వరి రకాల్లో ప్రమాదకరమైన ‘ఆర్సెనిక్’.. 200 మిలియన్ ప్రజలపై ప్రభావం

by Shyam |
వరి రకాల్లో ప్రమాదకరమైన ‘ఆర్సెనిక్’.. 200 మిలియన్ ప్రజలపై ప్రభావం
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా మన ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ స్థాయి తక్కువగానే ఉంటుంది కానీ బియ్యంలో మాత్రం 10-20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వరి పొలాలకు కలుషితమైన భూగర్భ జలాలను ఉపయోగించడమే దీనికి ప్రధాన కారణం కాగా దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 మిలియన్ మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. తద్వారా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, లివర్ ఫైబ్రోసిస్, హృదయ సంబంధ వ్యాధులు, చర్మ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ఆరోగ్య ప్రమాదాలు తలెత్తనున్నాయని కొత్త అధ్యయనం పేర్కొంది. గత నెలలో ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించిన కథనంలో పదిహేను వరి రకాలు ఆర్సెనిక్‌ను ఎలా తీసుకుంటాయి, ఏ విధంగా నిల్వ చేస్తాయని వివరించారు. ధాన్యాల రూట్, షూట్‌లలో ఆర్సెనిక్ ఏర్పడటాన్ని అధ్యయనం చేసిన బృందం.. మనం ఎంత ఆర్సెనిక్‌ తీసుకుంటామో అర్థం చేసుకునేందుకు వివిధ పద్ధతుల్లో అన్నం కూడా వండి చూశారు.

ఆర్సెనిక్ అనేది భూమి క్రస్ట్‌లో కనిపించే నేచురల్ కంపోనెంట్. ఎర్త్‌క్రస్ట్‌లో ఆర్సెనిక్ సాంద్రత కేవలం 1 -1.8 mg/kg. సాధారణంగా అకర్బన రూపంలోని ఆర్సెనిక్ విషపూరితమైనది కాగా.. విభిన్న బియ్యం రకాలు, బియ్యం ఆధారిత ఉత్పత్తులలో ఉన్నట్లు అధ్యయనాలు కనుగొన్నాయి. ఆర్సెనిక్ కలిగి ఉన్న పురుగుమందులు ఇప్పుడు ఎక్కువగా నిషేధించబడినప్పటికీ, ఆర్సెనిక్ శతాబ్దాల పాటు మట్టిలో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ‘ఇతర తృణధాన్యాలతో పోల్చితే, ఆర్సెనిక్ తీసుకునే ధోరణి వరి మొక్కల్లో అధికం. ఎందుకంటే అవి బురదమట్టిలో పెరుగుతాయి. ఈ వాతావరణం మొక్క తీసుకునే రసాయన సాంద్రతను పెంచుతుంది. వాతావరణ మార్పులతో వరి మొక్కల్లో ఆర్సెనిక్ స్థాయి పెరుగుతుందని అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రత రైస్ టిష్యూల్లో ఆర్సెనిక్ సాంద్రతలను పెంచుతుంది’ అని అధ్యయనంలో వెల్లడైంది. దీంతో బియ్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది.

ఏ వరి ధాన్యంలో ఎక్కువ?

‘EPAGRI 108, TCSY 837, కలిజిరా’ లాంటి వరి రకాల్లో తక్కువ ఆర్సెనిక్‌ ఉండగా, ‘ BRRI ధన్ 47, BRRI ధన్ 32, IIY 416’ వరి రకాల్లో అధిక మొత్తంలో ఆర్సెనిక్ పేరుకుపోతున్నట్లు గత అధ్యయనాలు వెల్లడించాయి. ఇక ప్రస్తుత పరిశోధనలో మూడు విభిన్న సమూహాల నుంచి 15 వరి రకాలను(స్థానిక సుగంధ వరి, అధిక దిగుబడినిచ్చే రకాలు, హైబ్రిడ్ వరి) ప్రామాణిక సాగు పద్ధతులను అనుసరించి సహజంగా కలుషితమైన పొలంలో పరీక్షించారు. షూట్, రూట్ సహా మూడు వేర్వేరు వృద్ధి దశలలో ఆర్సెనిక్ స్థాయిలపై అధ్యయనం నిర్వహించింది. స్థానిక సుగంధ వరి రకాలైన రాధాతిలక్, గోవిందభోగ్, బద్సభోగ్, దూధేశ్వర్ వంటి వాటిలో ఆర్సెనిక్ అత్యల్పంగా పేరుకుపోయినట్లు గమనించిన శాస్త్రవేత్తలు.. అధిక దిగుబడినిచ్చే‘స్వర్ణ మసూరి, సిఆర్ ధన్, ప్రతీఖ్య’.. ‘ప్రో-ఆగ్రో, సిఆర్ ధన్, అరైజ్, రాజలక్ష్మి, అజయ్’లాంటి హైబ్రిడ్ రకాల్లో ఉన్న ఆర్సెనిక్ లెవల్స్ ఆందోళనకరమని నిర్ధారించారు.

స్థానిక సుగంధ, కొన్ని అధిక దిగుబడినిచ్చే రకాలను (శతబ్ది, స్వర్ణ) క్రమం తప్పకుండా తీసుకునే వారికి శుభవార్త. ఆర్సెనిక్ విషాన్ని అరికట్టడానికి ఇతర ప్రాంతాల రైతులు ఈ రకాలను పెంచాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

– సైంటిస్ట్ రుబీనా ఖానమ్, ICAR- నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కటక్

బియ్యంలో ఆర్సెనిక్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది?

ప్రస్తుతం ఆర్సెనిక్ ఉందో లేదో తెలుసుకునే ఇంటి పరీక్షలు లేవు. సురక్షితంగా ఉండటానికి ఉత్తమ మార్గం సాంప్రదాయ గ్రుయల్ పద్ధతి(gruel way)లో బియ్యం వండి, గంజి పారబోయాలని పశ్చిమ బెంగాల్‌లోని బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ వ్యవసాయ రసాయన శాస్త్రం, నేల విజ్ఞాన శాఖ సహ రచయిత ప్రొఫెసర్ బిశ్వపతి మండల్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed