- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాకలో గెలుపు ఓటుదా?.. నోటుదా?
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? అనే చర్చ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి స్పష్టమైన సమాధానం దొరకడం కష్టమేగానీ చివరికి గెలుపు మాత్రం పచ్చనోటుదే అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ప్రతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పచ్చనోట్లు పంచడం, ఓటర్లు డిమాండ్ చేసి మరీ అందుకోవడం బహిరంగ రహస్యం. దీనికి సాక్ష్యాలూ ఆధారాలూ ఉండకపోవచ్చు. కానీ ఓటు వేయించుకునేవారు, వేసేవారికి ఇది ప్రతీ ఎన్నికల సందర్భంగా జరిగే తతంగమే. అన్ని పార్టీలదీ అదే తీరు. ఒక పార్టీ ఎక్కువ ఇవ్వొచ్చు. మరో పార్టీ తక్కువ ఇవ్వొచ్చు. కానీ ఓటుకు నోటును ఎరవేయడం ఇటీవలి కాలంలో ఒక ట్రెండ్‌గానే కొనసాగుతోంది.
ఏ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలనే ఖరారు చేసింది. అభ్యర్థులు కూడా వారు పెట్టే ఖర్చుకు లెక్కలు చూపించాలి. దీనికితోడు ఎన్నికల సంఘం కూడా వ్యయ పరిశీలకులను నియమిస్తుంది. కానీ ఇదంతా ఒక ప్రహసనంగానే మిగిలిపోయింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంతకాలం నిర్దేశించిన రూ.28 లక్షలు అభ్యర్థులు ప్రచారానికి, బహిరంగ సభ ఏర్పాట్లకు, జనాల్ని సమీకరించడానికి, కార్యకర్తల రోజువారీ ఖర్చు తదితరాలకు కూడా సరిపోదు. ఇప్పుడు పది శాతం పెంచి రూ. 30.80 లక్షలకు పరిమితం చేసింది. కేవలం ఈ పరిమితితోనే ఎన్నికల్లో పోటీచేసి గెలవడం అసాధ్యం అనేది అన్ని రాజకీయ పార్టీలకూ తెలుసు. అందుకే లెక్కల్లోకి రాకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటాయి.
ఎన్నికల్లో ధన ప్రవాహం..
తమిళనాట జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో జరిగిన ఉపఎన్నికల్లో నోట్ల కట్టలు ఏ విధంగా బైటపడ్డాయో చూశాం. నంద్యాల లాంటి అనేక ఉప ఎన్నికల్లో పార్టీలు పోటాపోటీగా కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టిందీ చూశాం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఓటర్లకు చీకట్లో పంచిపెట్టిన నోట్ల గురించీ తెలుసు. ఒక జాతీయ పార్టీకి చెందిన కోట్లాది రూపాయల విలువచేసే నోట్లకట్టలను వాహనం నుంచి స్వాధీనం చేసుకున్నదీ చూశాం. ఇప్పుడు దుబ్బాకలోనూ అదే జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే రూ.40 లక్షలు పట్టుబడ్డాయి. ఇదంతా దొరికిన సొమ్ము మాత్రమే. ఇక దొరక్కుండా తరలిపోతుంది ఎంతో లెక్కల్లోకే రావడంలేదు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు రూ.127 కోట్ల నగదును, మరో రూ.10 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, మద్యం బాటిళ్ళను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మంతా రాజకీయ పార్టీలు, వాటికి అనుబంధంగా ఉన్న బడాబాబులదే. కానీ ఇప్పటికీ ఆ నగదు మూలాలు వెలుగులోకే రాలేదు. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక కూడా మూడు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం కాబట్టి గెలుపుకోసం ఓటర్లను ప్రలోభపెట్టడానికి, తమవైపు తిప్పుకోడానికి పోలింగ్ రోజున ఓట్లు పొందడానికి ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. ప్రచారం మొదలుపెట్టింది మొదలు ముగిసేంత వరకు ఎంత ఖర్చు చేసినా చివరి రెండు రోజుల్లో జరిగే నగదు పంపిణీయే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తుంది. పోలింగ్ ప్రక్రియకు కొన్ని గంటల ముందు వరకూ గుట్టుచప్పుడు కాకుండా నోట్ల పంపిణీ జరుగుతూ ఉంటుంది. చివరకు ఓటు వేయడానికి కూడా రకరకాల కారణాలను చూపుతూ రానుపోను రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంటాయి రాజకీయ పార్టీలు.
ఖరీదైన ఉప ఎన్నిక..
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగేది ఉప ఎన్నికే అయినా మూడు ప్రధాన పార్టీలకూ ఇక్కడ గెలుపు కీలకం. అందుకే ఖర్చుకు వెనకాడడం లేదు. నియోజకవర్గంలో సుమారు 1.98 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అన్ని పార్టీలూ ఒక్కో ఓటుకు వాటి తాహతును బట్టి నగదు ఎంత ఇవ్వాలో లెక్కలేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఒక్కో ఓటుకు గరిష్ఠంగా రెండు వేల రూపాయలను ఇచ్చిన పార్టీలు ఇప్పుడు దుబ్బాకలో రెట్టింపు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాయి. దాదాపు పాతిక లేదా ముప్పై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నాయి. పోలీసులు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా నగదు రవాణా జరిగిపోతూనే ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఎక్కడికి చేరాల్సిన సొమ్మును అక్కడికి చేర్చి అవసరమైన సమయంలో బైటకు తీసే ఏర్పాట్లు చేసుకున్నాయి.
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి చాలా అనుకూల అంశాలు ఉంటాయి. మామూలు ఎన్నికలప్పటికంటే ఉప ఎన్నికల సమయంలో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే చాలా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులే గెలుస్తూ ఉంటారు. ప్రభుత్వ యంత్రాంగమంతా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో ఇది సాధ్యమవుతోంది. అందుకే నోట్లను పంచాలన్నా, నోట్ల కట్టలను తరలించాలన్నా విపక్ష పార్టీలకంటే అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోలింగ్ దగ్గర పడుతున్నాకొద్దీ విపక్ష పార్టీలకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగమైన ఓటర్లకు నోట్లు పంచే పని ఎన్నికల ప్రచారపర్వం ముగిసిన తర్వాత ప్రారంభమవుతుంది. నోట్ల పంపిణీకి ఒక్కో పార్టీ ఒక్కో రకమైన ఎత్తుగడ అవలంబిస్తుంది. చివరి గంటల్లో నోట్లు అందుకుంటున్నందున ఆ ప్రభావం ఓటు వేసే సమయానికి బాగా వర్కవుట్ అవుతుంది. ఏ అభ్యర్థి నుంచి ఎక్కువ మొత్తంలో అందితే ఓటరు ఆ అభ్యర్థికి ఓటు వేసే మానసిక ఎమోషన్‌లో ఉంటారు. ఇదే పోలింగ్ సరళిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
అమ్ముడుపోతున్న ఓటర్లు..
ఒకప్పుడు ఏ పార్టీకి ఓటు వేయాలో ముందుగానే ఓటరు ఒక నిశ్చితాభిప్రాయంతో ఉండేవారు. కానీ కాలం మారుతున్నాకొద్దీ నోట్లతో వారి మానసిక స్థితిని ప్రభావితం చేసేలా రాజకీయ పార్టీలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. అందుకే ప్రతి పార్టీ అభ్యర్థి నోట్లు పంచుతారనే సమయం కోసం ఓటర్లు ఎదురుచూస్తూ ఉంటారు. ఎన్నిక ఒక్కటే అయినా ప్రతి పార్టీ నుంచి నోట్లు వస్తుండడంతో ఒక్కోసారి గరిష్ఠంగా పది వేల రూపాయల వరకు కూడా పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవేవీ కెమెరా కళ్ళకు చిక్కవు. ఆధారాలకు అందవు. కానీ ఇచ్చేవారికీ, పుచ్చుకునే వారికీ మధ్య జరిగే సాధారణ ప్రక్రియ. ఓటును అమ్ముకుంటున్నాననే ఫీలింగ్ ఓటర్లకు ఉండదు. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కుంటున్నాననే అభిప్రాయం పార్టీల అభ్యర్థుల్లో ఉండదు. ఓటు ఒక సరుకు. బహిరంగంగా కనిపించని ఒక వ్యాపారం. ఎన్నికల నిఘా వ్యవస్థ అలంకారప్రాయం. ఓటు క్రయవిక్రయాల్లో ఒకరు బయ్యర్, మరొకరు సెల్లర్.
ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది
“ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయింది. ప్రజాస్వామ్యం పేరుతో ధనవంతులంతా ఎన్నికల్లో కోట్లు కుమ్మరిస్తూ ధనస్వామ్యంగా మార్చివేశారు. చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం వికసిస్తున్న సమయంలో మన దేశంలో మాత్రం ధనమయం అయిపోయింది. కేవలం 200 కుటుంబాలకు చెందినవారే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇది వారి మధ్య పోటీ మాత్రమే. కోట్లాది మంది ఓటర్లకు సంబంధించిన అంశంగా కనిపించడం లేదు. ఎన్నికలు కొద్దిమంది ధనవంతుల రాజకీయ క్రీడగా మారాయి. ఒకప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య కేవలం రూ.200 (అప్పటి విలువ) ఖర్చుతో ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. కానీ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం విధించిన ఖర్చు పరిమితి రూ.28 లక్షలు నామినేషన్ రోజు ఊరేగింపు, కార్యకర్తల ఖర్చుకే సరిపోతోంది. ఎన్నికల సంఘం నిబంధన అలంకారం మాత్రమే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు”.
– లక్ష్మణరావు, కన్వీనర్, జన చైతన్య వేదిక