హనుమంతుడి ఆలయంలో అధికారుల చేతివాటం..

by Sumithra |   ( Updated:2021-03-24 07:32:10.0  )
హనుమంతుడి ఆలయంలో అధికారుల చేతివాటం..
X

దిశ, కల్వకుర్తి : ఆలయాన్ని, ఆలయ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆలయ సిబ్బందే అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయంలో ఒకరు సస్పెండ్ అవ్వగా, మరొకరికి మెమో జారీ జాయింది. ఈ ఘటన కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఊరుకొండ మండలం ఊరుకొండ పేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి ఆలయంలో గత నెల బ్రహ్మోత్సవాల సందర్బంగా ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదానం చేశారు. అందుకోసం ప్రతి శనివారం ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు దాతలు సమకూర్చిన 7 క్వింటాళ్ల బియ్యాన్ని ఆలయం నుంచి క్లర్క్ ఏఎన్ శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా తరలించి ఓ వ్యాపారికి విక్రయించాడు.

విషయం బయటికి రావడంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి రామేశ్వర శర్మ సదరు ఉద్యోగి నుంచి విక్రయించగా వచ్చిన రూ.26,250లను రికవరీ చేసి గుట్టుచప్పుడు కాకుండా ఆలయ అకౌంట్‌లో జమచేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆలయ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవో ప్రమేయంతోనే ఆలయంలో అక్రమాలు జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులతో దురుసుగా ప్రవర్తించడం, వాహన పూజలు చేసి డబ్బులు డిమాండ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని భక్తులు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహన పూజ టికెట్ తీసుకున్నా కూడా తిరిగి ఒక్కో వాహన యజమాని దగ్గర రూ. 500 నుంచి 1000 వరకు డిమాండ్ చేస్తున్నారని పూజలు నిర్వహించిన వారు పేర్కొంటున్నారు. ఆలయ ఈఓ పై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపించి, వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. గతంలో కూడా ఆలయంలో అక్రమాలు జరిగినట్లు సమాచారం.

బియ్యం అమ్మింది వాస్తవమే..

ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఏఎన్ శ్రీనివాస్ రెడ్డి అను ఉద్యోగి ఆలయ స్టోర్ రూమ్ నుంచి 7 క్వింటాళ్ల బియ్యం తీసుకెళ్లి అమ్మింది వాస్తవమే.. ఉత్సవాల సమయంలో ఆలయం వద్దనే ఉన్న నేను ఉత్సవాలు ముగిశాక మూడు రోజులు ఇంటికెళ్లాను. అదే సమయంలో ఇది జరిగింది. విషయం తెలియగానే నేను వచ్చి క్లర్క్ వద్ద డబ్బులు రికవరీ చేసి ఆలయ అకౌంట్లో జమ చేశాను. అవినీతికి పాల్పడిన శ్రీనివాస్ రెడ్డిని ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు సస్పెండ్ చేశాను. మరో ఉద్యోగికి కూడా మెమో జారీ చేశాను.

-ఆలయ కార్య నిర్వహణ అధికారి రామేశ్వర శర్మ

Advertisement

Next Story

Most Viewed