పరేషాన్.. పోలియో చుక్కలకు రారంటా!

by Anukaran |
పరేషాన్.. పోలియో చుక్కలకు రారంటా!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17నుంచి 19వరకు మూడు రోజుల పాటు అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు సిబ్బంది కొరత, మరోవైపు అంతకంతకు కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండడతో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి అధికారులతో సమావేశమై కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న చాలామంది సిబ్బంది కొవిడ్​ భారీన పడడంతో పోలియో చుక్కలు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తప్పని సరిగా విధులకు హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా ఆరోగ్య సమస్యలతో విధులకు హాజరు కాలేమని చెబుతున్నట్లు సమాచారం. దీంతో మూడు రోజుల పల్స్ పోలియోకు ఎన్నడూ లేని విధంగా సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉంది.

2,800 పోలియో కేంద్రాలు…

ఈ నెల 17నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ప‌ల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజ‌య‌వంతం చేయాల‌ని కలెక్టర్​ శ్వేతామ‌హంతి ఆదేశించారు. ప‌ల్స్ పోలియో ఏర్పాట్లపై ఇటీవల సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ స‌మావేశం నిర్వహించారు. జిల్లాలో 5 సంవత్సరాలలోపు చిన్నారులు 5,15,520మంది ఉన్నార‌ని, వారికోసం 2,800 పోలియో బూత్ లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే సిబ్బంది ఎంతమంది అనేది మాత్రం ప్రకటించలేదు. దీంతో సిబ్బంది కొరత అధికారుల దృష్టిలో కూడా ఉన్నట్లు స్పష్టమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూడు రోజుల పాటు ఉద‌యం 7గంట‌ల నుంచి సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు ప‌ల్స్ పోలియో కొన‌సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నా కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

కార్పొరేటర్లకు వలంటీర్ల బాధ్యతలు..

వైద్యారోగ్యశాఖ సిబ్బంది పల్స్ పోలియో పంపిణీకి విముఖంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్ల సేవలు పల్స్ పోలియో పంపిణీకి వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో డీసీ లు కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ నెల 17నుంచి నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించాలని, ఇందుకోసం వలంటీర్లను ఎంపిక చేసి వారితో పోలియో చుక్కలు వేయించేందుకు సహకరించాలని కోరారు. వారే కాకుండా ఎన్జీవోలు, రోట‌రీ క్లబ్​, ఐసీడీఎస్​, ల‌య‌న్స్ క్లబ్​, రెడ్​క్రాస్​, సీనియ‌ర్ హెల్త్ అధికారుల స‌హ‌కారంతో పోలియో చుక్కలు వేయాల‌ని సూచించడం గమనార్హం. అయితే వారు కూడా ముందుకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు.

సరైన సమయమేనా…?

కొవిడ్​ కేసులు పెరుగుతున్న తరుణంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం సరైందేనా అనే అనుమానాలను అధికారులతోపాటు ప్రజలూ వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో లేకున్నా మూడు రోజుల పాటు పల్స్ పోలియో నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నవంబర్ 19న రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రెటరీలకు సర్క్యులర్ పంపింది. దీంతో అధికారులకు పోలియో చుక్కల పంపిణీకి ఏర్పాట్లు చేయక తప్పడం లేదు. సమూహాలుగా ఉండేచోట్లకు పిల్లలను తీసుకురావడం, చుక్కలు వేసే వారిని ఇళ్లలోకి వచ్చేందుకు ప్రజలు ఎంత వరకు అనుమతిస్తారనేది వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సైతం వేధిస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో పోలియో చుక్కలు వేసే బదులు నెల రోజులు వాయిదా వేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story