కరోనా పాండమిక్‌లో తల్లి పాల దానం..

by Sujitha Rachapalli |
కరోనా పాండమిక్‌లో తల్లి పాల దానం..
X

దిశ, వెబ్‌డెస్క్: పుట్టిన బిడ్డలకు తల్లిపాలకు మించిన పోషకాహారం లేదు. చిన్నవయస్సులో తల్లిపాలు బాగా తాగినవారే బలంగా, తెలివిగా తయారవుతారని అంటుంటారు. అయితే వివిధ ఆరోగ్య కారణాల దృష్ట్యా అందరు తల్లులకు తమ బిడ్డలకు కావాల్సినన్ని పాలు ఇచ్చే అదృష్టం ఉండదు. దీంతో ఆ పిల్లలకు సరైన పోషణ లేక అనారోగ్యం పాలవుతున్నారు.

ఇంకా కొందరైతే లేత వయస్సులోనే చనిపోతున్నారు. కృత్రిమంగా ఎన్ని పోషకాహారాలను అందించినా సహజంగా ఉత్పత్తయ్యే తల్లిపాలకు ప్రత్యామ్నాయం కాలేవు. అందుకే వాటిని పవిత్రంగా చూస్తుంటారు. ఆ పవిత్రత కారణంగానే తల్లిపాలను దానం చేయడాన్ని చాలా మంది స్వాగతించారు. కానీ, పాలను దానం చేయడం ద్వారా ఎంతో మంది చిన్నారులను కాపాడొచ్చనే విషయాన్ని గుర్తుచేసుకోరు. తల్లిపాల దానం గురించి అవగాహన పెంచడానికి ఇప్పటికీ స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నా పెద్దగా మార్పు రావడం లేదు. ఫిల్మ్ మేకర్ నిధి పార్మర్ హీరనందనీ చేసిన పని ఇప్పుడు తల్లిపాల దానం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. ఇంతకీ ఆమె ఏం చేసింది?

ముంబైకి చెందిన 42 ఏండ్ల నిధికి పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. వాటిని నింపి ఇంట్లో ఫ్రీజర్‌లో పెట్టేది. మూడు నాలుగు నెలల తర్వాత ఫ్రీజర్‌లో పెట్టినా తల్లిపాలు పాడవుతాయని నిధి ఇంటర్నెట్‌లో చూసి తెలుసుకుంది. ఇలా అదనంగా ఉత్పత్తి అవుతున్న పాలను ఏం చేయాలని నిధి, స్నేహితులను అడిగింది. వాటితో ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవాలని, ఆ పాలతో బిడ్డకు స్నానం చేయించాలని, ఫేస్‌క్రీమ్‌లు తయారుచేసే కంపెనీలకు అమ్మాలని సలహాలు ఇచ్చారు. ఈ సలహాలేవీ నిధికి నచ్చలేదు. ఇంకొద్దిసేపు ఇంటర్నెట్ సెర్చ్ చేస్తే ఆమెకు తల్లిపాలను ఏం చేయాలో ఒక ఐడియా వచ్చింది.

అమెరికాలో తల్లిపాల బ్యాంక్‌లు ఉంటాయని తెలిసింది. మన దేశంలో కూడా అలాంటి ఆస్పత్రుల గురించి తెలుసుకోవాలనుకుంది. తన గైనకాలజిస్ట్ ద్వారా ముంబైలోని ఖార్‌లో ఉన్న సూర్య హాస్పిటల్ వారు ఇలాంటి బ్యాంక్ నడుపుతున్నారని తెలిసింది. ఆమె ఆస్పత్రికి తల్లిపాలను అందించే సమయంలోనే లాక్‌డౌన్ ప్రారంభమైంది. దీంతో అప్పటికే ఆస్పత్రిలో ఉన్న 65 మంది పిల్లలకు నిధి పాలు వరంగా దొరికాయి. మే నెల నుంచి మొదలుకొని ఇప్పటివరకు ఆమె 42 లీటర్ల పాలను ఆస్పత్రికి దానం చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed