డేటింగ్ కోసం లక్షల రూపాయలు మోసపోయిన డాక్టర్

by Sumithra |
డేటింగ్ కోసం లక్షల రూపాయలు మోసపోయిన డాక్టర్
X

దిశ, క్రైమ్ బ్యూరో : సైబర్ మోసాలు రోజుకో కొత్త తరహాలో పుట్టుకొస్తున్నాయి. ఒక్కొక్కరు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. అయినా, ప్రజల్లో సైబర్ మోసాల పట్ల అవగాహన రాలేకపోతున్నారా.. అనే సందేహాలు కలుగుతున్నాయి. మోసపోతున్న వారి జాబితాలో ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి రిపిటేషన్ కలిగిన వారే ఉంటుండటం గమనార్హం. గూగుల్ ప్లేలో ‘జిగోలో’ సర్వీసెస్ ద్వారా సైబర్ మోసగాళ్లు ఫోన్ నెంబర్లను గుర్తిస్తున్నారు. ఫేస్‌బుక్, ఓఎల్ఎక్స్, లోకాంటో తదితర సోషల్ మీడియా వేదికలలో డేటింగ్ సర్వీస్ వెబ్‌సైట్ లింక్‌ను ప్రకటనలు రూపంలో ఉంచుతున్నారు.

ఈ ప్రకటనకు ఆకర్షితులైన వారికి అమ్మాయిలతో మాట్లాడిస్తూ.. డేటింగ్‌కు రెడీ అంటూ లక్షలాది రూపాయలను లాగుతున్నారు. తాజాగా 60 ఏళ్ల వైద్యుడు డేటింగ్ సర్వీస్ పేరుతో ఏకంగా రూ.41.50 లక్షలకు మోసపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌కు చెందిన ఈ వైద్యుడు (60) డేటింగ్ సర్వీస్ పేరుతో వచ్చిన ప్రకటనలకు ఆకర్షితుడై ఒకేసారి రూ.40 లక్షలను వాళ్ళు చెప్పిన బ్యాంక్ అకౌంట్ల బదిలీ చేశాడు. మోసపోయినట్టుగా గ్రహించిన అతడు చివరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే.. మరో సారి రూ.1.50 లక్షలను వారి అకౌంట్‌లకు బదిలీ చేశాడు. దీంతో సదరు వైద్యుడు మొత్తం రూ.41.50 లక్షలకు మోసపోయాడు.

ఢిల్లీ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ డేటింగ్ సర్వీస్.. ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కౌశల్ చౌదరి (30) ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నోయిడాలో నివసిస్తున్నాడు. గ్రేటర్ నోయిడాకు చెందిన ఉమేష్ యాదవ్, మరో ఇద్దరితో కలిసి డేటింగ్ సర్వీస్‌ను ప్రారంభించాడు. ప్రత్యేక గూగుల్ సర్వీస్ ద్వారా ఫోన్ నెంబర్లను సేకరిస్తూ డేటింగ్ పట్ల ఆకర్షితులయ్యే వారికి బెంగాల్‌కు చెందిన అమ్మాయిలతో మాట్లాడిస్తూ ముగ్గులోకి దించుతున్నాడు. అనంతరం వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు సీసీఎస్ పోలీసులు కనుగొన్నారు. ఈ సందర్భంగా కౌశల్ చౌదరి, ఉమేష్ యాదవ్‌లను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ జాయింట్ సీపీ అవినాష్ మహాంతి తెలిపారు. ఈ సందర్భంగా 4 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు, డెబిట్ కార్డు, పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story