‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది: జగన్

by srinivas |
‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది: జగన్
X

దిశ చట్టం చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పీఎస్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘దిశ’ కార్యశాలలో సీఎం పాల్గొని మాట్లాడారు. . రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నేరస్థులతో నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. ‘దిశ’ చట్టం దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలే తమ తొలి ప్రాధాన్య అంశమన్నారు. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన చాలా బాధాకరమని.. నలుగురు కలిసి తాగితే ఏం చేస్తారో అర్థం కావడంలేదన్నారు. మహిళలకు భద్రత లేదనడానికి దిశ ఘటన ఓ ఉదాహరణ అన్న ఆయన.. నిర్భయ ఘటనలో దోషులకు ఇప్పటికీ శిక్ష పడలేదన్నారు. త్వరగా న్యాయం జరిగి, శిక్షలు వెంటనే పడితే వ్యవస్థలో భయం పెరుగుతుందని.. 8 ఏళ్లయినా నిర్భయ నిందితులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగితే 7 రోజుల్లోపే దర్యాప్తు పూర్తి చేసి 21 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడేలా చట్టం రూపొందించామని వివరించారు. ఈ నెలాఖరుకల్లా 18 దిశ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed