భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు...

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-10-11 16:35:22.0  )
భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు...
X

దిశ ప్రతినిధి,తిరుపతి : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ''రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే'' అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి.

తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం. ఈ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీర‌బ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed