ప్రాణం తీసిన జిన్నింగ్ మిల్లు.. కార్మికుడి మరణం లోపలనా.. బయటనా?

by Sridhar Babu |   ( Updated:2021-12-18 11:44:18.0  )
ప్రాణం తీసిన జిన్నింగ్ మిల్లు.. కార్మికుడి మరణం లోపలనా.. బయటనా?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలోని జిన్నింగ్ మిల్లు మిషనరీలో పడి వలస కార్మికుడు మృతి చెందాడు. కావేరీ జిన్నింగ్ మిల్లులో మహారాష్ట్రకు చెందిన వలస కూలీ ఒకరు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్‌లో ఇరుక్కోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. రామడుగు పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మహాగన్ తాలూకాకు చెందిన మిలన్ మల్లయ్య తలండ (26) గత మూడేళ్లుగా వెలిచాలలోని కావేరి జిన్నింగ్ మిల్లులో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శనివారం తెల్లవారు జామున ఐదున్నర గంటల ప్రాంతంలో మిలన్ మల్లయ్య చలిని తట్టుకునేందుకు తలకు టవల్ చుట్టుకుని పని చేస్తున్నాడు. టవల్ మిషన్‌లో ఇరుక్కుని ఊరి పడటంతో తల, మెడకు గాయాలయ్యాయి. గమనించిన సహచర కూలీలు మిలన్ మల్లయ్యను చికిత్స కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడి అక్క స్వప్న తలాండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరణించింది ఎక్కడా..?

మహారాష్ట్రకు చెందిన వలస కూలీ మిలన్ మల్లయ్య ఎక్కడ చనిపోయాడన్న విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పని చేస్తుండగానే మిషన్‌లో ఇరుక్కున్నప్పుడే చనిపోయాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడని మిల్లు యాజమాన్యం చెబుతోంది. మిల్లులో చనిపోయినప్పుడు శవాన్ని అక్కడి నుంచి తొలగించడం చట్ట ప్రకారం నేరం అవుతుందనే ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్టు కట్టుకథ అల్లుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, మిల్లుతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి వర్కింగ్‌లో లేవని చెప్తున్నారని తెలుస్తోంది. రూ. కోట్ల విలువ చేసే మిషనరీతో పాటు కోట్లు పలికే కాటన్‌ జిన్నింగ్ మిల్లులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఏంటన్నదే అంతుచిక్కకుండా తయారైంది. సీసీ కెమెరాలు చెడిపోతే వాటిని యాజమాన్యం వెంటనే రిపేరు చేయించుకోకుండా ఉండటం వెనక ఆంతర్యం ఏంటీ అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. సంస్థ ఆస్తుల కోసమైనా సీసీ కెమెరాలను బాగు చేయించుకోకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

వలస చట్టాలు అమలు చేశారా..?

వలస కార్మికులను పనిలో పెట్టుకున్నప్పుడే లేబర్ యాక్టు ప్రకారం కార్మికశాఖలో వారి వివరాలను రికార్డు చేశారా? లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు రాష్ట్రంలో కోట్లాది మంది వలస కార్మికుల విషయం వెలుగులోకి వచ్చింది. అంచనాలకు మించిన వలస కార్మికులు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా కార్మిక చట్టాలకు పని చెప్పాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. ఒక్కో కార్మికునికి రూ. 21 వేల వేతనంతో పాటు వారి భాషకు సంబంధించిన పాఠశాలలను కూడా ఏర్పాటు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. లేబర్ యాక్టు ప్రకారం పలు రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం అవుతోంది. కానీ యాజమాన్యం మాత్రం తాము లేబర్‌ను కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా నియమించుకున్నామని చెబుతున్నారు.

అయితే, సదరు కాంట్రాక్టు ఏజెన్సీ కూడా నిబంధనల ప్రకారం రిజిస్టర్ అయిందా..? కార్మికులకు వేతనాలతో పాటు ఇతరాత్ర సౌకర్యాలు కల్పిస్తున్నారా? అన్న విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారా?, కేంద్ర కార్మిక చట్టాల ప్రకారం ఏజెన్సీ నడుచుకుందా లేదా అన్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వేళ కాంట్రాక్టు ఏజెన్సీతో సంబంధం లేకుండానే యాజమాన్యం వలస కార్మికులను నియమించుకుని కూడా నిబంధనల మేరకు నడుచుకోనట్టయితే వారిపైనా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారు.అంతేకాకుండా ఈ జిన్నింగ్ మిల్లులో ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుంది. రాత్రి వేళల్లో కూడా పనిచేసేందుకు అనుమతి తీసుకున్నారా? లేక పోతే నిబంధనలకు విరుద్ధంగా పని చేయించుకున్నారా? అన్న కోణంలో కూడా అధికారులు ఆరా తీయాల్సి ఉంది. అలాగే ఈ ఇండస్ట్రీలో సేఫ్టీ మేజర్స్ తీసుకున్నారా లేదా అన్న విషయంపై కూడా అధికారులు ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ అందించేందుకు యాజమాన్యం చొరవ తీసుకుందా లేదా అన్న విషయంపై కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

25 లక్షల ఎక్స్ గ్రేషియాకు డిమాండ్..

వెలిచాల కావేరి జిన్నింగ్ మిల్లులో వలస కార్మికుడు మిలన్ మల్లయ్య మృతిపై సమగ్ర విచారణ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండారు శేఖర్ డిమాండ్ చేశారు. వలస కార్మికులు అయినందున కార్మికు చట్టాలను అమలు చేశారా లేదా అన్న విషయం తేలాల్సి ఉందన్నారు. మృతుని పేరు లేబర్ ఆఫీసులో నమోదు చేయలేదని ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు చనిపోయాడని, గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని తరలించారని మండిపడ్డారు. కావేరి జిన్నింగ్ మిల్ యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అతని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని శేఖర్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed