దర్శకుడు సుకుమార్ పెద్దమనసు.. రూ.18 లక్షలతో

by Shyam |   ( Updated:2021-08-02 03:14:25.0  )
దర్శకుడు సుకుమార్ పెద్దమనసు.. రూ.18 లక్షలతో
X

దిశ, ఏపీ బ్యూరో: ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అనేనానుడిని నిజం చేస్తున్నారు ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్. తాను ఇంత స్థాయికి రావడానికి కారణమైన ఊరుకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కరోనా సమయంలో సొంతూరు ప్రజల కోసం రూ.57 లక్షలతో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఏర్పాటు చేసి ఎందరికో ప్రాణదాతగా నిలిచిన ఆయన తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా మట్టపర్రులో జన్మించిన ఆయన తన సొంత గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో తన తండ్రి తిరుపతినాయుడు పేరుతో రూ. 18 లక్షలతో భవనం నిర్మించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ రావుతో కలిసి సుకుమార్ దంపతులు శనివారం ఈ భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మట్టపర్రు గ్రామాభివృద్ధికి తానెప్పుడూ ముందుంటానని చెప్పుకొచ్చారు. తన తండ్రి తిరుపతి నాయుడు పేరుతో భవనం నిర్మించి, ప్రారంభించిన క్షణాలు మర్చిపోలేనివంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం తాను చదువుకున్న తరగతి గదులను చూస్తూ మురిసిపోయారు. ఈ సందర్భంగా సుకుమార్ ఆ పాఠశాలలో చదువుకున్నప్పటి రికార్డును చంద్రశేఖర్ అనే ఉపాధ్యాయుడు ఫ్రేమ్ కట్టించి సుకుమార్‌కు అందజేయగా ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇది తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని గిఫ్ట్ అన్నారు. మరోవైపు తాను దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ సెప్టెంబరులో తిరిగి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని సుకుమార్ స్పష్టం చేశారు.

సుకుమార్‌ది గొప్పమనసు..

దర్శకుడు సుకుమార్‌ ది చాలా పెద్దమనసు అని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రశంసించారు. కరోనాలాంటి విపత్కర సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తన సొంత ప్రాంతమైన రాజోలులో ప్రజల కోసం రూ.40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అమలాపురంలోని స్వచ్చంధ సంస్థలకు రూ.17 లక్షలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు సమకూర్చారని చెప్పుకొచ్చారు. దర్శకుడు సుకుమార్ అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed