- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ ఉన్నా.. కరోనా ఉద్ధృతి
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ కాలాన్ని పొడిగిస్తూ వెళ్లుతున్నది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే అదొక్కటే తారక మంత్రం అన్నట్టుగా సర్కారు భావిస్తున్నది. అందుకే మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే ఉన్నది. మూడు వారాల లాక్‌డౌన్ తర్వాత కొన్ని సడలింపులతో దాన్ని మరో 19 రోజులు పొడిగించింది. అనంతరం ఇంకొన్ని మినహాయింపులనిచ్చి ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించిన విషయం తెలిసిందే. కానీ, కేవలం లాక్‌డౌన్‌తోనే కరోనాకు చెక్ పెట్టడం సాధ్యమేనా? ఇతర మార్గాలను అన్వేషించకుండా.. పటిష్ట చర్యలు తీసుకోకుండా.. సింబాలిక్‌గా లాక్‌డౌన్ విధించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇతర నియంత్రణ చర్యలను అమలు చేయలేని మోడీ ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగింపే మేలు అనే సూత్రాన్ని పాటిస్తున్నదన్న విమర్శలూ వెలువడుతున్నాయి. అదీగాక, ఈ మూకుమ్మడి లాక్‌డౌన్ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. వలస జీవుల, పేదల బతుకులు దుర్భరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రెండుసార్లు ఆర్థిక సహకారాన్ని కేంద్రం ప్రకటించింది కానీ, కరోనా కట్టడికి ఇతర నియంత్రణ చర్యలను అమలు చేయనేలేదు.
ప్రపంచంలోనే అతిపెద్ద లాక్‌డౌన్ మన దేశంలో అమల్లోకి వచ్చి 40 రోజులు గడిచాయి. మరి ఈ 40 రోజుల్లో కరోనాకు అడ్డుకట్ట వేయగలిగామా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే లాక్‌డౌన్ కాలంలోనూ కరోనా కొత్త కేసులు తగ్గటం లేదు. ప్రతి రోజూ అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,411 కేసులు నమోదవడం గమనార్హం. అదీగాక, హాట్‌స్పాట్‌లను గుర్తించి కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి ఇతర చోట్లకు సోకకుండా దాని వ్యాప్తిని కట్టడి చేసే లాక్‌డౌన్ లక్ష్యమూ నీరుగారినట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే ఇటీవలే జరిపిన ఓ అధ్యయనంలో గతనెల 17 నుంచి 26వ తేదీ మధ్యలో ఒక్క కరోనా కేసు కూడా లేని 42 జిల్లాలలోనూ కరోనా కేసులు నమోదైనట్టు తేలింది. అంటే, దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో కరోనా వ్యాప్తిని వాయిదా వేయడం తప్పితే దాని కట్టడి సాధ్యం కాలేదని తేలిపోయింది. అంతేకాదు, ఈ నిర్ణయంతో వలస కార్మికుల జీవితాలు పెను కుదుపునకు లోనవడమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకూ భారీ నష్టం వాటిల్లింది.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి 40 రోజులు గడుస్తున్నా.. కరోనా కేసులు 40వేలను దాటాయి. శనివారం ఒక్కరోజే 2,411 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. కరోనా మరణాలు పెరుగుతున్నాయి. శనివారం 93 కరోనా మరణాలు సంభవించడంతో ఈ సంఖ్య మొత్తంగా 1,300లను దాటింది. గతంలో తబ్లిఘీ జమాత్ సదస్సు లాంటి కొన్ని తప్పిదాలు, అవాంఛనీయ ఘటనలతో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కానీ, శనివారం కేసులు భారీగా పెరగడానికి మాత్రం అటువంటి కారణాలేవీ లేకపోవడం గమనార్హం. అంటే.. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ కాస్త నెమ్మదిగానైనా స్థిరంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయని అర్థమవుతున్నది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులాంటి రాష్ట్రాల్లో మాత్రం నిరాఘాటంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శనివారంనాటి 2,411 కేసుల్లో 1,507 కేసులు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలలోనే నమోదవడం గమనార్హం. అయితే, ఇప్పటికే కరోనా వైరస్ వేగంగా విస్తరించిన చోట్లకే ఈ కేసులు పరిమితమయ్యాయని, హాట్‌స్పాట్‌ల గుర్తింపు మూలంగా ఇతర ప్రాంతాలకు వైరస్ విస్తరించకుండా నియంత్రించగలిగామని భావిస్తే పొరపాటేనని ఓ అధ్యయనం వెల్లడిస్తున్నది.
లాక్‌డౌన్ మూలంగా కరోనా వైరస్‌ను దాని ప్రభావిత ప్రాంతాలకే(హాట్‌స్పాట్) పరిమితం చేస్తున్నామని కేంద్రం చెబుతున్నది. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తిలేని జిల్లాల సంఖ్య, లేదా కొత్త కేసులు రిపోర్ట్ కాని జిల్లాల సంఖ్యను ప్రెస్‌మీట్‌లలో వెల్లడిస్తున్నది. నిజంగానే లాక్‌డౌన్‌తో కరోనా వైరస్‌ను ఒక్కో జిల్లాను కరోనారహితంగా మార్చి.. మహమ్మారిని పూర్తిగా నిర్మూలించగలమా? అంటే ఇండియా టూడే మీడియా సంస్థ చేపట్టిన అధ్యయనం.. కేంద్రం చెబుతున్న ఈ ఆశావాహ ఆలోచనలపై నీళ్లు చల్లుతున్నది. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి 23 రోజులు గడిచిన తర్వాత గతనెల 17 నుంచి 26వ తేదీ మధ్యలో (ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ మినహా) దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా కరోనా కేసుల నమోదుపై పరిశీలనలు చేశారు. ఈ అధ్యయనంలో.. ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వని 14 రాష్ట్రాలు, యూటీలలోని 42 జిల్లాల్లో కొత్తగా కేసులు వెలుగుచూశాయని వెల్లడైంది. ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాలు, బీహార్‌లోని ఎనిమిది జిల్లాలు, గుజరాత్‌లోని ఐదు జిల్లాలు, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో మూడేసి జిల్లాలు, జమ్ము కశ్మీర్, తమిళనాడు, తెలంగాణలలో రెండేసి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబర్ దీవులు, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలలో ఒక్కో జిల్లాలలో లాక్‌డౌన్ అమల్లో ఉన్నా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ 42 జిల్లాలో దాదాపు సగం జిల్లాలు.. కరోనా సోకని జిల్లాల సరిహద్దుల్లోనే ఉండటం గమనార్హం. అంటే.. ఈ అధ్యయనంతో 23 రోజుల లాక్‌డౌన్ కాలం.. రాష్ట్రాలు, జిల్లాల మధ్య ప్రయాణాలపై నిషేధాజ్ఞలు ఫలితాలనివ్వలేదని తేలుతున్నది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా యుద్ధ వీరులకు చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం, పూలు కురిపించడంలాంటి చర్యలకు పూనుకుంటున్నది. కరోనా వ్యాప్తిపై వేగంగా అప్రమత్తమై లాక్‌డౌన్ విధించినట్టు చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం.. దాని ఎత్తివేత బాధ్యతలను మాత్రం మెల్లమెల్లగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పుతుండటం గమనార్హం. నియంత్రణ చర్యలపై ఉదారంగా వ్యవహరించి.. ఇప్పడు లాక్‌డౌన్‌తో నియంత్రణ సాధ్యం కాని పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ బాధ్యతను రాష్ట్రాలపైకి నెడుతున్నది.
tags: coronavirus, lockdown, contain, spread, cases spike