దేవుడ్ని చూపిస్తానని..నడ్డి విరగ్గొట్టుకున్నాడు

by srinivas |
దేవుడ్ని చూపిస్తానని..నడ్డి విరగ్గొట్టుకున్నాడు
X

దిశ, ఏపీబ్యూరో: పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నారు పెద్దాలు. కొంత మంది దేవుడ్ని నమ్ముతారు, ఇంకొంతమంది దేవుడ్ని నమ్మరు. ఎవరిష్టం వారిది. అయితే కొంత మంది మాత్రం తాము నమ్మిన దేవుడ్ని నమ్మితీరాలంటూ స్నేహితులపై ఒత్తిడి చేస్తుంటారు. అలా తాగిన మైకంలో దేవుడ్ని చూపిస్తానంటూ 70 అడుగుల లోతు బావిలో జారిపడి నడ్డివిరగ్గొట్టుకున్నాడో ప్రబుద్దుడు. ఈ ఘటన కడప జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. చింతకొమ్మదిన్న సమీపంలోని మద్దిమడుగుకి చెందిన కిశోర్ నాయక్, సుగాలి బిడికికి చెందిన రామాంజనేయులు స్నేహితులు. బావి గట్టున కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మద్యం సేవించారు.

తాగిన మైకంలో వీరి చర్చ దేవుడిమీదకి మళ్లింది. దీంతో కిషోర్‌ నాయక్‌ దేవుడు ఉన్నాడని, రామాంజనేయులు దేవుడు లేడని వాదించడం మొదలుపెట్టారు. వీరి వాదన తారస్థాయికి చేరింది. దీంతో చిర్రెత్తిన కిశోర్ నాయక్ దేవుడున్నాడంటూ.. పక్కనే ఉన్న బావిలో గంగమ్మతల్లి ఉంది చూపిస్తానంటూ బావిలో దిగే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో నూతిలోని రాయిపై కాలు వేశాడు. అతని బరువుకి అది విరిగిపోయింది. దీంతో 70 అడుగుల లోతున్న బావిలో పడిపోయాడు. వెంటనే రామాంజనేయులు స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారోచ్చి కిషోర్ నాయక్‌ను రక్షించి, ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story