ఒకే కాన్పులో పదిమంది జననం.. నిజమేనా!

by Sujitha Rachapalli |
10members-kids delivery
X

దిశ, ఫీచర్స్ : దక్షిణాఫ్రికాకు చెందిన 37 ఏళ్ల థమారా సిథోలే అనే మహిళ.. ఒకే కాన్పులో ఏకంగా పదిమందికి జన్మనిచ్చిందని తెలుగు మెయిన్ స్ట్రీమ్ పత్రికలతో పాటు అంతర్జాతీయ న్యూస్ పేపర్స్, వెబ్‌సైట్స్ కోడై కూశాయి. దీన్ని ఒక ప్రపంచ రికార్డుగా అభివర్ణించిన మీడియా వర్గాలు.. ఈ అరుదైన ఆపరేషన్‌ ప్రిటోరియా ఆస్పత్రిలో జరిగిందని, ఆమెకు ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు జన్మించారని ఆ వార్తలో ప్రస్తావించారు. అయితే ఒకేసారి పదిమంది పుట్టడం అసాధ్యం కాదు కానీ చాలా అరుదు. ఇప్పటి వరకైతే ఒక కాన్పులో తొమ్మిది మంది మాత్రమే పుట్టిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మహిళ ‘గోసియామే సిథోలే’ వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్వయంగా ఆ దేశ ప్రభుత్వమే ప్రకటించడం విశేషం.

సాధారణంగా ట్విన్స్, ట్రిప్‌లెట్స్, క్వాడ్రప్లెట్స్, క్వింటుప్లెట్స్(5) పుట్టిన సందర్భాలు చూశాం. 6, 7, 8.. చివరకు తొమ్మిది మంది పుట్టిన రికార్డులూ ఉన్నాయి. గత నెలలోనే మాలీ(ఆఫ్రికా)కి చెందిన హలిమా నిస్సే అనే యువతి ఒకేసారి నొనుప్లెట్స్(9)కి జన్మనివ్వగా, అందరూ ఆరోగ్యంగానే ఉండటం ఓ రికార్డ్. ఇలానే 1971లో సిడ్నీ మహిళకు తొమ్మిది మంది జన్మించగా, అందులో ఇద్దరు మరణించారు. ఆ తర్వాత 1999లో మలేషియాలోనూ 9 మంది పుట్టినా, వాళ్లెవరూ బతకలేదు. కాగా ప్రస్తుతం సిథోలేకు పదిమంది పుట్టారని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదు. ఈ న్యూస్ వరల్డ్ వైడ్‌గా స్ర్పెడ్ అవుతుండటంతో సదరు మహిళ, ఆమె పిల్లల గురించి దక్షిణాఫ్రికా ప్రభుత్వం వైద్య రికార్డ్‌లను పరిశీలించింది. కానీ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఇది తప్పుడు సమాచారమని తెలియజేస్తూ బహిరంగ ప్రకటన చేసింది.

జూన్ 7వ తేదీన సిథోలే అనే మహిళకు డెక్యుప్లెట్స్ పుట్టారని తెలియగానే మేము ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎంక్వైరీ చేశాం. అయితే మాకు ఎక్కడా ఆధారాలు దొరకలేదు. ఆ విషయాలు ఎక్కడ కూడా నమోదు కాలేదు.
– ఫుమ్లా విలియమ్స్, గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీసీఐఎస్) డైరెక్టర్ జనరల్

ఈ కథనాన్ని తొలిగా జర్నలిస్ట్ రాంపేడి రిపోర్ట్ చేశాడు. దీంతో అతడి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కామెంట్స్‌పై అతడు ఇంకా స్పందించకపోగా.. మరికొందరు ట్విట్టర్‌ ప్లాట్‌ఫ్లామ్‌పై జర్నలిస్ట్ చిత్రాలు, వీడియోను గర్భిణీ స్త్రీ కుటుంబంతో పంచుకోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed