కలవరపెడుతున్న డెంగ్యూ.. ప్రజలు ఏం చేశారంటే..?

by Aamani |   ( Updated:2021-08-19 08:30:16.0  )
కలవరపెడుతున్న డెంగ్యూ.. ప్రజలు ఏం చేశారంటే..?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో డెంగ్యూ కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే డెంగ్యూతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని, పరిసరాలను పరిశుభ్రం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్ కాలనీ వాసులు గురువారం రోజున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.

నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ వీధిలోని పరిసరాలను పరిశుభ్రం చేయకపోవడం వల్ల పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు డెంగ్యూ జ్వరాల బారిన పడి చనిపోతున్నారు. ఇప్పటికే ఐదారుగురు డెంగ్యూ జ్వరంతో చనిపోయారు. స్థానిక మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పరిసరాలను పరిశుభ్రం చేయడం లేదు. దీంతో విసుగు చెందిన కాలనీ వాసులు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.

వెంటనే పరిసరాలను శుభ్రపరచాలని.. డెంగ్యూ కేసులు పెరగకుండా అవసరమైన తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాజుల్ పేట్ కాలనీని మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కాలనీ వైపు వచ్చిన పాపాన పోలేదని, దీంతో గత్యంతరం లేక ఈరోజు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించామన్నారు. సమస్యను పరిష్కారం చేయకుంటే.. మళ్లీ ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story