హుజురాబాద్‌లో నిశ్శబ్ద యుద్ధం.. ప్రచారంలో తలలు పట్టుకుంటున్న నేతలు

by Anukaran |   ( Updated:2021-10-05 00:53:12.0  )
Huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ బై పోల్స్‌లో ఓటరు నాడిని పట్టుకోవడం ఇబ్బందిగానే మారింది. ఎవరు వచ్చినా మా ఓటు నీకే అంటున్న ఓటరు.. ఆయా పార్టీల నాయకులను డైలమాలోకి నెట్టేస్తున్నట్టుగానే ఉంది.

జిగ్ జాగ్..

ఐదు నెలలకు పైగా సాగుతున్న ప్రచార హోరులో ఓటరు మాత్రం తన నిర్ణయాన్ని బయటకు చెప్పకుండా కాలం వెల్లదీస్తున్నాడనే చెప్పాలి. విజయమో వీర మరణమో అన్న రీతిలో సాగుతున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులు ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తమ ప్రాభవాన్ని కాపాడుకోవాలన్న తపనతో ఇరు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఏం చేయాలి.? అన్న ఆలోచనలతోనే రెండు పార్టీల నాయకులు రోజులు వెళ్లదీస్తున్నారు.

పథకాలా.. సింపతీనా..

టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఓటర్లను ప్రభావితం చేసే వారిని పార్టీలోకి చేర్పించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ టీఆర్ఎస్ గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా గ్రౌండ్ లెవల్లో సమీకరణాలు జరుపుతున్నారు. తన వ్యక్తిగత పరిచయాలను ఆసరాగా చేసుకొని ఓటు బ్యాంకును పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

బీజేపీ ముఖ్య నాయకులను రంగంలోకి దింపేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ తనకు అన్యాయం చేశారని, తప్పుడు ఆరోపణలు చేసి బయటకు గెంటేశారన్న విషయాన్ని పదే పదే ఊటంకిస్తూ ఓటర్లలో సింపతీ సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లు మాత్రం ఇరు పార్టీల నాయకులను చేరదీస్తున్నారు తప్ప అంతరంగాన్ని బయటకు చెప్పడం లేదు. ఆయా పార్టీల సానుభూతి పరులు చేస్తున్న హల్ చల్ తప్ప సగటు ఓటరు మాత్రం కామ్ గానే కాలం వెల్లదీస్తున్నాడు.

బాహాటంగా చెప్తే..

తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలకు తలొగ్గి బహిరంగంగా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదన్న అభిప్రాయంతో మెజార్టీ ఓటర్లు ఉన్నారని చెప్పక తప్పదు. తమ మద్దతు ఫలానా పార్టీకి అన్న విషయాన్ని బహిరంగంగా చెప్తే మరు క్షణంలో ప్రత్యర్థి పార్టీ నాయకులు వారి ఇంటి ముందు వాలిపోతున్నారు. ప్రత్యర్థి వైఫల్యాలను, తమ పార్టీ గొప్పతనాన్ని వివరిస్తూ ఓటర్లను తమ పార్టీ వైపు మల్చుకునేందుకు ఇరు పార్టీల నాయకులు ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నారు.

దీంతో చాలా మంది ఓటర్లు తమ అండ ఎవరికో డిసైడ్ చేసుకున్నప్పటికీ బయటకు మాత్రం చెప్పడం లేదు. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటున్నారే తప్ప అభిప్రాయాలను వ్యక్తీకరించడం లేదు. దీంతో ఇరు పార్టీల నాయకులు డైలామాలో పడిపోక తప్పడం లేదు. ఏ పార్టీ వారు వచ్చినా తప్పకుండా మీకే ఓటేస్తాం అన్న ఒకే మాట చెప్పి తప్పించుకుంటున్నారు.

Advertisement

Next Story