గోదారి గట్టుంది.. డైనోసార్ల గుట్టుంది

by Shyam |
గోదారి గట్టుంది.. డైనోసార్ల గుట్టుంది
X

దిశ, కరీంనగర్: డైనోసర్.. ఈ జీవరాశి పేరు వినగానే గుండె గుభేల్ మంటుంది. ఈ డైనోసర్లు ఇతర ప్రాణులను చంపేసి అమాంతం తినేయడం మనం హాలీవుడ్ మూవీస్‌లో చూస్తూనే ఉంటాం. ఇవి విదేశాల్లో కోట్ల సంవత్సరాల కిందట ఉండేవని అనుకుంటారు చాలామంది. కచ్చితంగా వాటితో మనకేమి సంబంధం లేదని కూడా నిర్ధారించుకుంటారు. కానీ, ఇవి భారతదేశంలోనూ ఉన్నాయనీ, వేల సంవత్సరాల కిందట వేలాదిగా జీవించాయని తెలుస్తోంది. వాటి అవశేషాలను ఆధారం చేసుకుని నేటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. వేల శతాబ్దాల క్రితం నాటి ఈ చరిత్ర గురించి తెలుసుకునేందుకు దశాబ్దాలుగా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇందుకు జీవనది గోదావరి తీరమే సాక్షీభూతంగా నిలుస్తోంది.

గోదారి.. రాక్షసబల్లుల ఆవాసం

గోదావరి నది పరీవాహక ప్రాంతంలో రైతులు ఎక్కువగా వరి పండిస్తున్నందున గోదావరి అనే పేరు వచ్చిందని ప్రజలు భావిస్తారు. అయితే, ప్రాచీన సంస్కృతి ప్రకారం గోదావరి అంటే రాక్షస బల్లుల ఆవాస ప్రాంతమని అర్థం. గోదావరితీరంలో ఈ బల్లుల శిలాజాలు కూడా పెద్దసంఖ్యలో లభ్యం అయ్యాయి. కానీ, వాటి గురించి తెలుసుకోకుండా అధికారులు అలానే వదిలేశారు. ఆదిలాబాద్ జిల్లా ఫైఠాన్ ప్రాంతంలో నేటికీ వీటి ఆనవాళ్లు లభ్యం అవుతున్నాయి. గోదావరి నదికి అవతల ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలోని సిరొంచ తాలుకాలో నేటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పరిశోధకులు వాటి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు శోధిస్తూనే ఉన్నారు. సిరొంచ తాలుకా పోచంపల్లి, చిటూరు ప్రాంతాల్లో ఈ బల్లులకు సంబంధించిన శిలాజాలు లభ్యం అయ్యాయి. ఐదేళ్ల కిందటే వీటిని గుర్తించి సేకరించారు. అప్పుడు సేకరించనట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్‌లో అవశేషాలు అంతర్థానం అయిపోయేవి. గతంలో ఈ ప్రాంతంలో డైనోసర్ల శిలాజాలు లభ్యం కాగా వాటిని కోల్‌కత్తా మ్యూజియంకు షిప్ట్ చేశారు. 1980ల్లో జయశంకర్ జిల్లా కాటారం మండలం అటవీప్రాంతంలో పరిశోధకులకు డైనోసర్ అవశేషాలు లభ్యం కాగా వాటినీ మ్యూజియంకు తరలించారు. మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లి సమీపంలో కూడా డైనోసర్ల ఉనికి బయటపడింది. 1970లో కూడా ఇక్కడ శిలాజాలు లభ్యం కాగా వాటిని బిర్లా మ్యూజియంకు తరలించి డైనోసోరియంలో ఉంచారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో మూడు డైనోసర్లకు సంబంధించిన శిలాజాలను సేకరించగా తాజాగా మరిన్ని కూడా వెలుగులోకి వచ్చాయి. వేమన్‌పల్లి ప్రాంతంలో డైనోసర్లతోపాటు కోట్ల సంవత్సరాల కిందటి జీవుల శిలాజాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో వేమన్‌పల్లి ప్రాంతంలో మళ్లీ తవ్వకాలను ప్రారంభించారు. అయితే, ఇవి ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాటివి అన్నది పరిశోధనలో తేలాల్సి ఉన్నది. గోదావరి తీరంలో వందల ఏళ్ల క్రితం నుంచే వీటి ఆనవాళ్లు బయటపడ్డా వాటి గురించి పట్టించుకున్న వారే లేరు. దీంతో వర్షాకాలంలో వచ్చిన వరదల్లో టన్నుల కొద్ది శిలాజాలు కొట్టుకపోయి సముద్రం పాలయ్యాయి.

శాకాహార డైనోసర్ల ఆలవాలం..

దశాబ్దాల క్రితమే వీటి గురించి స్థానికులకు అవగాహన ఉన్నట్టయితే లక్షల సంవత్సారల నాటి చరిత్ర సాక్ష్యాలు నేటికీ సాక్షాత్కరించేవి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ డీఎఫ్‌వో‌గా నాలుగేళ్ల కిందట ఉత్తర‌ప్రదేశ్‌కు చెందిన ఓ అధికారి బదిలిపై వచ్చారు. గతకాలపు నాటి చరిత్ర ఆనవాళ్లు పోచంపల్లి సమీపంలో ఉన్నాయని తెలియగానే వాటిని వెలికి తీయించారు. అలాగే, ఈ చరిత్రను భావితరాలకు అందించేందుకు అటవీశాఖ నిధులతో ప్రత్యేకంగా వడిదెం వద్ద ఫాజిల్(శిలాజాల) పార్క్ ఏర్పాటు చేయించారు. నిర్మాణంలో ఉన్న ఈ పార్క్ రానున్న రోజుల్లో గత కాలపు ఆనవాళ్లను అందిస్తునడంలో అతిశయోక్తిలేదు. ‘సారాపోడ్’ అనే పేరు గల శాకాహార సంతతికి చెందిన డైనోసర్లు గోదావరితీరంలో జీవించేవని పరిశోధకులు నిర్ధారించారు. భారతదేశంలో అతి తక్కువ ప్రాంతాల్లో నివాసం ఉండే ఈ డైనోసర్లు గోదావరి తీరంలో ఉండొచ్చని భావిస్తున్నారు.

రాళ్లపై ఆనవాళ్లు..

నీటిలో జీవించే ప్రాణులకు సంబంధించిన శిలాజాలు మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా చిటూరు అటవీ ప్రాంతంలో లభ్యం అవుతున్నాయి. మట్టిపొరల మధ్య చిక్కుకున్న జీవులకు సంబంధించిన ఆకృతితో రాళ్లపై గుర్తులు ఉన్నాయి. ఈ ఆనవాళ్లు లభించడంతో ముంబై, పుణే, కోల్‌కత్తా పరిశోధనాకేంద్రాలకు సంబంధించిన పరిశోధకులు వాటి గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు జరిపిన పరిశోధనల్లో కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా సముద్ర తీర ప్రాంతం అయి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలోని భూమిలో వచ్చిన కదలికల వల్ల జీవరాశులు అన్ని కూడా మట్టి పొరల్లో చిక్కుకపోవడంతో వాటి గుర్తులు అలాగే ఉండిపోవడం వల్లే మనకిప్పుడు ఫాసిల్స్(శిలాజాలు)గా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే, ఇక్కడ దొరికిన ఈ ఫాసిల్స్‌ను ఆధారం చేసుకుని జీవులు ఎన్నివేల కోట్ల క్రితం నాటివి అన్న వివరాలను సేకరించి పనిలో రీసెర్చర్స్ ఉన్నారు.

tags: dinosaur fossils, godavari river, telangana, maharashtra

Advertisement

Next Story