- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో విషాదం.. కొంప ముంచిన స్టైరిన్ గ్యాస్
అందాల విశాఖలో మాటలకు అందని విషాదమిది.. గురువారం వేకువజామున నగర ప్రజలు ఒక్కొక్కరుగా నిద్రమత్తు వీడుతున్నారు. శివారులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మాటు వేసిన ప్రమాదం కూడా అప్పుడే మేల్కొని ఒక్కసారిగా విషం చిమ్మింది. నగరమంతటా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. లీకైన విషవాయువు జనంపై ఎగబడింది. ఉక్కిరిబిక్కిరి చేసి 11 మంది ఊపిరి తీసింది. మూడు కిలోమీటర్ల పరిధి మేరకు తన ప్రతాపం చూపింది. కళ్లల్లో మంట.. చర్మంపై దురద, ఊపిరిసల్పని వైనం.. తలనొప్పి, అలసట, కళ్లు తిరగడం వంటి వాటితో జనం బెంబేలెత్తారు. ప్రాణాంతక వాయువును పీల్చడంతో నిలబడ్డోళ్లు నిలబడినట్టే కూలబడిపోయారు. కూర్చున్నోళ్లు కూర్చున్నట్లే నేలపై వాలిపోయారు. సుమారు వెయ్యి మంది వాష వాయువు ప్రభావానికి లోనయ్యారు. తెల్లారకముందే ముగ్గురి బతుకులు తెల్లారిపోయాయి. గాడికొయ్యకు కట్టిన ఎడ్లు, ఇంటి ముందున్న కుక్కలు, గడ్డివాము నుంచి బయటికొచ్చిన ఎలుకలు.. అన్నీ గిలగిలా తన్నుకుంటూ నురుగులు కక్కుతూ ప్రాణాలు విడిచాయి. అంతలోనే గ్రామస్తులకు సైరన్ మోత వినిపించింది. అప్పటికే విషపు గాలి పీల్చిన వారంతా మంటపెడుతున్న కళ్లను నులుముకుంటూ.. తడబడే అడుగులతో ఊరి నుంచి పారిపోయేందుకు ట్రై చేశారు. కొంతదూరం వెళ్లారో లేదో.. ఎక్కడివాళ్లక్కడే బెలూన్‌లో గాలి తీసేసినట్టు.. నిట్టనిలువునా కుప్పకూలి ఊపిరి వదిలారు. ఇంకొందరు బాట ఎటుందో అర్థం కాక మురికి కాల్వలో పడిపోయారు. ఆ ఊరితోపాటు చుట్టుముట్టు 5 కిలోమీటర్ల దూరంలో ఊళ్లన్నీ విషపు గాలితో తల్లడిల్లిపోయాయి. వెయ్యి మందికిపైగా బేజార్ అయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులతోపాటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. స్థానికంగా ఉన్న పలు ఇళ్ల తలుపులు బద్దలు కొట్టారు. ఇళ్లల్లో పడిపోయి ఉన్న వందలాది మందిని వెలుపలికి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 200 మందిని వేర్వేరు హాస్పిటళ్లలో చేర్పించారు. వీరిలో 80 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి సీరియస్గా ఉంది. కంపెనీ విధుల్లో ఉన్న 15 మందికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం విశేషం.
దిశ ఏపీ బ్యూరో: కరోనాతో కకావికలమైపోతున్న వైజాగ్ నగరంలో ఇప్పుడు విష వాయువైన స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో సాయంత్రం సమయానికే పదకొండు మంది మరణించారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. సుమారు 80 మంది ప్రభుత్వ కేజీహెచ్ ఆసుపత్రితో పాటు మరో రెండు కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. గడచిన నలభై రోజులుగా లాక్‌డౌన్ కారణంగా మూసివేతకు గురైన గోపాలపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జి పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కేంద్ర ప్రభుత్వ ఆంక్షల సడలింపులో భాగంగా బుధవారం రాత్రి నుంచి పనిచేయడం ప్రారంభమైంది. అయితే హఠాత్తుగా తెల్లవారుజామున ఒక ట్యాంకులోంచి గ్యాస్ లీక్ అయ్యి గాలిలో కలిసిపోయి దాన్ని పీల్చుకున్న సమీప కాలనీల్లోని ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కొద్దిమంది చనిపోయారు. నిద్ర లేచేటప్పటికే ఈ విషాదం జరిగిపోయింది.
గ్యాస్ లీకేజీ కారణంగా కంపెనీకి సమీపంలో మూడు కి.మీ. పరిధిలో ఉన్న గ్రామాలను ప్రభుత్వ సిబ్బంది ఖాళీ చేయించారు. ఘటన తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సమయంలో ఫ్యాక్టరీలో 15 మంది ఉన్నారు. డయల్ 100కి ఫోన్ రాగానే, పది నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు. వెంటనే స్థానిక అధికార యంత్రాంగం సైరన్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసిందని, ఇళ్లలోంచి బయటకు రావాలని మైక్ ద్వారా అనౌన్స్‌మెంట్ చేసిందని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల కమిషనర్ ఆర్‌కె మీనా ఘటన జరిగిన గంట సేపటికల్లా కంపెనీ దగ్గరకు వెళ్ళారని, మరో గంట వ్యవధిలోనే ఫ్యాక్టరీలో పరిస్థితి అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. వెంకటాపురం గ్రామాన్ని ఉదయం 6.30 గంటల కల్లా పూర్తిగా ఖాళీ చేయించామని, కొన్ని ఇళ్ళలో నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో తలుపులు పగలగొట్టి బయటకు తీసుకొచ్చామని తెలిపారు.
సంఘటన వార్త తెలుసుకున్న వెంటనే విశాఖపట్నంలోని ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు నిర్వహణ బృందం) సిబ్బంది రంగంలోకి దిగారు. విష స్వభావంతో కూడిన ఈ గ్యాస్ సాధారణ గాలిలో కలవరాదని, కానీ తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు సుమారు 54 పీపీఎం (పార్టికల్స్ పర్ మీటర్) చొప్పున కలుషితమైందని, ఇంత తీవ్రత ఉంది కాబట్టే వందల సంఖ్యలో దాన్ని పీల్చుకున్న ప్రజలు అస్వస్థతకు గురయ్యారని ఎన్డీఆర్ఎఫ్ ఛైర్మన్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. సాయంత్రం సమయానికి కూడా గాల్లో 2 పీపీఎం కంటే ఎక్కువే ఉందని తెలిపారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారు 1.4 పీపీఎం వరకు పీల్చుకున్నా తట్టుకోగలుగుతారని, కానీ ఇప్పటికీ అది మోతాదుకు మించే ఉన్నదని వివరించారు. ఎల్‌జీ కంపెనీతో పాటు రాష్ట్ర పారిశ్రామిక విభాగం గాల్లోకి యాంటీ డోట్‌ను స్ప్రే చేసి తీవ్రతను తగ్గించడానికి నీటిని వినియోగించినా కూడా కలుషిత స్థాయి 2 పీపీఎంకంటే తగ్గలేదని, ఈ ప్రభావం ఇంకా 24 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
సంఘటనపై ప్రధాని ఆరా..
సంఘటన గురించి తెలిసిన తర్వాత ప్రధాని మోడీ వెంటనే ఎన్డీఆర్‌ఏ (అథారిటీ) అధికారులతో సమీక్ష నిర్వహించి గుజరాత్ నుంచి కొన్ని బృందాలను విశాఖకు వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రత్యేక హెలికాప్టర్‌లో అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ సహా ఎల్‌జి ప్రతినిధులతో మాట్లాడారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతులకు తలా కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి తలా రూ.10 లక్షలు, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి తలా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. పశువులు కోల్పోయిన కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఒక్కో జంతువుకు రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ఆ కంపెనీలోనే ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.
గ్యాస్ లీక్ సంఘటనపై విచారణ కమిటీ
విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా యాజమాన్యంపై గోపాలపట్నం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. గోపాలపట్నం వీఆర్వో ఎంవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 278, 284, 285, 337, 338, 304 తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. స్టైరిన్ ను నిల్వ చేసే కంటైనర్ పాతబడి పోయిందని, సకాలంలో దాని నిర్వహణపై యాజమాన్యం దృష్టి పెట్టలేదని, నిర్వహణ సరిగా లేని కారణంగానే గ్యాస్ లీకైందని సెంటర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫ్యాక్ట్ షీట్ అభిప్రాయపడింది. మరోవైపు ఈ సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్ కాలంలో స్టైరిన్ ను నిల్వ ఉంచే ట్యాంకుల నిర్వహణపై యాజమాన్యం దృష్టి పెట్టలేదని, ట్యాంకు లోపల ఒత్తిడి పెరిగి లీకేజీ అయి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలిందని జగన్ మీడియాతో వ్యాఖ్యానించారు. నిజానికి ఇలాంటి ప్రమాదం జరిగేటప్పుడు అలారమ్ మోగాల్సి ఉంటుందని, కానీ అలా జరగకపోవడం బాధాకరమన్నారు. ఈ సంఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు.
సంఘటన జరగడం బాధాకరం : ఎల్జీ యాజమాన్యం
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా ఫ్యాక్టరీని తాత్కాలికంగా నిలిపివేశామని, తాజా సడలింపులతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో రాత్రి షిఫ్టులో ఉన్న కార్మికులు ట్యాంక్ నుండి లీక్ అవుతున్న విషయాన్ని గుర్తించారని ఆ కంపెనీ ప్రతినిధి వివరించారు. సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చి బాధితులను ఆసుపత్రుల్లో పరామర్శించిన సందర్భంగా ఎల్జీ కంపెనీ ప్రతినిధులు విమానాశ్రయంలో సమావేశమై సంఘటన గురించి వివరించారు. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, సమీపంలో ఉన్న ప్రజలను, తమ కంపెనీ ఉద్యోగులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నట్లు జగన్‌కు వివరించారు. మరోవైపు గుజరాత్ పరిశ్రమల అదికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రత్యేకంగా విమానంలో బ్యూటాయిల్ ఆల్కహాల్‌ను తెప్పించినట్లు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. గాలిలో విషవాయువు కలిసిపోయి కలుషితం అయినందున దానికి విరుగుడుగా బ్యుటైల్ ఆల్కహాల్‌ను గాలిలో స్ప్రే చేస్తారని తెలిపారు. గతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని, అందరూ నిద్రపోతుండగా ఈ దుర్ఘటన జరిగడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యమే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఏం తయారవుతుంది?
దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్ ఇండియా కంపెనీలో ప్లాస్టిక్, ఫైబర్‌గ్లాస్, రబ్బర్, లేటెక్స్, ఇన్సులేషన్ వస్తువులు, పైపులు, ఫ్యాన్ బ్లేడ్లు, కప్పులు, కంటైనర్లు, కత్తులు, కాస్మెటిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే పదార్థాలతో పాటు వీటిలో ప్రముఖంగా వినియోగించే పాలీస్టిరీన్ ఉత్పత్తి అవుతుంది. వినైల్ బెంజీన్, ఫినైల్ ఇథిలీన్, ఇథనైల్ బెంజీన్ అనే మూడు రసాయనాల సమ్మేళనంతో స్టైరిన్ అనేది తయారవుతుంది. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. దీన్ని నిల్వ చేయడానికి కంపెనీ ఆవరణలో 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన రెండు భారీ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో ఒకదాని నుంచే గ్యాస్ లీకైంది. స్టైరిన్ కు వేగంగా మండే స్వభావంతో పాటు ఆ సమయంలో కార్బన్, హైడ్రోజన్‌లతో కూడిన విషవాయువులను వెలువరుస్తుంది. దేశంలో పాలీస్టిరీన్ ఉత్పత్తుల రంగంలో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎగుమతుల్లోనే ఈ కంపెనీదే ఎక్కువగా ఉంటుంది. ఆర్ఆర్ వెంకటాపురంలో సుమారు 213 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కంపెనీ రోజూ 417 టన్నుల పాలిస్టిరీన్‌ను ఉత్పత్తి చేస్తు,ది. ఈ కెమికల్‌ను పాలిమర్ ఇండస్ట్రీలో ఉత్పత్తులను వివిధ రకాలుగా మార్చేందుకు వినియోగిస్తారు.
అప్పుడు నగరానికి దూరంగా… ఇప్పుడు…
అరవై ఏళ్ళ క్రితం విశాఖపట్టణానికి దూరంగా 1961లో హిందూస్థాన్ పాలిమర్స్ అనే పేరుతో కంపెనీ స్థాపితమైంది. నగరం విస్తరిస్తున్నాకొద్దీ ఈ ప్రాంతం శివారుగా మారిపోయింది. ఆ తరువాత 1978లో ఇది యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) గ్రూప్‌కు చెందిన మెక్‌డోవెల్ అండ్ కో లిమిటెడ్‌లో విలీనమైంది. 1997లో దీనిని దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్ టేకోవర్ చేసింది. ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్జీపీఐ)గా రూపాంతరం చెందింది. దక్షిణ కొరియాలో ఈ సంస్థ స్టిరీన్ ఉత్పత్తుల విషయంలో దిగ్గజంగా కొనసాగుతోంది.
ఎల్జీ పాలిమర్స్‌లో ఏం జరిగిందంటే…
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ కూడా ఉత్పత్తి నిలిపేసింది. ఉత్పత్తి నిలిపేసినప్పటికీ మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యంపై ఉంటుంది. అయితే వైజాగ్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంపెనీలో కార్యకలాపాలు నిలిపేశారు. అయితే పరిశ్రమలో 45 మందికి అనుమతినిచ్చినట్టు తెలుస్తోంది. దీర్ఘ కాలం మూసి ఉంచిన పరిశ్రమను తెరిచిన తరువాత ఉత్పత్తి మొదలు పెట్టేక్రమంలో ఈ ఉదయం 3:45 నిమిషాల నుంచి 5:45 నిమిషాల మధ్య కాలంలో సుదీర్ఘ కాలం నిల్వ ఉన్న కెమికల్ లీకైంది.
కెమికల్ సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రభావం చూపింది. దీంతో ఈ పరిశ్రమకు దగ్గర్లో ఉన్న వెంకటాపురం, పద్మనాభనగర్, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్‌లపై ప్రభావం చూపింది. రాత్రి కావడంతో వాయువు నుంచి రక్షణకు స్థానికులు పరుగులు తీశారు ఈ క్రమంలో కళ్లు తిరిగి, శరీరంపై మంటలు వచ్చి ఊపిరి ఆడకపోవడంతో ఉక్కిరిబిక్కిరై రోడ్లపైనే ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోయారు. దీంతో సమాచారం అందుకున్న ఉన్నతాధికారుల హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడి హృదయవిదారక దృశ్యాలు చూసి తల్లడిల్లిపోయారు.
యుద్ధ ప్రాతిపదికన పోలీసుల రంగంలోకి దిగి సిటీలోని 25 అంబులెన్స్‌లను రప్పించారు. సైరన్ మోగిస్తూ ఐదు గ్రామాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలాలని అప్రమత్తం చేశారు. ఇంతలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులకు స్థానికులు సాయమందించారు. ఈ క్రమంలో వారికి ఎన్డీఆర్ఎఫ్ దళాలు జతకలిశాయి. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో కలెక్టర్ వేగంగా కదిలి నేవీ అధికారులను ఆశ్రయించారు. వారు ఆఘమేఘాలపై ఆక్సిజన్ సిలెండర్లు, వాహనాలతో సంఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. ఎన్‌డీఆర్ఎఫ్ దళాలు స్థానికుల ఇళ్ల తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి స్పృహ కోల్పోయిన పలువుర్ని ఆస్పత్రులకు చేర్చారు. ఇలా సుమారు 500 మందిని తరలించారు. 200 మందిని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు. వారిలో 80 మందిని వెంటిలేర్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటి వరకు 11 మంది మృత్యువాత పడ్డారు. కంపెనీలో విధుల్లో ఉన్న 15 మందికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడం విశేషం.
ఈ స్టైరిన్ వాయువు ఎలాంటిదంటే…
ఈ వాయువు చాలా ప్రమాదకరం. చర్మం మీద మంటలు, కళ్లలో దురద, ఎర్రగా అవడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది ముక్కు పొరల మీద తీవ్ర ప్రభావం చూపించడంతో గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. తర్వాత నేరుగా మెదడు, కాలేయాల మీద ప్రభావం చూపించడంతో సమస్యలు త్వరగా కనిపిస్తాయి. తక్కువ మొత్తంలో పీల్చినపుడు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు వస్తాయి. అదే ఎక్కువసేపు పీలిస్తే కేంద్రనాడీవ్యవస్థ మీద తీవ్ర ప్ర్రభావం చూపి తలనొప్పి, అలసట, కళ్లు తిరగడం, చెవుడు, పిచ్చిగా ప్రవర్తించడంతో పాటు వెంటనే మరణం సంభవించే ప్రమాదం ఉంది. హ్యూమన్ ఆక్యుపేషనల్ స్టడీస్ ప్రకారం స్టైరీన్ వాయువు కేన్సర్ కారకమే. తక్షణమే ప్రభావం చూపించకపోయినా ఈ వాయువును పీల్చడం వల్ల భవిష్యత్తులో లింఫోహెమాటోపోయ్‌టిక్ కేన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తెల్లరక్తకణాల మీద అధిక ప్రభావం కారణంగా ఈ కేన్సర్ వస్తుంది. అంతే కాకుండా ఈ వాయువు ప్రభావం మూడు రోజుల వరకు ఉంటుంది.
వైజాగ్‌లోని పరిశ్రమల్లో చోటుచేసుకున్న దుర్ఘటనలు..
1997 సెప్టెంబర్ 15న ఆయిల్ రిఫైనరీ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు మూడు రోజులపాటు ఆయిల్ ట్యాంకులు మండుతూనే ఉన్నాయి. ఆ పేలుడు ధాటికి 25 మంది చెల్లాచెదురుగా పడి మృత్యువాతపడ్డారు. శవాలను వెంటనే తీసుకొచ్చే పరిస్థితి కూడా లేకపోయింది. ఇది వైజాగ్ చరిత్రలోనే అత్యంత భీతిగొల్పే ప్రమాదమని విశాఖ వాసులు చెబుతుంటారు.
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా గత మే 1వ తేదీన టెక్నికల్ ప్రోబ్లెమ్ కారణంగా 120 టన్నుల కరిగించిన ఇనుము ఉక్కు నేలపాలైంది. ఇలాంటి ఘటనలు తరచు చోటుచేసుకునేప్పటికీ కార్మికులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లక పోవడం విశేషం. తాజాగా చోటుచేసుకున్న దుర్ఘటనే వైజాగ్ పరిశ్రమల్లో చోటుచేసుకున్న అత్యంత విషాదకరమైన దుర్ఘటన.
ఏపీ పరిశ్రమల శాఖ స్పందన…
వెంకటాపురం ఘటనపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ తీవ్రంగా స్పందించింది. తొలి ప్రాధాన్యంగా స్థానికులను తరలించే కార్యక్రమాలను మంత్రి గౌతమ్ రెడ్డి పర్యవేక్షించారు. కలెక్టర్, డీసీపీ, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి కనగరాజును అప్రమత్తం చేశారు. రసాయనం తాలుకు ప్రభావం ఉండకుండా ఎల్జీ పారిమర్స్ ప్రతినిధులతో మాట్లాడి, నిల్వ ఉన్న రసాయనాన్ని యాంటీ డోస్‌తో నిర్వీర్యం చేశారు. అనంతరం మున్సిపల్, ఫైర్ సిబ్బంది సహకారంతో నీటిని స్ప్రింక్లింగ్ చేసి, పరిశ్రమ పరిసరాల్లోని గ్రామాలపై కెమికల్ ప్రభావం ఎక్కువ సేపు ఉండకుండా చర్యలు చేపట్టారు. అలాగే నేవీ అధికారులతో మాట్లాడి, గాలిలో దాని ప్రభావం ఉండకుండా యాంటీ డోస్‌ను హెలీకాప్టర్ ద్వారా చల్లించనున్నారు. ప్రమాదం నేపథ్యంలో పరిశ్రమపై కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ విభాగాన్ని పంపి కెమికల్ లీక్‌కు కారణాలు ఆరాతీస్తున్నారు. ఇప్పటికే ఒక కమిటీని నియమించారు. పరిశ్రమపై చర్యలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఏపీ సీఎం స్పందన
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న కెమికల్ లీకేజీ ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన విశాఖపట్టణం బయల్దేరారు. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా పర్యటనను ముగించారు. హెలికాప్టర్‌లో విమానాశ్రయంలో దిగగానే, నేరుగా కేజీహెచ్‌కు చేరుకున్నారు. అక్కడ బాధితులతో పాటు మృతుల కుటుంబీకులను కలుసుకున్నారు. వారితో మాట్లాడారు. ప్రమాద ఘటన జరిగిన తీరుతో పాటు, వారు అనుభవించిన నరకాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బాధితులకు అత్యాధునిక వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం కలెక్టర్ ద్వారా ఘటనపై పూర్తి వివరాలు ఆరాతీశారు.
ఈ క్రమంలో సుమారు వెయ్యి మంది వరకు బాధితులు ఉంటారని కలెక్టర్ వివరించారు. దీంతో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని తెలిపారు. ఈ ఘటనలో గాయపడి, రెండుమూడు రోజులు చికిత్స పొందే వారికి లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు. 5 బాధిత గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. మరణించిన పశువుల యజమానులకు పరిహారంగా 25 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు.
కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృత్యువాతపడ్డారు. కుందన శ్రేయ (6), ఎన్.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణమూర్తి (73)తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో మృతుడు చంద్రమౌళి విశాఖపట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్ ప్రధమ సంవత్సరం చదువుతున్నాడు. గ్యాస్ లీకైన ప్రాంతంలో వుండడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మృతుల్లో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
హైకోర్టు ఆగ్రహం.. సుమోటోగా కేసు
విశాఖలో విషవాయువు ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ సందర్భంగా ఓ ఘటనను సుమోటోగా స్వీకరించడం అంటే ప్రభుత్వ వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్నామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. నగరంలో జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమ ఎలా ఏర్పాటు చేశారంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను అమికస్ క్యూరీగా నియమించింది. దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఎన్‌హెచ్‌ఆర్సీ ఆగ్రహం..
ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన విషవాయువు పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
మీడియా కథనాలనే ప్రాథమిక సమాచారంగా పరిగణిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో కొందరు మృత్యువాత పడడమే కాకుండా, చాలామంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడడం, మరికొందరికి శరీరంపై దద్దుర్లు రావడం వంటి విషయాలను ఎన్‌హెచ్ఆర్‌సీ గుర్తించింది. ఇప్పటివరకు ఈ ఘటన మానవ తప్పిదంగానో, నిర్లక్ష్యంగానో జరిగినట్టు వెల్లడి కాకపోయినా, ఇది మానవ హక్కులకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనగా కమిషన్ భావిస్తోంది.
ఈ మేరకు చేసిన ప్రకటనలో జీవించడం ప్రజల హక్కు. అలాంటి హక్కును కేత్రస్థాయి నుంచి ఉల్లంఘించారు. ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తికి భయపడి అందరూ ఇళ్లలో ఉన్న సమయాన ఉరుముల్లేని పిడుగులా ఈ విషవాయువు లీకైందని కమిషన్ పేర్కొంది. ఈ ఘటనకు కారణాలు, సహాయక చర్యలు, వైద్య వివరాలతో పూర్తి నివేదిక అందజేయాలని ఏపీ సీఎస్‌ను ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశించింది. ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ తాలూకు వివరాలు, దర్యాప్తు వివరాలు తమకు తెలియజేయాలంటూ రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపింది.
మరోవైపు ఈ వ్యవహారంలో నియమనిబంధనల ఉల్లంఘన జరిగిందేమో పరిశీలించాలని సంబంధిత విభాగం కార్యదర్శిని ఆదేశించాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై సమాధానానికి నాలుగు వారాల గడువు విధించింది.
ఎల్జీ పాలిమర్స్ స్పందన..
సీఎం తిరుగు ప్రయాణం సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు జగన్‌ను కలిశారు. ఈ సందర్బంగా ప్రమాదంపై వివరించారు. వాయువు లీకవ్వడానికి కారణాలతో పాటు లీకేజీని అరికట్టేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. అనంతరం కెమికల్ లీకేజీ ఘటనపై స్పందించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్లాంట్‌ను తాత్కాలికంగా నిలిపేశామని పేర్కొంది. లాక్‌డౌన్ సడలింపులతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహకాలు చేసుకుంటున్న సమయంలో… ట్యాంక్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్టు నైట్ షిఫ్ట్‌లో ఉన్న ఓ కార్మికుడు గుర్తించాడని తెలిపింది. అయితే గ్యాస్ ఎలా లీక్ అయిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఎల్జీ చెప్పింది. గ్యాస్ లీకేజీ వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్రజలు, ఉద్యోగులను రక్షించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పింది.లీక్ అయిన వాయువును పీల్చినప్పుడు వికారంతో పాటు, మైకం ఆవరిస్తుందని తెలిపింది. ప్రమాదం జరగడంబాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని తెలిపింది.
Tags: visakhapatnam, lg polymers company, styrene leak, tragedy in visakha