స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సినీ దర్శకుడు మద్దతు

by srinivas |
satyareddy
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి సినీ దర్శకుడు, తెలుగుసేన జాతీయ అధ్యక్షుడు పి.సత్యారెడ్డి మద్దతు పలికారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటం చేయాలన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖ ఉక్కును ప్రైవేటికరణ చేస్తే తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోరని..అలుపెరగని పోరాటం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాద సృష్టి కర్త అమృతరావు ఆశయాలకు అనుగుణంగా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు.

అమృతరావు మనవడు మోహన్ గాంధీ, ఉక్కుసత్యాగ్రహం లోపాల్గొన్న లక్ష్మీనారాయణలతో కలిసి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడిన ఉద్యమ నేతలు గుంటూరు నగరంలోనే ఉండటం, 39మంది పోరాటంలో బలిదానం కావడం గమనార్హమన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం వేలాది ఎకరాల ఇచ్చిన రైతుల పొట్టకొట్టడం ధర్మమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రమంత్రి కేటిఆర్, సినీనటులు చిరంజీవి, మంచు మనోజ్, మంచు విష్ణు, ఆర్పీ పట్నాయక్, కోన వెంకట్ లు మద్దతు ఇవ్వడం చూస్తుంటే ఉద్యమ రూపం ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు.

ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను కూడా త్వరలోనే తీస్తామని దానికి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అమృతరావు విశాఖ వెళ్లి ఆమరణ నిరాహారదీక్ష చేస్తే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దిగివచ్చిన సంగతి గుర్తు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్ లు కోల్పోతామని దీనిపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించాలని పి.సత్యారెడ్డి కోరారు.

Advertisement

Next Story