ఆ ఊరిలో వ‌రుస‌గా యువ‌కుల మ‌ర‌ణాలు.. దెయ్యమే కార‌ణ‌మ‌ట‌.?

by Sridhar Babu |
ఆ ఊరిలో వ‌రుస‌గా యువ‌కుల మ‌ర‌ణాలు.. దెయ్యమే కార‌ణ‌మ‌ట‌.?
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: మా ఊరిలో దెయ్యం తిరుగుతోంది. చీక‌ట‌యితే ఆ ఇంటి నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. గ‌జ్జెల మోత ధ్వనిస్తుంది.. న‌గ్నంగా ఓ యువ‌తి బోనం ఎత్తుకుని న‌ర్తీస్తోంది.. కంట‌ప‌డితే ఖ‌తం చేస్తోంది..వెంట‌ప‌డి మ‌రీ ఏదో రూపంలో చంపేస్తోంది ఇదీ జ‌న‌గామ జిల్లా త‌రిగొప్పుల మండ‌లం పోతారం గ్రామానికి చెందిన బేడ‌బుడ‌గ జంగాల కాల‌నీ వాసుల భ‌యాందోళ‌న‌. గ‌త మూడు నెల‌ల కాలంలో రోజుల వ్యవ‌ధిలో ఈ కాల‌నీకి చెందిన కొంత‌మంది వివిధ కార‌ణాల‌తో మ‌ర‌ణించారు. ఈ కాల‌నీలో దాదాపు 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ కాల‌నీకి ఆనుకుని పాడుబ‌డిన ఇల్లు ఉంది. ఈ ఇంటి నుంచి రాత్రిపూట అరుపులు, గ‌జ్జెళ్ల చ‌ప్పుళ్లు వినిపిస్తున్నాయ‌ని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం కాల‌నీకి చెందిన చింత‌ల భాను- చింత‌ల బాల‌రాజు అనే ఇద్దరు అన్నద‌మ్ములు వారం రోజుల వ్యవ‌ధిలోనే అనారోగ్యంతో మ‌ర‌ణించారు. వీరి మ‌ర‌ణాల‌కు వైద్యులు కూడా స‌రైన కార‌ణాలు చెప్పలేద‌ని కాల‌నీవాసులు పేర్కొంటున్నారు. అయితే దీనికి ఖ‌చ్చితంగా కొరివి దెయ్యమే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

ఊరు విడిచిన 40 కుటుంబాలు..

ఊళ్లో ఉంటే కొరివి దెయ్యం త‌మ‌ను చంపేస్తుంద‌ని మొత్తం కాల‌నీ వాసులంతా కూడా ఒకేరోజు ఇళ్లకు తాళం వేసి మండ‌లం కేంద్రమైన త‌రిగొప్పుల‌లో ఓ ఖాళీ స్థలంలో డేరాలు వేసుకుని బ‌తుకుతున్నారు. అసౌకర్యాల మ‌ధ్య జీవిస్తున్నారు. ఊరు పేరెత్తితే వ‌ణికిపోతున్నారు. గ్రామానికి చెందిన కొంత‌మంది విద్యావంతులు వెళ్లి న‌చ్చజెప్పిన తిరిగి గ్రామానికి రావ‌డానికి భ‌యాందోళ‌న చెందుతుండ‌టం విశేషం. ఊరెళ్లితే దెయ్యం మా ప్రాణాలు తీసేస్తుంది.. మా బిడ్డల‌ను పోగొట్టుకున్నం.. వారిని బ‌తికించుకోవ‌డానికి ఊరు విడిచిన‌మంటూ క‌రాఖండిగా చెప్పేస్తున్నారు.

అంతా ఉత్తిదే…

ఊరిలో ఎలాంటి దెయ్యం లేద‌ని మరికొంత‌మంది గ్రామ‌స్థులు చెబుతున్నారు. అదే ఇంటిలో పదేళ్లకు పైగా ఉన్న వ్యక్తి కూడా ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాడు. పోలీసులు జోక్యం చేసుకుని వారిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తే కొంత మార్పు ఉంటుంద‌ని, ఇలాంటి వ‌దంతులు ఇటీవ‌ల మ‌హ‌బూబాబాద్ జిల్లా కేవ్లా తండాలోనూ చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఓ వీడియోను వాట్సాప్ గ్రూపులో షేర్ చేయ‌డంతో చీక‌ట‌యితే జ‌నాలు బ‌య‌ట‌కు రావ‌డానికి వ‌ణికిపోయారు. పోలీసులు క‌ళాజాత ద్వారా చైత‌న్యం క‌ల్పించ‌డంతో ప‌రిస్థితి మారింది.

Advertisement

Next Story

Most Viewed