చట్టాల రద్దు.. మోడీ వ్యూహం అదేనా ?

by Anukaran |   ( Updated:2021-11-19 03:54:49.0  )
Prime Minister Modi to attend G7 summit
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఏడాది నుంచి పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇదంతా ఎన్నికల కోసమేనని ప్రతిపక్షాలు చెప్పకనే చెబుతున్నాయి. వచ్చే ఏడాది దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే బీజేపీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రైతు చట్టాల కారణంగా ఇప్పటికే 700 మంది రైతులు చనిపోయినా.. పట్టించుకోలేదని, కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే బీజేపీ ఈ స్టంట్ వేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీని బట్టి చూస్తే బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ ఎన్నికల్లో రైతు చట్టాలు ప్రభావం చూపుతాయని, అందుకోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూపీలో ఇప్పటికే అధికారంలో ఉన్నప్పటికీ, ఆ రాష్ట్రంలో అత్యధికంగా రైతులే ఉన్నారు. అంతేకాకుండా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతు సంఘాల నేతలకు యూపీలోని వివిధ సామాజిక వర్గాలకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించి ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయానికి సిద్ధమై ఉండొచ్చని విశ్లేషకుల మాట.

దీనితోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రైతులు గతేడాది నుంచి రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. ఆ రైతులు కేవలం సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. అయితే, బీజేపీ రైతుల పక్షాన ఉన్నట్లు తెలియజేసేలా చట్టాలను రద్దుచేస్తే పంజాబ్‌లో పాగా వేసేందుకు కొంత అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కేంద్రానికి ఉంది. ఇలా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూనే బీజేపీ స్వార్థం కోసమే ఈ నిర్ణయం అంటూ నెట్టింట సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed