- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిజినెస్ ఢమాల్..ఈసారి కూడా వేల కోట్ల వ్యాపారానికి బ్రేక్..!
దిశ, తెలంగాణ బ్యూరో : “ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన ఓ కుటుంబంలో మే 6న వివాహం జరుగాల్సి ఉంది. ఎప్పుడో ముహూర్తం పెట్టుకున్నారు. ముందుగానే రూ. 2.60 లక్షలకు ఓ ఫంక్షన్ హాల్‌ను బుక్ చేశారు. రూ.60 వేలు అడ్వాన్స్ చెల్లించారు. వెయ్యి మంది భోజనాలకు ఆర్డర్ ఇచ్చారు. ప్లేట్‌కు రూ. 700 చొప్పున రూ. 7 లక్షలకు క్యాటరింగ్ బుక్ చేసుకుని రూ.లక్ష అడ్వాన్స్ ఇచ్చారు. కానీ పరిస్థితి మళ్లీ రివర్స్ అయింది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ వచ్చింది. వచ్చేనెలలో లాక్‌డౌన్ ఉంటుందని ప్రచారం. అంతేకాకుండా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఈ వివాహానికి చేరో 50 మంది చొప్పున పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయినా జరుగుతుందా… లేదా అనేది అనుమానమే. అయితే ఇప్పుడు అంత పెద్ద ఫంక్షన్‌హాల్ అవసరం లేదు… వెయ్యి మందికి భోజనాలు కూడా వద్దు. ఇప్పుడు వీటిని రద్దు చేసుకుంటే ఇచ్చిన అడ్వాన్స్‌లు ఇస్తారా లేదా అనేది సందేహమే. కొన్నిచోట్ల మాత్రం అడ్వాన్స్‌లు ఇవ్వమని కరాఖండిగా చెప్పుతున్నారు.
కరోనా కాలం మరి..!
పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు కుమ్మరించేవారు. విందు,చుట్టాలు , వందలాది కాదు వేలాది మందికి భోజనాలు,అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా సాగాలి పెళ్లంటే మరీ అని హడావిడి చెయ్యాలనుకుంటే ఇప్పుడు అస్సలు కుదరడం లేదు. ముంచుకొస్తున్న ముహూర్తాల వేళ.. గడప దాటనివ్వకుండా కరోనా కంచె వేసింది. దీంతో మంచి ముహూర్తాలు మౌనంగా దాటిపోతున్నాయి. ఇప్పటికే గతేడాది లాక్‌డౌన్‌తో వేలాది పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. దీంతో వేలాది మంది ఈ ఏడాదికి వాయిదా వేసుకున్నారు. ఈ సమయంలో వచ్చేనెల నుంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే కళ్యాణ మండపాలు మూతపడ్డాయి. వచ్చే నెలల్లో జరగాల్సిన వేలాది పెళ్లిళ్లు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు మాత్రం అటువైపు, ఇటువైపు కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో సాదాసీదాగా కళ్యాణాలు చేసుకునేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు.
అన్నీ బంద్..
కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ ప్రభావం మరోసారి వివాహాది శుభ కార్యక్రమాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. 70 రోజులపాటు శుక్రమూఢమి కొనసాగి మే 1వ తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడుతోంది. ఇప్పటికే కల్యాణ మండపాలు, విందు వినోదాలతోపాటు అనేక ఈవెంట్ల నిర్వహణకు లక్షల్లో అడ్వాన్సులు చెల్లించినవారు ఇప్పుడు ఆగండి.. కాస్త వేచి చూద్దామంటూ సందేశాలు ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా గతేడాది మార్చి 3వ వారం నుంచి కరోనా ఎఫెక్ట్‌తో ఆరు నెలలకుపైగా పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. తరువాత ముహూర్తాలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఇక 2021 జనవరి మూడో వారం నుంచి శుక్రమూఢమి కారణంగా పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి వాటికి ముహూర్తాలు లేవు. ఇప్పుడు వైశాఖమాసంలో మే 1వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో ముందస్తుగానే వధూవరుల తల్లిదండ్రులు భారీగా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. కల్యాణ మండపాలు, ఫంక్షను హాళ్లు, హోటళ్లతోపాటు షామియానాలు, పూల డెకరేషన్లు, క్యాటరింగ్‌కు అధిక మొత్తాల్లో అడ్వాన్సులు చెల్లించి ఖరారు చేసుకున్నారు. మే, జూన్ నెలల్లో పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఉండడంతో కొన్ని వేల పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. గతంలో కరోనాతో వాయిదా పడ్డ పెళ్లిళ్లు సైతం ఈ ముహూర్తాల్లో అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నప్పటికీ కరోనా మరోసారి వారి పాలిట శాపంగా మారింది. మూఢం ఉన్న మూడు నెలలు మౌనంగా ఉన్న కరోనా ముహూర్తాలు ప్రారంభమయ్యే సమయానికి విజృంభించడం తమకు శాపంగా మారిందంటూ కల్యాణ మండపాల యజమానులతోపాటు వివిధ ఈవెంట్ల మేనేజర్లు ఆవేదన చెందుతున్నారు. లక్షల్లో అడ్వాన్సులు చెల్లించామని, ఇప్పుడు తిరిగి ఇమ్మన్నా వచ్చే పరిస్థితి లేదని వధూవరుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కరోనా నిబంధనలు పాటించాలంటూ అధికారులు ఆదేశాలిస్తుండడంతో పాటు నైట్ కర్ఫ్యూ, కంటోన్మెంట్ జోన్లు, లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయడం వల్ల పెళ్లిళ్లు ఎలా జరుగుతాయనే ఆందోళన ఇరువర్గాల బంధుమిత్రుల్లో నెలకొన్నాయి. ఇప్పటికే దేవుళ్ల కల్యాణాలు, శ్రీరామనవమి వేడుకలు వంటివి రద్దు అయిన నేపథ్యంలో పెళ్లిళ్లపై కూడా కరోనా ఆంక్షలు తీవ్ర ప్రభా వం చూపనున్న దృష్ట్యా వివాహ వేడుకలతో ముడిపడి ఉన్న అన్ని వర్గాలవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కష్టకాలం..
పెళ్లి సంగతలా ఉంచితే, వీడియో, ఫొటోగ్రాఫర్ల హడావుడి అంతా ఇంతా కాదు. సినిమా మాదిరి పెళ్లిని చిత్రీకరించేందుకు కనీసం ముగ్గురు నలుగురు వీడియో, ఫొటోగ్రాఫర్లు ఉండేవారు. ప్రస్తుతం ఒక్కరితోనే సరిపెట్టేస్తున్నారు. ఫలితంగా చాలామంది వీడియో, ఫొటోగ్రాఫర్లు పెళ్లి కాంట్రాక్టులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు.
మోగని బ్యాండ్ బాజా..
గతంలో పెళ్లిళ్లూ, విందుల్లో ఆర్కెస్ట్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. జిగేల్‌మనే దీపాలు, డీజే, బ్యాండు మేళాలతో పెళ్లి ప్రాంగణం మారుమోగేది. కరోనా ఆంక్షలతో వీటికి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఆర్కెస్ట్రాలకూ, బ్యాండ్ బాజాలకు పని లేకుండా పోయింది. అందులో పనిచేసే వారు ఇతర పనులు వెతుక్కుంటున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం ఫంక్షన్ హాళ్లను అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడికి కఠిన చర్యలే చేపడుతున్నారు. పోనీ ఏ గుడిలోనో, బడిలోనో వివాహ కార్యక్రమం జరుపుకుందామనుకున్నా అవి పూర్తిగా బంద్ అయిపోయాయి. దగ్గరి బంధువులు కూడా పెళ్ళిళ్ళకు హాజరు కావడం అనుమానం అనే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఇచ్చిన అడ్వాన్స్ లు రానట్టే …
వివాహ ముహూర్తం కుదిరి కుదరగానే ఫంక్షన్ హాల్స్ నుంచి ఫోటో గ్రాఫర్ వరకు అన్ని తక్షణం బుక్ చేసుకోకపోతే ఆ సమయానికి ఏ ఒక్కరు దొరకరు. దాంతో భారీ ఎత్తున అడ్వాన్స్ లను ఇప్పటికే ముహుర్తాలు పెట్టుకున్నవారు ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ లను తీసుకున్నవారు వెనక్కి ఇవ్వరు. అలా అని సింపుల్ గా పెళ్ళి చేసుకుంటే ఆ సొమ్మంతా కరోనా వైరస్ కి అర్పించినట్లే అవుతుంది. వచ్చే ముహూర్తాల్లో నాలుగు రూపాయలు సంపాదించొచ్చని వివాహాలకు ఎదురు చూస్తున్న వారంతా ఇప్పుడు ఈ సీజన్ కరోనా దెబ్బతో లేనట్లే అని మథనపడుతున్నారు.
బంగారం, వస్త్ర దుకాణాలకు వెళ్లేదెలా..?
వివాహాలంటేనే బట్టలు, బంగారం. కానీ ఈసారి కూడా కొనుగోళ్లు జరిగేలా లేవు. కరోనా ఆర్థిక కష్టాలు ఓ వైపు ఉంటే… అసలు పెండ్లే జరుగతుందా… లేదా అనుమానాలున్నాయి. దీంతో ఈసారి కూడా వేల కోట్ల వ్యాపారం దెబ్బతిన్నట్టే. 2019 వరకు ప్రతిఏటా వివాహాల సీజన్లో వేల కోట్ల వ్యాపారం బంగారం, బట్టల వ్యాపారంతోనే సాగేది. కానీ ఇప్పుడు ఎంతమంది కొంటారో వ్యాపారులకు కూడా అంతు చిక్కని విషయమే. అటు పన్నుల ద్వారా రావాల్సిన సొమ్ము కూడా ప్రభుత్వానికి లాస్.