ఐదేళ్లలో ఆన్‌లైన్ కిరాణ వృద్ధి ఎనిమిది రెట్లు!

by Harish |
ఐదేళ్లలో ఆన్‌లైన్ కిరాణ వృద్ధి ఎనిమిది రెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఈ-కామర్స్ వ్యాపారం గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల రిలయన్స్ రిటైల్ వారి జియోమార్ట్ ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత అనేక మార్పులొచ్చాయి. ముఖ్యంగా ఈ-కామర్స్‌లో ఇటీవల కీలక మార్పు ఆన్‌లైన్ కిరాణా డెలివరీ. రానున్న ఐదేళ్లలో ఈ విభాగం ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉంది. 2024 నాటికి కిరాణా డెలివరీ విభాగం దేశ వృద్ధిలో కీలకపాత్రను అందించనుంది. 2020 క్యాలెండర్ ఏడాదిలో ఈ-కిరాణా మార్కెట్ 60 శాతం వృద్ధి చెందిందని, 2021 క్యాలెండర్ ఏడాది ఇది 41-49 శాతం వృద్ధి చెందుతుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ అభిప్రాయపడుతోంది.

అదేవిధంగా ఆన్‌లైన్ కిరాణా డెలివరీలో జియోమార్ట్ ముందంజలో ఉంటుందని భావిస్తోంది. ‘ఈ పరిణామాలు చిన్న వ్యాపారులకు కలిసొస్తుంది. ఆన్‌లైన్ రిటైల్ అమ్మకాల భవిష్యత్తు వృద్ధి పుంజుకుంటుంది. రానున్న నెలల్లో జియోమార్ట్ ఖచ్చితంగా కీలకపాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నట్టు గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫారెస్టర్ సీనియర్ అనలిస్ట్ సతీష్ మీనా చెప్పారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ కిరాణా అండతో ఆన్‌లైన్ రిటైల్ అమ్మకాలు 2019-2024 మధ్య 30 శతం వార్షిక వృద్ధి రేటుతో సుమారు రూ. 26.5 లక్షల కోట్లకు చేరుకునే అవకాశముందని సతీష్ అభిప్రాయపడ్డారు. రానున్న ఐదేళ్లు ఎక్కువ మార్కెట్ పెట్టుబడులు కిరాణాలోనే ఉంటాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed