25 నుంచి డొమెస్టిక్ విమానాల టేకాఫ్

by Shyam |   ( Updated:2020-05-23 08:04:35.0  )
25 నుంచి డొమెస్టిక్ విమానాల టేకాఫ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రేపటి నుంచి దేశీయ(డొమెస్టిక్) విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని అందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేశామని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) సీఈవో ఎస్‌జీకే కిషోర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయంలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేందుకుగాను విమానాశ్రయంలో ప్రత్యేకంగా గుర్తులు ఏర్పాటు చేశామన్నారు. బోర్డింగ్ పాసుల కోసం ప్రయాణికులు క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ప్రవేశించినప్పటి నుంచి ప్రతి దశలో ప్రయాణికులకు శానిటైజర్స్ అందించనున్నట్టు చెప్పారు. ప్రయాణికులు లగేజీ తీసుకెళ్లే ట్రాలీలను శానిటైజ్ చేసేందుకు ప్రత్యేకంగా డిసిన్ఫెక్టివ్ టన్నెల్స్ ఏర్పాటు చేశామన్నారు. విమానాల్లో ఆహారం తీసుకునేందుకు అనుమతి లేదని.. ప్రయాణికులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని ఆర్‌జీ‌ఐ‌ఏ సీఈవో కిషోర్ వివరించారు.

ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తే నడుపుతాం: ఆర్టీసీ గ్రేటర్ ఈడీ

సోమవారం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రయాణికులను సురక్షితంగా ఎయిర్ పోర్టు చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధంగా ఉందని సంస్థ గ్రేటర్ హైదరబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 55పుష్పక్ ఎయిర్ పోర్టు లైనర్ బస్సులను సోమవారం నుంచి నడిపేందుకు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలిచ్చామని తెలిపారు. అయితే పుష్పక్ బస్సులు నడపాలని తమకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని ఈడీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed