మరడోనా ఇకలేరు..!

by Anukaran |   ( Updated:2020-11-25 21:37:53.0  )
మరడోనా ఇకలేరు..!
X

దిశ, స్పోర్ట్స్ : అతడి కాలికి బంతి అయిస్కాంతంలా అంటుకుంటుంది.. దూరంగా కొట్టినా మళ్లీ అతడి దగ్గరకే వస్తుది. డ్రిబ్లింగ్ (ఆటగాళ్లను తప్పించకుంటూ బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకోవడం) చేయడంలో అతడికి అతడే సాటి. ఎత్తు తక్కువైనా హెడర్స్ కూడా అలవోకగా ఆడతాడు. సెంటర్, ఫార్వర్డ్, మిడ్ ఫీల్డర్, డిఫెండర్ ఇలా ఎన్ని శాఖలైనా అలవోకగా చేపడతాడు. ఒక్కసారి అతడి దగ్గరకు బంతి పోతే.. అది గోల్ పోస్టుకు తరలాల్సిదే తప్ప ప్రత్యర్థి ఆటగాడికి దొరకనే దొరకదు. అందుకే అతడిని అందరూ ‘గోల్డెన్ బాయ్’ అంటారు. అతడే డిగో మరడోనా. ఫుట్‌బాల్‌లో పీలే తర్వాత అంతటి ఖ్యాతి అందుకున్న ఆటగాడు మరడొనానే.

ఇదీ ప్రస్థానం..

డిగో అర్మాండో మరడోనా 1960 అక్టోబర్ 30న అర్జంటీనాలో జన్మించాడు. ఏడుగురు సంతానం ఉన్న కుటుంబంలో మరడోనానే పెద్ద. చిన్నతనం నుంచి పేదరికంలో పెరిగిన మరడోనాకు ఫుట్‌బాల్ అంటే అమితమైన ఆసక్తి. బ్యూనస్ ఎయిర్స్‌కు వచ్చాక మరడోనా అక్కడి మైదానాల్లో ఫుట్‌బాల్ ఆడుతుండే వాడు. అతడి ప్రతిభను గుర్తించిన ఒక క్లబ్ జూనియర్ టీమ్‌లో చేర్చుకుంది. 16 ఏళ్ల వయసులోనే మరడోనా అర్జెంటినోస్ జూనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అర్జెంటీనా జాతీయ జట్టుకు ఇది జూనియర్ జట్టు. అతడి డ్రిబ్లింగ్, కిక్కింగ్ ప్రతిభను గుర్తించిన జూనియర్ జట్టు కోచ్‌లు మరడోనాను మరింతగా రాటు తేలేలా శిక్షణ ఇచ్చారు. దీంతో అతడు అర్జంటీనా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. స్పెయిన్‌లో 1982లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌తో మరడోనా ప్రతిభ ప్రపంచమంతా తెలిసింది. దీంతో బార్సిలోనా క్లబ్ మరడోనాను అత్యధిక ధరకు కొనుక్కున్నది. స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్స్‌లో మరడొన మరింతగా రాటు తేలాడు. అక్కడ అంతర్జాతీయ ఆటగాళ్లతో పోటీ పడి మరీ గోల్స్ సాధించాడు. ఒక విధంగా చెప్పాలంటే మరడోనాకు బార్సిలోనా క్లబ్‌లోనే మరింత అనుభవం వచ్చింది.

1986 వరల్డ్ కప్..

మరడోనా జీవితాన్నే మార్చేసింది 1986 ఫిఫా వరల్డ్ కప్. అర్జెంటీనా జట్టుకు కెప్టెన్‌గా బరిలోకి దిగిన మరడొన ఆ టోర్నీలో అత్యద్బుతంగా రాణించాడు. మెక్సికోలో జరిగిన మెగా టోర్నీలో మరడోనా అన్ని టీమ్స్‌పై ఆధిపత్యం చలాయించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 2-1తో అర్జెంటీనాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో చేసిన ఒక గోల్ వివాదాస్పదం అయ్యింది. మరడోనా చేతితో ఆ గోల్ చేశాడని అందరూ విమర్శించారు. దీనిపై తర్వాత మరడోనాను వివరణ కోరగా.. అది దేవుడి చేయి (హ్యాండ్ ఆఫ్ గాడ్) అని సమాధానం ఇచ్చాడు. ఇక ఫైనల్లో వెస్ట్ జర్మనీపై గెలిచి అర్జంటీనాకు కప్పు అందించాడు. అప్పటి నుంచే మరడోనాకు అర్జంటీనాలో ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. అతడంటే ప్రాణాలు తీసుకునే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 1990 వరల్డ్ కప్‌లో అర్జంటీనాను ఫైనల్స్‌కు తీసుకొని వెళ్లినా చివరకు వెస్ట్ జర్మనీపై ఓటమి పాలయ్యారు. 1994 వరల్డ్ కప్ తర్వాత మరడోనా ప్రభ తగ్గడం ప్రారంభం అయ్యింది.

వివాదాలు..

ఫుట్‌బాల్ నుంచి నిష్క్రమించాక మరడోనా డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ముఖ్యంగా కొకైన్ తీసుకుంటూ పలుమార్లు మీడియా కంటపడ్డాడు. అతడి వ్యక్తిగత జీవితం కూడా ఆటుపోటులకు గురయ్యింది. దీంతో కెరీర్ ముగిసిన తర్వాత విచ్చలవిడి జీవితానికి అలవాడు పడ్డాడు. భారీకాయం వల్ల పలు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. 2005లో అతడికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు. ఇలా పలు ఆరోగ్య, మానసిక సమస్యలతో బాధపడ్డాడు.

మేనేజర్..

ఆటగాడిగా ఉంటూనే పలు జట్లకు అతడు మేనేజర్‌గా వ్యవహరించాడు. అయితే ఫుట్‌బాల్ నుంచి పూర్తిగా బయటకు వచ్చాక అర్జంటీనా జట్టుకు రెండేళ్ల పాటు మేనేజర్‌గా విధులు నిర్వర్తించాడు. 2010లో అర్జంటీనా జట్టు మేనేజర్‌గా రాజీనామా చేసిన తర్వాత పలు క్లబ్ జట్లకు తన సేవలు అందించాడు. తన జీవిత చరమాకంలో అర్జంటీనాలోని ఒక లోకల్ క్లబ్ మేనేజర్‌గా వ్యవహరించాడు.

మరణం

ఫుట్‌బాల్ దిగ్గజం డిగొ మరడోనా (60) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. మూడు వారాల క్రితం బ్రెయిన్ క్లాట్‌తో బాధపడి బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న మరడోనా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి చేర్చేలోపే ఆయన ప్రాణాలు వదిలినట్లు అతడి కుటుంబ లాయర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జంటీనా జట్టుకు 1986లో వరల్డ్ కప్ అందించిన మరడోనా ఆ టోర్నీలోనే ఒక వివాదాస్పద గోల్ చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగన మ్యాచ్‌లో మరడోనా చేతితో గోల్ చేసినట్లు వివాదం చెలరేగింది. ఆ గోల్ కారణంగా ఇంగ్లాండ్ ప్రపంచ కప్ నుంచే నిష్క్రమించింది.

Advertisement

Next Story

Most Viewed