ఫ్రెండ్లీ పోలీసింగ్ అలవర్చుకోవాలి

by srinivas |
ఫ్రెండ్లీ పోలీసింగ్ అలవర్చుకోవాలి
X

దిశ, ఏపీ‌బ్యూరో: పోలీసులంటే ప్రజల్లో గౌరవం పెరగాలి.. నేరగాళ్లు భయపడాలి అన్నట్లు సిబ్బంది ప్రవర్తన ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. రాష్ట్రం వ్యాప్తంగా 76 వేల మంది పోలీసు సిబ్బందితో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల చోటుచేసుకున్న శిరోముండనం సంఘటనతో మొత్తం పోలీసులందరికీ ప్రవర్తనా నియమావళిపై దిశ నిర్దేశం చేశారు. క్షేత్ర స్ధాయిలో పోలీసు స్టేషన్లకు వస్తున్న బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలన్న అంశంపై పలు సూచనలు ఇచ్చారు. కొవిడ్ సమయంలో పోలీసులు చాలా మంచి పేరు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఒక పోలీసు తప్పు చేస్తే వ్యవస్ధ మొత్తాన్ని తప్పు పడతారని హెచ్చరించారు.

వ్యవస్థలో ప్రభుత్వం మార్పు, పరివర్తనను కోరుకుంటోంది..అందుకనుగుణంగా పోలీసు సేవలుండాలని సవాంగ్ కోరారు. పోలీసులు ఎంత బాధ్యతాయుతంగా సేవాలందించినా అనుకోకుండా జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో కొందరు సామాన్యులు ఇబ్బంది పడినట్లు తెలిపారు. నేరం చేస్తే డిపార్ట్మెంట్, న్యాయ పరమైన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసు సిబ్బందిపై పోలీసులే చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం.. కానీ తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఆత్మ‌ విమర్శ చేసుకోవడం చాలా అవసరమని సూచించారు. రానున్న రెండు నెలల్లో ఓరియంటేషన్ క్లాసులకు సిబ్బంది మొత్తం హాజరు కావాలని డీజీపీ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed