చుకుంది. నోట్లకట్టలు పోలీసులు పెట్టింది కాదని, ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నదేననే స్పష్టత ఇవ్వడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. దీంతో బీజేపీ తన వాదనను ఇంకోవైపుకు మళ్ళించక తప్పలేదు. బండి సంజయ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, దాడికి పాల్పడ్డారని, బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారని.. ఇలా ఇతర అంశాలవైపు మళ్ళింది.

ఇటు సానుభూతి.. అటు అఫెన్స్

ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని బీజేపీ గట్టిగానే ప్రచారం చేసుకుంటోంది. లక్ష్యం ప్రకారం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఇరుకున పెట్టడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించింది. శామీర్‌పేటలో రూ. 40 లక్షల నగదు పట్టుబడింది మొదలు వాహనాలను ఎక్కడికక్కడ ఆపి సోదాలు చేయడం, గంటల తరబడి తనిఖీల పేరుతో సమయాన్ని వృధా చేయడం, బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం, ఇప్పుడు సిద్దిపేటలో సోదాలు చేయడం.. వీటన్నింటినీ బీజేపీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోడానికి ఉపయోగించుకుంది. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని, బీజేపీని ఓడించడానికి అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయని ప్రజల్లో సానుభూతి వచ్చేలా ప్రచారం చేసుకుంది. బీజేపీవైపు సానుభూతి పెరిగిందని భావించిన టీఆర్ఎస్ పరిస్థితిని అనుకూలంగా మల్చుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజల్లో బీజేపీ పట్ల ఉన్న సానుభూతిని నీరుగార్చడం కోసం దూకుడు పెంచింది. పోలీసులు విడుదల చేసిన వీడియో ఫుటేజీని టీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుని బీజేపీని కార్నర్ చేసింది. నోట్ల కట్టల విషయంపై బీజేపీని నోరు ఎత్తనీయకుండా చేసింది. అంజన్ రావు ఇంట్లో సోదాలు జరుగుతుంటే రఘునందన్ రావు ప్రచారాన్ని ఆపి మరీ సిద్దిపేటకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఆయన డబ్బు కానప్పుడు, సంబంధమే లేనప్పుడు ఎందుకు ఆందోళన పడాల్సి వచ్చిందని ప్రశ్నించి ప్రజల్లో ఆలోచనను రేకెత్తించింది. ఆ మేరకు టీఆర్ఎస్ సక్సెస్ అయింది.

గెలుపు కోసం రాజకీయ రంగులు

నగదు దొరికింది కాబట్టి నోట్లతో ఓట్లను కొనుగోలు చేయాలన్న బీజేపీ కుట్ర బైటపడిందని టీఆర్ఎస్ వాదిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే వేధించే ఎత్తుగడల్లో భాగంగా టీఆర్ఎస్ సోదాల పేరుతో అధికార యంత్రాంగాన్ని వాడుకుంటోందని బీజేపీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ గెలిస్తే అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ప్రచారం చేసుకోనీయకుండా వేధింపులకు గురిచేసిందన్న చర్చ తెరపైకి వస్తుంది. బీజేపీ గెలిస్తే నోట్లను విచ్చలవిడిగా పంచిపెట్టిందనేది చర్చనీయాంశమవుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ చర్చలోకి లాగడానికి టీఆర్ఎస్ వెనకాడకపోవచ్చు. ప్రస్తుతానికి ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉందనే అభిప్రాయం దుబ్బాక నియోజకవర్గ ప్రజల్లో ఏర్పడింది. దివంగత మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడనే సానుభూతి ఉన్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్ కు మూడవ స్థానమే ఇచ్చారన్న అభిప్రాయాన్ని టీఆర్ఎస్, బీజేపీలు కలిగించాయి. ఇందుకు కారణం నోట్ల కట్టల ఉదంతాన్ని తెరపైకి తేవడమే. బీజేపీ గెలుస్తుందన్న ఉద్దేశంతోనే ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోలీసులచేత డబ్బు సంచుల్ని అంజన్ రావు ఇంట్లో పెట్టించిందని ఇప్పటికే విమర్శలు వచ్చాయి. టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే నిర్ణయానికి వచ్చినందునే నోట్లతో ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీపై విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలతో గెలుపు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదానికే అనే చర్చ ప్రజల్లో ఏర్పడింది. ఆ రకంగా కాంగ్రెస్ ఎక్కడా తెరపైకి రాకుండా ఉండిపోయింది.

Advertisement

Next Story

Most Viewed