దుబ్బాక బై పోల్‌కు TRS రెడీ..?

by Shyam |   ( Updated:2020-09-07 04:03:02.0  )
దుబ్బాక బై పోల్‌కు TRS రెడీ..?
X

దిశ ప్రతినిధి, మెదక్ : దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవలే మృతిచెందడంతో ఆ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. దీంతో అధికార పార్టీ ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల బాధ్యతలను ముఖ్య నాయకులకు అప్పగించింది. కాంగ్రెస్ మాత్రం ఇంకా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టలేదు. బీజేపీ తరపున రఘునందన్‌రావు టికెట్ ఆశిస్తూ, ప్రజలను కలుస్తూ పర్యటిస్తున్నారు. కానీ, అధికార పార్టీకి అసమ్మతి సెగ తప్పడం లేదు. సోలిపేట కుటుంబానికి టికెట్ ఇవ్వకూడదంటూ ఆ పార్టీకి చెందిన పలువురు డిమాండ్ చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవలే మృతి చెందడంతో ఆ స్థానానికి అక్టోబర్ చివరలో గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ప్రచారం జరుగుతుండటంతో అందరి దృష్టి అటువైపే ఉంది.

ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయా పార్టీల నుంచి నాయకులు ఉత్సాహం చూపుతున్నారు. టీఆర్‌ఎస్ ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గానూ మండలానికి ఇద్దరు ముగ్గురు చొప్పున ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ ఉప ఎన్నిక బాధ్యత మొత్తంగా మంత్రి హరీశ్‌రావు చూస్తున్నారు. తాజాగా తొగుట, రాయపోల్ మండలంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. రాయపోల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి హాజరై పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. తొగుటలో నిర్వహించిన సమావేశానికి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మరో అడుగు ముందుకేసి రానున్న దుబ్బాక ఎన్నికలలో దివంగత రామలింగారెడ్డి కుటుంబానికి అండగా నిలబడాలని సూచించారు.

కదలని కాంగ్రెస్..

ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్ తనదైన వ్యూహం ఏర్పాటు చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున అభ్యర్థిని పోటీలో దింపుతామంటూ పీసీసీ చేసిన వ్యాఖ్యలే అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. వాస్తవానికి దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమనే చెప్పాలి. దుబ్బాకలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీచేసినా అతడు 62,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఇందులో రామలింగారెడ్డికి 89,299 ఓట్లు రాగా, నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. 2014 లోనూ రామలింగారెడ్డి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యం రెడ్డి సైతం భారీ మెజార్టీతో ఓడిపోయారు. ఏ రకరంగా చూసినా ఇ ప్రాంతం టీఆర్ఎస్‌కు అనుకూలమనే చెప్పాలి. 2018‌ ఎన్నికల్లో ముందుగా ఈ స్థానాన్ని మహాకూటమి తరపున టీజేఎస్ అభ్యర్థి చిందం రాజ్‌కుమార్‌కు కేటాయించినా ఆఖర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మద్దుల నాగేశ్వర్‌రెడ్డికి బీఫాం ఇచ్చారు. అప్పట్లో ఓడిపోయిన నాగేశ్వర్ రెడ్డి ఇప్పటికీ నియోజకవర్గం వైపు కన్నెతైనా చూడలేదు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ మూడు, నాలుగు గ్రూపులుగా విడిపోయింది. ప్రస్తుతం ఉప ఎన్నిక అనగానే అందరూ కార్యకర్తలకు టచ్‌లోకి వస్తున్నారు. దీంతో ఎన్నికలు ఉన్నప్పుడే తాము గుర్తొస్తామా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని ఖరారు చేసేందుకు పీసీసీతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దామోదర రాజనర్సింహా, గీతారెడ్డి, జగ్గారెడ్డి తదితర నేతలు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండే నేతకే అవకాశం కల్పించాలని స్థానిక నేతలు కోరుతున్నారు.

బీజేపీలో రెండు గ్రూపులు..

దుబ్బాకలో బీజేపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. టికెట్ తనదేనంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావు ఇప్పటికే నియోజక వర్గంలో పర్యటిస్తుండగా.. మిరుదొడ్డి మండలానికి చెందిన తోట కమలాకర్ రెడ్డి సైతం టికెట్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రఘునందన్‌రావు 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కేవలం 22,599 ఓట్లు మాత్రమే సాధించి ఓటమి పాలయ్యారు. 2019‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి‌పై సైతం పోటీ చేసి ఓడిపోయారు.

పోటీలో కత్తి కార్తీక..

ఇటీవలే దుబ్బాకను వచ్చిన టీవీ యాంకర్ కత్తి కార్తిక తాను దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. తనది చేగుంట గ్రామమని వెనుకబడి దుబ్బాక నియోజకవర్గన్ని అభివృద్ధి చేస్తానని, పేద ప్రజలను ఆదుకుంటానని చెబుతోంది. ఎప్పుడూ లేనిది ఓ టీవీ యాంకర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననడంతో చాలా మంది ఆలోచనలో పడ్డారు.

టీఆర్‌ఎస్‌కు అసమ్మతి సెగ..

దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కొందరు నేతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఉప ఎన్నికలో రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వొద్దంటూ పలువురు నేతలు సమావేశాలు సైతం నిర్వహించారు. తొగుటలో నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో సోలిపేట కుటుంబానికి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అనుకూల వ్యాఖ్యలు చేయడంతో అందరి ఆశలకు చెక్ పడింది.

Advertisement

Next Story