తెలంగాణలో కొలువుల జాతర.. మరి కాసేపట్లో కీలక ప్రకటన..!

by Anukaran |   ( Updated:2021-07-13 03:21:53.0  )
Jobs Vacancies in Telangana
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్​అధ్యక్షతన మరికొద్దిసేపట్లో మొదలుకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న కేబినెట్‌పై ఈసారి నిరుద్యోగుల్లో ఉత్కంఠ పెరిగింది. ప్రతీసారి కేబినెట్ భేటీ సందర్భంగా ఏదో ఒక అంశం కీలకంగా మారుతోంది. ఇప్పటి వరకు కరోనా పరిస్థితులు, లాక్​డౌన్​, సడలింపులపై ప్రధాన చర్చ ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కొలువుల భర్తీపై చాలా ఆసక్తి నెలకొంది. చాలా ఏండ్ల తర్వాత నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా కసరత్తు చేసింది. రెండు రోజుల పాటు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఇదే అంశంపై బీఆర్కే భవన్‌లో సమావేశాలు నిర్వహించారు. మొత్తానికి 45,281 ఖాళీలతో తుది నివేదికను సిద్ధం చేసి, మంగళవారం ఉదయం సీఎం చేతికి అందించారు. ఉదయం ప్రగతిభవన్‌కు వెళ్లిన సీఎస్.. రాష్ట్రంలో ఆయా శాఖల్లో ఖాళీలపైన పూర్తి నివేదికను సీఎంకు సమర్పించారు.

నిరుద్యోగుల ఎదురుచూపులు

రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్​ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎస్ సోమేశ్​ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో సుదీర్ఘమైన కసరత్తు చేశారు. ఎట్టకులకే 45 వేల ఖాళీలపై స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటించిన విధంగా 50 వేల ఉద్యోగాల భర్తీపై నేడు జరిగే కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు కొత్త కొలువుల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. టీఎస్‌‌పీఎస్సీలో 2021 ఫిబ్రవరి వరకు 26.40 లక్షల మంది నిరుద్యోగులు నమోదై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు కేబినెట్ భేటీపై ఉత్కంఠతో ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎన్ని ఉద్యోగాల భర్తీపై ప్రకటన వస్తుంది, టీఎస్​పీఎస్సీ నుంచి ఎన్ని భర్తీ చేస్తారనే వివరాల కోసం ఆసక్తి నెలకొంది. కేబినెట్‌లో చర్చ తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అంశంపై సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అధికారవర్గాల్లో టాక్.

ఇంకో ప్రాధాన్యత భూముల ధర పెంపు

మంత్రివర్గ సమావేశంలో కరోనా పరిస్థితులు, పల్లె, పట్టణ ప్రగతి, వ్యవసాయం, ఇరిగేషన్, ఉద్యోగ నోటిఫికేషన్, తాజా రాజకీయ సమీకరణాలే ప్రాధాన్యత అని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఉద్యోగాల భర్తీ మొదటిది కాగా.. రెండో అంశం రాష్ట్రంలో భూముల ధరల పెంపు అంశమే. రిజిస్ట్రేషన్ల విలువల పెంపుపై ఇప్పటికే ఆ శాఖ నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారు. ఎక్కడ.. ఎంత మేరకు పెంచాలనే అంశాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దీనిపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. అదే విధంగా కృష్ణానది జలాల వివాదంపై ఈ నెల 23 ఎన్జీటీలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో నేడు కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడుగా ఏపీ ప్రభుత్వం జల వివాదాలపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. మరోవైపు కేబినెట్‌లో తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్‌ను ఇటీవలే ఉపసంహరించుకుంది. ఈ జల వివాదాలపై అటు కేంద్రం కూడా వేడుక చూస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మంత్రివర్గం చర్చించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed