మొదటి ప్రాధాన్యత ఓటుపై నమ్మకం లేదా..?

by Shyam |
మొదటి ప్రాధాన్యత ఓటుపై నమ్మకం లేదా..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: పట్టభద్రుల ఎన్నికలంటే ఒకప్పుడు సామాన్య ప్రజలకు అవగాహనే లేదు. పట్టభద్రులై ఉండి ఓటు నమోదు చేసుకోని వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి పౌరుడికి పట్టభద్రుల ఎన్నికపై అవగాహన ఏర్పడింది. కానీ ఓటింగ్, కౌటింగ్ విధానంలో అనేక సందేహాలున్నాయి. సాధారణ ఎన్నికల్లో అయితే ఏ అభ్యర్ధికి ఎక్కవ ఓట్లు పోలైతే వారే విజయం సాధిస్తారు. ఈ పట్టభద్రుల ఎన్నికల సరళి విభిన్నంగా ఉంటుంది. అయితే అనేక మంది పట్టభద్రులు ఓటు నమోదు చేసుకున్నప్పటికి ఓటు వేసే పద్దతిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే అభ్యర్ధికి ఓటు వేస్తే సరిపోతుందనే భావన కొంత మంది పట్టభద్రులల్లో కనిపిస్తోంది. కానీ ఈ ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్ధులు బరిలో నిలిచారో అంతమందికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపు, ఓటములు నిర్ణయించబడవు. ఈ మొదటి ఓటులో ఒకే అభ్యర్ధికి సగానికి పైగా ఓట్లు నమోదు అయితే తప్పా గెలిచే అవకాశం ఉండదు. ఇలాంటి సందర్భంలో ప్రస్తుత పరిస్థితిలో మొదటి ఓటుతో గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన అభ్యర్థులు రెండవ ప్రాధాన్యత ఓటుపై దృష్టి పెడుతున్నారు.

రెండు, మూడోవ ప్రాధాన్యత ఓటు కీలకమే..

పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతీ ప్రాధాన్యతా ఓటు కీలకమేనని తెలుస్తోంది. బలమైన అభ్యర్థులు బరిలో నిలిచినప్పుడు పోటీ తీవ్రత పెరిగిపోతుంది. అప్పుడు మొదటి ప్రాధాన్యత గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లు సైతం ప్రతిష్టాత్మకమే. కనుక బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం మొదటి ప్రాధాన్యత ఓటే వేయాలంటే కష్టమనే భావన కనిపిస్తోంది. అందుచేత క్రమ సంఖ్యల ఆధారంగా పోలైన ఓట్లల్లో 50 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థులే విజయం సాధిస్తారు.

ఉదాహరణకు మహాబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానానికి మొత్తం పోలైన ఓట్లు 50 అనుకుంటే.. అందులో ఎవరికి 26 ఓట్లు వస్తాయో అతనే విజయం సాధిస్తారు. పోటీలో ముగ్గరు అభ్యర్ధులు బరిలో నిలిచారు. అందులో మొదటి ప్రాధాన్యత ‘ఏ’ అభ్యర్ధికి 23 ఓట్లు రాగా, ‘బీ’ అభ్యర్ధికి 17 ఓట్లు, ‘సీ’ అభ్యర్ధికి 10 ఓట్లు పోలైనాయి. అయితే ‘ఏ’ అభ్యర్థికి మెజారిటీ ఓట్లు వచ్చాయి కాని గెలవలేదు. గెలుపునకు దగ్గరగా ఉన్నాడు. అప్పుడు రెండవ కౌంటింగ్ ప్రారంభిస్తారు. అందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువగా పోలైన అభ్యర్ధిని లెక్కింపు నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత తొలగించిన ‘సీ’ అభ్యర్ధికి పోలైన 10 ఓట్లల్లో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎన్ని పడ్డాయో చూస్తారు. ‘ఏ’ అభ్యర్ధి మొదటి ప్రాధాన్యత ఓట్లు 23, రెండవ ప్రాధాన్యత ఓట్లు 1 కలిపి మొత్తం 24 పోలైనాయి. అదే ‘బీ’ అభ్యర్ధికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 17, రెండవ ప్రాధాన్యత ఓట్లు 9 కలిపి మొత్తం 26 పోలైనాయి. అప్పుడు గెలుపునకు అవసరమైన 26 ఓట్లు ‘బీ’ అభ్యర్ధికి రావడంతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటిస్తారు. ఈ విధంగా గెలిచే అభ్యర్ధికి సగానికి పైగా ఓట్లు వచ్చే వరకు కౌంటింగ్ జరుగుతుంది. దీంతో ప్రతి ప్రాధాన్యత ఓటు క్రీయశీలకమేనని తెలుస్తోంది.

ప్రధాన పార్టీలు రెండవ ప్రాధాన్యత ఓటుపై దృష్టి..

ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్.. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీల స్ధానం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం అధికసంఖ్యలో బరిలో నిలిచారు. వీరందరూ ఎవరికి వారే ప్రచారం నిర్వహించుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్ధానం నుంచి 93 మంది.. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వామపక్షాల అభ్యర్థులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రీయశీలకంగా పనిచేసిన నాయకులు, విద్యావంతులు సైతం బరిలో ఉండటం విశేషం. ఈ రెండు పట్టభద్రుల స్ధానాల్లో బలమైన అభ్యర్థులు బరిలో నిలువడంతో మొదటి ప్రాధాన్యత ఓటుతో సగానికి పైగా ఓట్లు నమోదయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల బలమైన అభ్యర్ధులు రెండు, మూడవ ప్రాధాన్యత ఓట్లపైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed