కవ్విస్తే.. దీటుగా బదులివ్వండి

by Shamantha N |
కవ్విస్తే.. దీటుగా బదులివ్వండి
X

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో కమ్ముకున్న యుద్ధమేఘాలు ఇప్పటికిప్పుడే తొలగిపోయేలా లేవు. ఉద్రిక్తతల పరిష్కారానికి శాంతి చర్చలు జరుగుతున్నా సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు జూన్ 6న ఇరుదేశాలు అంగీకరించినప్పటికీ 15వ తేదీన హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకోవడంతో కేవలం చర్చలనే నమ్మే పరిస్థితి లేదు. అందుకే ఎటువంటి ఆకస్మిక ఘటనలు చోటుచేసుకున్నా ఎదుర్కొనేందుకు బలగాలను భారత్ సంసిద్ధం చేస్తున్నది. సరిహద్దు దగ్గర అదనపు బలగాలను మోహరిస్తున్నది. ఈ నేపథ్యంలో సరిహద్దులో రక్షణ దళాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. త్రివిధ దళాల అధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె, వైమానిక దళ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బధౌరియా, నేవీ దళ చీఫ్ అడ్మైరల్ కరంబీర్ సింగ్‌లతో సరిహద్దులో బలగాల సంసిద్ధతపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ భేటీలో రక్షణ దళాలకు కీలక ఆదేశాలను జారీ చేసినట్టు సమాచారం అందింది. చైనా నుంచి ఆకస్మికంగా అవాంఛనీయ ఘటనలు ఎదరైతే దీటుగా ఎదుర్కోవాలని సూచించారు. భారత సరిహద్దు గుండా పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు మరింత జాగరూకతగా మెదలాలని తెలిపారు. అలాగే, నేవీ, వైమానిక దళాలు చైనా కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, దేనికైనా సిద్ధంగా ఉండాలని తెలిపారు. చైనా సైన్యం దురుసుగా వ్యవహరిస్తూ సరిహద్దు దాటే యత్నం చేసినా, కవ్వింపు చర్యలకు దిగినా కఠినంగా సమాధానమివ్వాలని పేర్కొన్నారు. చైనా దూకుడును అడ్డుకునేందుకు బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. క్షేత్రస్థాయిలో చైనా మిలిటరీని ఎదుర్కొనేందుకు పూర్తిస్వేచ్ఛ ఇచ్చినట్టు ప్రధాని ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.

డిఫెన్స్‌కు ఎమర్జెన్సీ ఫండ్

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రక్షణ దళాలను పటిష్టం చేసే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లోటు ఉన్న, లేదా అవసరమున్న ఆయుధాలను సమకూర్చుకునేందుకు భద్రతా దళాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో ఆయుధాలను సమకూర్చుకోవాలని సూచించింది. ప్రాజెక్టుకు రూ. 500 కోట్ల మేర అందించేందుకు సంసిద్ధత తెలిపింది. అవసరమైన మేరకు ఆయుధాలను కొనుగోలు చేసుకునే, ప్రాజెక్టుకు రూ.500 కోట్లు వెచ్చించే అధికారాన్ని త్రివిధ దళాల వైస్ చీఫ్‌లకు కేంద్రం కట్టబెట్టింది. ఉరి, బాలాకోట్ మెరుపుదాడుల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సౌలభ్యాన్నే రక్షణ దళాలకు కల్పించింది. కాగా, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో రష్యా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కొన్ని కీలకమైన రక్షణపరమైన, ఆయుధాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు తెలిసింది. రెండో ప్రపంచయుద్ధంలో విజయం సందర్భంగా ఈ నెల 24న మాస్కోలో జరగనున్న విక్టరీ మిలిటరీ పరేడ్‌కు రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే రష్యాతో ఒప్పందాలు జరుగుతుండటం గమనార్హం.

అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలకు ఓకే

చైనాతో హింసాత్మక ఘర్షణల్లో భారత జవాన్లు ఎందుకు ఆయుధాలు ఉపయోగించలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. డ్రాగన్ జిత్తులకు 20మంది సైనికుల ప్రాణాలు కోల్పోయామన్న నిస్పృహలూ వెలువడ్డాయి. దీనిపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. ఈ ప్రశ్నలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ, సరిహద్దులో శాంతి కొనసాగేందుకు ఇరుదేశాల సైనికులు ఘర్షణపడ్డప్పుడు ఆయుధాలు ఉపయోగించవద్దన్న 1996, 2005 ఒప్పందాలను గుర్తుచేశారు. ఆ ఒప్పందాలకు అనుగుణంగానే భారత జవాన్లు వెపన్స్ ఉపయోగించలేదని వివరణ ఇచ్చారు. తాజాగా, చైనా ఆర్మీతో డీల్ చేసే విధానంలో పలు మార్పులు చేసినట్టు ఆర్మీ వెల్లడించింది. అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు జవాన్లను ఆయుధాలు ఉపయోగించండని ఆదేశాలిచ్చే అధికారాన్ని ఫీల్డ్ కమాండర్‌కు కల్పిస్తూ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్మీవర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story