ఒకవైపు అఘోరాలు.. మరోవైపు లేటెస్ట్ బాబాలు.. మహా కుంభమేళాలో ఎన్నో ప్రత్యేకతలు..

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-02-13 15:41:05.0  )
ఒకవైపు అఘోరాలు.. మరోవైపు లేటెస్ట్ బాబాలు.. మహా కుంభమేళాలో ఎన్నో ప్రత్యేకతలు..
X

త్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాదిగా భక్త జనం తరలివచ్చి గంగా స్నానమాచరిస్తు్న్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంగమంగా పేర్కొనే ఈ మేళాకు దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచీ భక్తులు, బాబాలు విచ్చేస్తున్నారు. కుంభమేళా అనగానే పవిత్రస్నానాలు, నది తీరమంతా కాషాయ రంగు పులుముకోవడం గుర్తుకొస్తుంది. అఘోరాలు, నాగసాధువులు తప్పకుండా గుర్తుకువస్తారు. ఈ సారి అంతకు మించి అన్నట్టుగా వెరైటీ గెటప్‌లలో బాబాలు దర్శనమిస్తు్న్నారు. కొత్తరకం బాబాలు అలా మెరిసి ఇలా వైరల్ అయిపోతున్నారు. అందులోనూ ఒక్కో బాబాది ఒక్కో స్టైల్. వారి వెనుక ఉన్న స్టోరీలూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు నాగ సాధువులు, అఘోరాలు.. మరోవైపు ఈ కొంగొత్త బాబాలూ భక్తులను ఆకర్షిస్తున్నారు. ఇక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వల్ల ఓవర్‌నైట్‌లోనే మోనాలిసా వంటి వారు సెలెబ్రిటీలై ప్రైవసీ లేక ఇబ్బందులు పడుతున్నవారూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాబాల గురించి, వారి వెనుక ఉన్న స్టోరీల గురించి ‘దిశ’ ప్రత్యేక కథనం.

ఐఐటీ బాబా


భారీ వేతనాన్ని వదులుకుని ఆధ్యాత్మిక బాటపట్టిన ఐఐటీ గ్రాడ్యుయేట్ అభయ్ సింగ్.. ఐఐటీ బాబాగా ప్రచారమవుతున్నారు. ఆధ్యాత్మిక సంక్లిష్ట విషయాలను సరళంగా డయాగ్రామ్‌లు, విజువల్స్ ద్వారా వివరించి సోషల్ మీడియాలో అభయ్ సింగ్ వైరల్ అయ్యారు. ఐఐటీ బాబా, ఇంజినీర్ బాబాగా పిలుస్తున్న అభయ్ సింగ్ మహాకుంభమేళాతో సెలెబ్రిటీ అయిపోయారు. ఆయన్ను అఖాడా కమిటీ కుంభమేళా నుంచి తొలుత బహిష్కరించినప్పటికీ.. మళ్లీ ఆయన అక్కడ కనిపించడం విశేషం.

మస్క్యులర్ బాబా


రోజూ జిమ్‌కు వెళ్లి బాడీ ఫిట్‌గా ఉంచుకునేవారిలా ఉంటాడీ ఏడడుగుల మస్క్యులర్ బాబా. రష్యాకు చెందిన ఆత్మ ప్రేమ్ గిరి 30 ఏళ్ల క్రితమే సనాతన ధర్మాన్ని స్వీకరించారు. హిందూ మత వ్యాప్తికి జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. నేపాల్‌లో ఉంటున్న ఆత్మ ప్రేమ్ గిరి మహా కుంభమేళాలో సింపుల్ కాషాయ దుస్తుల్లో చేతిలో జోలె పట్టుకుని కనిపిస్తున్నారు. ఆయన ఫిజిక్‌ వల్ల వైరలైన ఆత్మ ప్రేమ్ గిరిని హిందూ పురాణాల్లోని బలశాలి పరశరాముడితో భక్తులు పోల్చుకుంటున్నారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు మహాకుంభమేళాలో పోటీ పడుతుండటం గమనార్హం.

ఛాయ్‌వాలా బాబా


కుంభమేళాలో చాయ్‌వాలా బాబాగా ప్రాచుర్యమవుతున్న జోగిదాస్ గత 12 ఏళ్లుగా కేవలం టీ తాగుతూ జీవిస్తున్నారు. ఆహారం తీసుకోవడంలేదు. 40 ఏళ్లుగా సివిల్ యాస్పిరెంట్లకు ఉచిత శిక్షణ ఇప్పించడం మరో విశేషం. ప్రతి రోజూ పది కప్పుల టీ తాగుతారు. విద్యార్థులతో వాట్సాప్‌లో కమ్యూనికేట్ చేస్తారు. తన జీవిత రహస్యం చాయ్‌లోనే ఉన్నదని, జలం, పాలు ద్రవాలే తనను కాపాడుతున్నాయని చెబుతున్నారు.

ధాన్యం బాబా


అనాజ్‌వాలా బాబాగా పేరున్న అమరజీత్ గత ఐదేళ్లుగా పర్యావరణంపై అవగాహన తెచ్చే క్రమంలో తన తలపైనే పలురకాల పంటలు పండిస్తున్నారు. గోధుమలు, తృణధాన్యాలు, పప్పులను తన తలపై పండిస్తున్నారు. క్రమం తప్పకుండా నీళ్లు పోసి పంట పండించి.. తన వద్దకు వచ్చిన భక్తులకు వాటిని ప్రసాదిస్తుంటారు. ఇందుకోసం ఆయన ఐదేళ్లుగా తలవాల్చి పడుకోవడం లేదు, కూర్చునే నిద్రపోతున్నట్టు అమరజీత్ వివరించారు.

రుద్రాక్ష బాబా


108 రుద్రాక్ష దండలు ధరించిన సాధువును రుద్రాక్ష బాబాగా పిలుస్తున్నారు. ఈయన మెడలో మొత్తం 11,000 రుద్రాక్షలు ఉన్నాయి. 30 కిలోల రుద్రాక్షల బరువును నిత్యం ఆయన మోస్తూనే ఉన్నారు. ‘ఈ 11 వేల రుద్రాక్షలు శివుడి రుద్రాలు. చాలా కాలం క్రితం నుంచే నేను వీటిని ధరిస్తున్నాను. భక్తులే నాకు వీటిని బహుమానంగా ఇచ్చారు. ప్రతి సాధువు రుద్రాక్షలను ధరిస్తారు. నన్ను రుద్రాక్ష బాబాగా భక్తులు పిలుచుకోవడం సంతోషంగా ఉన్నది’ అని రుద్రాక్ష బాబా అన్నారు.

ముండ్ల బాబా


రమేశ్ కుమార్ మాంఝీ ముండ్లపై హాయిగా పడుకుండిపోతారు. అందుకే ఆయనను కాంటే(ముండ్లు) వాలా బాబా అని పిలుస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో ఆయన ముండ్లపై పడుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘నేను గురు సేవ చేస్తాను. గురువే నాకు మద్దతు ఇస్తున్నారు. ముండ్లపై పడుకోవడానికి నాకు ఆ దేవుడే సహకరిస్తాడు. ఇదంతా ఆ దేవుడి మహిమే. గత 40 నుంచి 50 ఏళ్లుగా ఇలా చేస్తూ వస్తున్నాను. నాకు దక్కిన దక్షిణలో సగం దానం చేస్తాను’ అని మాంఝీ వివరించారు. మహాకుంభమేళాలో చాలామంది భక్తులు కాంటే బాబాను దర్శించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు.

అంబాసిడర్ బాబా


అంబాసిడర్ బాబా ఆన్‌లైన్‌లో చాలా మంది మనసు గెలుచుకున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన మహంత్ రాజ్‌గిరి నాగా బాబా 1972 వింటేజ్ కారులో తిరుగుంటారు. 35 ఏళ్లుగా ఈ కారులోనే ప్రయాణిస్తారు. ప్రతి కుంభమేళాకు ఇదే కారులో వచ్చి హాజరై చాలా మందిని ఆకర్షిస్తున్నారు. పాతదే అయినా ఇప్పటికీ ఫుల్ కండీషన్‌లో ఆయన అంబాసిడర్ కారు ఉంటుంది. తనకు అనుకూలంగా కస్టమైజేషన్‌లు చేసుకున్నారు బాబా. ఎండను తట్టుకోవడానికి రూఫ్‌కు ఓ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏర్పాటు చేసుకున్నారు. ఐస్ క్యూబ్‌లతో తాత్కాలికంగా ఏసీని కూడా సిద్ధంగా ఉంచుకుంటారు. తన కారు ఎక్కడ పాడైనా తానే స్వయంగా రిపేర్ చేసుకుంటానని చెప్పారీ అంబాసిడర్ బాబా.

ఎన్విరాన్‌మెంట్ బాబా


మహామండలేశ్వర్ అవదూత్ బాబాను ఎన్విరాన్‌మెంట్ బాబా అని పిలుస్తారు. మహా కుంభమేళాకు ఆయన రాగానే పర్యావరణ చర్చ జరిగింది. 2016లో వైష్ణో దేవి నుంచి కన్యాకుమారి వరకు సుమారు 27 రాష్ట్రాల్లో మొక్కలు నాటారీ బాబా. పర్యావరణహితంపై అవగాహన కల్పిస్తున్నారని అప్పటి నుంచి ఆయనను ఎన్విరాన్‌మెంట్ బాబా అని పిలవడం మొదలైంది. ‘30 దేశాల్లోని నా భక్తులు మన దేశంలో ఒక కోటికిపైగా మొక్కలు నాటాలని సంకల్పించారు. ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటాలని మన సనాతన ధర్మం చెబుతున్నది. ఒకటి అంత్యక్రియలకు, ఆక్సిజన్ కోసం పీపల్ మొక్కను నాటాలి’ అని వివరించారు.

నాగ సాధువులు


నాగ సాధువులు ఎక్కువగా కుంభమేళాలోనే కనిపిస్తుంటారు. దిగంబరంగా ఉండి ఒళ్లంత బూడిదను పూచుకుని కనిపించే నాగసాధువులు వెంటనే ఆకర్షిస్తారు. పొడవైన వెంట్రుకలు, గోర్లతో కొంత భయం కల్పిస్తూనే మరికొంత అలౌకిక ఆశ్చర్యాన్ని, ఆసక్తిని అనుభవంలోకి తెస్తారు. కుంభమేళాలో త్రివేణి సంగమంలో తొలిసారి అమృతస్నానం చేసేవారిలో నాగసాధువులు ఉంటారు. కుంభమేళా రాయల్ ఎంట్రీ వీరితోనే జరుగుతుంది.

సాధ్విగా బాలీవుడ్ నటి మమతా కులకర్ణి


1990ల్లో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన, బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్స్ చేసిన మమతా కులకర్ణి అనూహ్యంగా సాధ్విగా మారారు. కిన్నర్ అఖాడాలో ఆమె మహా మండలేశ్వర్‌గా జనవరి 25న మారిపోయారు. మహా కుంభమేళా జరుగుతున్న తరుణంలో ఆమె సాధ్విగా మారడం గమనార్హం. ఆ తర్వాత మహా కుంభమేళాకు వెళ్లుతున్నట్టు అఖాడా సభ్యులు తెలిపారు. ఇకపై ఆమె శ్రీ యామై మమతా నంద్‌గిరిగా పిలవబడతారు. ప్రాపంచిక సౌకర్యాల నుంచి పూర్తిగా దూరమవుతూ.. సాధువుగా తన జీవితాన్ని అంకితం చేశారు. జీవితాంతం సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి తీర్మానించుకున్నారు. అయితే, కిన్నర్ అఖాడా చీఫ్ మమతా కులకర్ణిని అఖాడా నుంచి బహిష్కరించారు. తనకు తెలుపకుండానే మమతా కులకర్ణి చేరిక జరిగిందన్నారు.

మోనాలిసా పాఠం


144 ఏళ్లకోసారి జరిగే మహా ధార్మిక కార్యక్రమం మహా కుంభమేళాకు అత్యంత భక్తి పారవశ్యంతో భక్తులు వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. లోపలా బయటా భగవత్‌నామ స్మరణతో భక్తులు పులకరించిపోతారు. అలాంటి చోట పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే ఓ యువతిని చూసి వైరల్ చేయడం వివాదాస్పదమైంది. పొట్టకూటి కోసం కుంభమేళాలో కుటుంబం చిన్న షాప్ పెడితే మోనాలిసా కూడా అందులో పని చేయడానికి వచ్చింది. కుంభమేళాకు వెళ్లిన కొందరు ఆమె సౌందర్యాన్ని పొగుడుతూ సోషల్ మీడియా మోనాలిసా వీడియోలను వైరల్ చేశారు. దీంతో కొందరు భక్తి పారవశ్యాన్ని పక్కనపెట్టి మోనాలిసా కోసం కుంభమేళాలో వెతికారు. ఆమె కనిపిస్తే సెల్ఫీలు, వీడియోలతో పిచ్చెక్కినట్టే చేశారు. ఈ అతితో బెంబేలెత్తిన కుటుంబం ఆమెను రక్షణ కారణాలతో ఇంటికి పంపించేశారు. ఈ ఉదంతం నేపథ్యంలో గుండెల నిండా భక్తిని నింపుకుని వెళ్లాల్సిన కుంభమేళాకు.. అక్కడ ఓ యువతిని చూసి ఆకతాయిలుగా వ్యవహరించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. అక్కడ చూడాల్సింది ధార్మిక సౌందర్యమని, అది భక్తిలో లభిస్తుందని, కానీ, భౌతిక సౌందర్యానికి ప్రాధాన్యతనివ్వడంపై హిందూ భక్తులు మండిపడ్డారు.

Next Story

Most Viewed