ఇండియన్ సూపర్ ఫుడ్స్ కోసం యూనిక్ క్యాలెండర్‌

by Shyam |
ఇండియన్ సూపర్ ఫుడ్స్ కోసం యూనిక్ క్యాలెండర్‌
X

దిశ, ఫీచర్స్ : ‘ఆహారమే ఔషధం’ అనేది తమిళనాడులో ప్రాచుర్యంలో ఉన్న ఒక నానుడి. అంటే భారతీయుల సంప్రదాయ వంటకాల్లో రోగాలను నయం చేసే అనేక ఔషధ గుణాలుండగా.. అలాంటి సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు పూర్తిగా మరిచిపోయాం. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన మీనాక్షి భూపతి అనే సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, భారతీయులు ‘మరిచిపోయిన ఆహారాల’ను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. తన ప్రయత్నాన్ని సులభతరం చేసేందుకు జనవరి 2020లో ‘ఫర్‌గాటెన్ ఫుడ్స్‌’ పేరుతో ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించింది. ఈ వేదికగా వంటకాలను పోస్ట్ చేస్తూ చాలా కాలం క్రితమే మరచిపోయిన ఇండియన్ సూపర్ ఫుడ్స్ ప్రయోజనాలను తెలియజేస్తోంది.

ఈ 12 నెలల కాలంలో మరో ముందడుగు వేసిన మీనాక్షి.. విత్తన-పొదుపుకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ ‘సహజ సమృద్ధ (కన్నడ ఫర్ బౌంటిఫుల్ నేచర్)తో కలిసి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)’ నుంచి పొందిన నిధులతో భారతదేశంలో మరచిపోయిన ఆహారాలను ప్రదర్శించే క్యాలెండర్‌ను పరిచయం చేసింది. ఈ ‘ఫర్‌గాటెన్ ఫుడ్స్ క్యాలెండర్’ జనవరి 2021లో ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ప్రారంభించబడింది. ఇందులోని 25 పదార్థాలు ‘తినదగిన పువ్వులు, పండ్లు, విత్తనాలు, రోగనివారణ ఆకులు, కాండం, కంద మూలాలు, దుంపలు’ అనే 5 విభాగాలుగా విశదీకరించబడ్డాయి.

తినదగిన పువ్వుల విభాగంలో.. కెఫిన్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడే సీతాకోకచిలుక బఠానీ గురించిన సమాచారం ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండే ఈ పువ్వులను బ్లూ రైస్ లేదా ఇతర పదార్థాల్లో నేచురల్ బ్లూ ఫుడ్ కలరింగ్ కోసం ఉపయోగించవచ్చు. పండ్లు, విత్తానాల్లో.. కన్నడలో నల్లటి నైట్‌షేడ్ లేదా మనతక్కాలి(బచ్చలికూర)గా పిలువబడే తీగజాతి మొక్కలు ఉంటాయి. ఇది విటమిన్ బి-కాంప్లెక్స్‌ పుష్కలంగా లభించే చిన్న పండ్లను కలిగి ఉండే పొద. అల్సర్స్‌ను నయం చేయడంలో సాయపడుతుంది. అరటి కాండం నుంచి తయారు చేసే పులావ్(థోర్ చాల్), కూవా లేదా ముల్లంగి నుంచి తయారు చేయబడిన హల్వా వంటి ఫుడ్ ఐటెమ్స్‌ వివరాలు కూడా ఇవ్వబడ్డాయి. ఇన్ని ఆహార పదార్థాలతో కూడిన క్యాలెండర్ రాజస్థాన్‌‌లోనూ ఆసక్తిని కలిగించడంతో అక్కడి NGO వాగ్ధార.. ఏప్రిల్‌లో హిందీ, ఇంగ్లీష్ వెర్షన్‌ను ప్రచురించింది.

ఔషధ గుణాలు తెలియజేసే లక్ష్యంతో..

మేము సూపర్ మార్కెట్స్‌లో అందుబాటులో లేని ఆహారాలపై దృష్టి పెడుతున్నాం. అటవీ ప్రాంతాల్లో దొరికే ఆహారం, వాటి ఔషధ గుణాల గురించి అందరికీ తెలియజేయాలన్నదే నా లక్ష్యం. ఈ క్యాలెండర్‌లో అవి ఎక్కడ దొరుకుతాయనే సమాచారం ఉండదు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ ఆర్గానిక్ స్టోర్స్, మీ పరిసరాల్లోని ఆర్గానిక్ ఫామ్స్ లేదా పెద్ద నగరాల శివార్లలోని స్థానిక మార్కెట్స్‌లో చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఎవరికైనా స్థలం ఉంటే తోటలో లేదా టెర్రస్‌పై పెంచుకోవచ్చు.
– మీనాక్షి భూపతి

Advertisement

Next Story