ఆక్సిజన్ అందించే ప్రతీ దాత.. మహా వృక్షమే!

by Shyam |   ( Updated:2021-05-20 23:39:36.0  )
medicines
X

దిశ, ఫీచర్స్: భూమిపై ఉన్న మానవులందరికీ 6 నెలలు ఆక్సిజన్ సృష్టించడానికి 38 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. అంటే ప్రపంచంలోని మొత్తం డబ్బును మనం ఖర్చు చేసినా.. భూమిపై ఉన్న మానవులందరికీ 6 నెలలు పాటు కూడా ఆక్సిజన్ సృష్టించలేం. కానీ చెట్లు ఉచితంగా ఆక్సిజన్ తయారు చేస్తాయి. అయితే ప్రస్తుత పాండెమిక్ పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించే ప్రతి దాత ఓ మహావృక్షమే. అలాంటి సహృదయంతో బెంగళూరులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన పూర్వ విద్యార్థుల బృందం ‘ఆక్సిజన్4 బిఎల్ఆర్’‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన ‘అగర్వాల్ సమాజ్’‌లు ఆపదలో ముందు నిలిచి, డబ్బులు ఆశించకుండా తోటి మానవుడి ఆయువు కోసం ప్రాణవాయువు అందిస్తున్న సేవాతత్పరులపై ప్రత్యేక కథనం.

భారత దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ సృష్టిస్తున్న వినాశనం మాటల్లో చెప్పలేనిది. కరోనా అత్యవసర చికిత్సలో బాధితులకు ఆక్సిజన్‌ ఇవ్వడం కీలకంగా మారింది. వందలకొద్దీ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులున్నా ‘ఆక్సిజన్’ కొరత వల్ల కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన సమయానికి ప్రాణవాయువు ఇవ్వడం వల్ల రక్తంలో తగ్గిన ఆక్సిజన్‌ శాతం పెరిగి, అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. దాంతో ప్రాణాపాయం నుంచి బయటపడతారు.

ఆక్సిజన్4 బెంగళూరు..

కరోనాతో బాధపడుతూ ఆక్సిజన్ అవసరమైన వారికోసం చాలామంది కుటుంబ సభ్యులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ (OC) కొనుగోలు చేశారు. ఏదేమైనా ఒక నెల లేదా రెండు నెలల తర్వాత రోగి కోలుకున్నాక ఆ ఓసీలు వారికి ఉపయోగపడవని తెలిసిన విషయమే. అయితే ఇలా నిరూపయోగంగా ఉన్న వాటిని అవసరమైన వారికి అందించడం వల్ల ఒకరి ప్రాణం కాపాడగలుగుతామని నిశ్చయించుకున్న ఐఎస్‌బీ (ISB) పూర్వ విద్యార్థులు బృందం.. ‘ఆక్సిజన్4బీఎల్ఆర్’‌ ద్వారా ఉచితంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందించడం మొదలుపెట్టింది. ఈ మేరకు భారతదేశంలోని ISB, ఇతర బిజినెస్ స్కూల్స్‌కు చెందిన మొత్తం 20 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు.

ఏప్రిల్ చివరి వారంలో ఇతర దేశాల నుంచి OC లను దిగుమతి చేసుకునే లోకల్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి 25 ఓసీలకు ఆర్డర్ ఇచ్చింది ఈ బెంగళూరు టీమ్. ఆర్డర్ అయితే పెట్టారు కానీ, దాన్ని ఓకే చేయడానికి 50శాతం అడ్వాన్స్ చెల్లించాలి. వారి చేతిలో డబ్బుల్లేవు. దాంతో ఫండ్ రైజింగ్ చేయగా, కొంత మొత్తం వచ్చింది. బృంద సభ్యులైన గుర్ ప్రీత్, పవన్‌ ఇద్దరూ కూడా తమ సేవింగ్స్ నుంచి రూ.7 లక్షలు ఇవ్వడం విశేషం. అంతా అనుకున్నట్లుగా జరిగి మే 10న ఆ బృందం తమ మొదటి ఓసీని బాధితుడికి డెలివరీ చేసింది. అయితే ఓసీని ఉచితంగానే అందించినా.. ఓసీ కోసం డిపాజిట్‌గా రూ. 50వేలు చెల్లించాలి. ఒక రోగి లేదా వారి కుటుంబం డిపాజిట్ చెల్లించలేకపోతే ఆ అమౌంట్‌లో తక్కువ చేస్తారు లేదా మాఫీ చేస్తారు. ఇనిషియేట్ ప్రారంభించిన కేవలం 10 రోజల్లోనే ఓసీలు సకాలంలో పంపించి దాదాపు 25 మందికి పైగా ప్రాణాలు కాపాడారు. ఈ క్రమంలోనే వాళ్లు ఒక సంవత్సరంలో 3 వేల మంది ప్రాణాలను కాపాడటానికి 100 ఓసీలను సేకరించాలని వారు యోచిస్తున్నారు. ఇందుకోసం ఎవరికీ తోచినంత వాళ్లు నిధులు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నారు.

ఆక్సిజన్ ఏకాగ్రత కోసం ఎలా అభ్యర్థించాలి?

మీరు బెంగళూరులో నివసిస్తుంటే.. కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి OC అవసరమైతే అధికారిక ‘ఆక్సిజన్4బిఎల్ఆర్’ వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇక్కడ మీరు రోగి పేరు, స్పెసిమెన్ రెఫరల్ ఫారం (SRF) ఐడీ, కేవైసీ (మీ కస్టమర్ తెలుసుకోండి) పత్రాలతో పాటు.. SpO2 (ఆక్సిజన్ సంతృప్త) స్థాయిలతో సహా అవసరమైన వివరాలను పూరించాలి. చివరగా వారు డిపాజిట్ చెల్లించాలనుకుంటున్న వినియోగదారు ఎంచుకోవచ్చు. అయితే యూపిఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. అలాగే బృందం అభ్యర్థనను స్వీకరించిన తర్వాత వలంటీర్ దాన్ని ధ్రువీకరిస్తాడు. రోగి అటెండెంట్ రెండు గంటల్లో తన సమీప వలంటీర్ స్థానం నుండి తీసుకోవచ్చు.

ద అగర్వాల్ సమాజ్..

వస్త్ర వాణిజ్యంతో సంబంధం ఉన్న 60-70 మంది సభ్యులతో ‘ద అగర్వాల్ సమాజ్’ సిటీ అంతటా నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. హైదరాబాద్ నగరంలోని అబిడ్స్, బంజారాహిల్స్, మలక్ పేట్, కొండాపూర్, శేర్ లింగంపల్లి ప్రాంతాలతో సహా దాదాపు 50 ఏరియాల్లో వారి వలంటీర్లు ఉన్నారు. అగర్వాల్ సమాజ్ ఇప్పటివరకు 55 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సేకరించగా, తీవ్రమైన కొరతలో కూడా మరో 100 ఓసీలను సేకరించే పనిలో ఉన్నారు. ప్రతి రోజు 50-60 కాల్స్ వారికి వస్తుండగా.. ఈ బృంద సభ్యులు ఆక్సింజన్ కాన్సంట్రేటర్స్ కాకుండా వీల్ చెయిర్స్, బెడ్స్, ప్లాస్మా డోనేషన్స్, వ్యాక్సిన్ సపోర్ట్, మెడిసిన్స్ అందిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. వీరు ఓసీలను ఉచితంగానే అందిస్తున్నారు. డిపాజిట్ కూడా తీసుకోవడం లేదు. ఇప్పటివరకు తమ బృందం వల్ల 600 మంది కొవిడ్ బాధితులు ఆక్సిజన్ పొందగలిగారు. వీరితోపాటు ఢిల్లీలోని ఆర్య ప్రతినిధి సభ కూడా ఉచితంగా ఆక్సిజన్ అందిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed