ఆ నలుగురికి ‘ప్రాణహిత’ గండమే

by Shyam |
ఆ నలుగురికి ‘ప్రాణహిత’ గండమే
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ‘ప్రాణహిత’ గండంగా మారింది.. కాంగ్రెస్ పథకమని పక్కన పెట్టిన సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. తూర్పు జిల్లాలోని అయిదు నియోజకవర్గాలకు సాగునీరు అందించే తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించేది లేదనే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసింది. రెండు జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంలో పడింది. ఏడేళ్లుగా ఎదురుచూసిన అధికార పార్టీ నేతలకు, ఇటు రైతులకు తాజాగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు.. అన్నారం నుంచి చెన్నూరుకు కాళేశ్వరం నీరు రానుండగా.. మిగతా నలుగురు ఎమ్మెల్యేలకు మాత్రం ‘ప్రాణ’ గండంగా మారింది.

ఉమ్మడి రాష్ట్రం ఉన్న 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత నదిపై సిర్పూర్ (టి) నియోజకవర్గం కౌటాల మండలం తమ్మిడిహెట్టి వద్ద వార్దా, పెన్గంగా నదుల సంగమ ప్రాంతంలో 152 మీటర్ల ఎత్తులో 6.50కి.మి. బ్యారేజీ నిర్మించేందుకు రూ.1919 కోట్లతో ప్రతిపాదించారు. ఇక్కడ నాలుగు టీఎంసీల నీటి నిల్వ చేసేందుకు నిర్ణయించింది. అప్పటి దివంగత నేత వై.ఎస్.ఆర్. డిసెంబర్ 16, 2008న బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి పేరుతో రూ.17,875కోట్ల అంచనా వ్యయంతో రూ.16.40లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడు జిల్లాలకు సాగునీటితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు, పరిశ్రమలకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 19 ప్యాకేజీలుగా చేసి పనులకు టెండర్లు కూడా పిలిచారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. కాలువల తవ్వకం పనులు కూడా ప్రారంభించారు. పనుల్లో వేగం లేకపోవటంతో.. 2014 నాటికి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,500 కోట్లకు చేరింది. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో కాలువల తవ్వకం కోసం రూ.950 కోట్లు వెచ్చించగా.. అప్పటికే తవ్విన భారీ కాలువలు వృథాగా మిగిలాయి.

స్వరాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం (మేడిగడ్డ) ప్రాజెక్టు తెరపైకి తెచ్చింది. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు రూ.1919 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేకుండా.. తమ్మిడిహట్టి నుంచి గతంలో కంటే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు వస్తుందనే తెలంగాణ ప్రభుత్వ ప్రకటనతో ఇక్కడి ప్రజాప్రతినిధులు, రైతాంగం సంబరపడింది. 152 మీటర్లకు బదులు 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయినా పనులు మొదలుపెట్టకపోవటంతో నిర్మాణ వ్యయం రూ.2600 కోట్లకు చేరింది. ఏడేండ్లుగా ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్ అనుమతుల పేరిట కాలం వెల్లదీసింది. ఏడేండ్లు గడిచినా.. తట్ట మట్టి కూడా తీయకపోవడంతో ఈ బ్యారేజీ నిర్మాణంపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని చూపుతోంది. తమ్మిడిహెట్టి వద్ద నిర్మాణానికి అయిష్టంగా ఉన్న తెలంగాణ సర్కారు.. డిజైన్ లోపం ఉందనే వాదన తెరపైకి తెచ్చింది. 2019లో వ్యాప్కోస్తో సర్వే చేయించి తమ్మిడిహెట్టి బ్యారేజీకి 200 మీటర్ల ఎగువున వార్దా నదిపై బ్యారేజీ కట్టాలని పేర్కొంది.

ఇటీవల కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో కలిశారట. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. అక్కడ బ్యారేజీ కట్టేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. కావాలంటే ఓ చెక్ డ్యాం కోసం ఇంజనీర్లతో ప్రతిపాదనలు రూపొందించి తీసుకురావాలని చెప్పినట్లు తెలిసింది. వార్దాపై కిలోమీటరు పొడవైన చెక్ డ్యాం.. 200 మీటర్ల ఎత్తులో కట్టడం సాధ్యం కాదని ఇంజనీర్లు చెప్పటంతో.. ఎమ్మెల్యేలకు పాలుపోని పరిస్థితి నెలకొంది. వార్దాపై బ్యారేజీ నిర్మిస్తేనే బాగుంటుందని, గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వవచ్చని చెప్తున్నారు. చెక్ డ్యాం నిర్మాణం సాధ్యం కాదని, ఇందుకు కూడా భారీగానే వ్యయం అవుతుందని పేర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన డా.బిఆర్ అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ డిజైన్ చేసిన కేసీఆర్… ఇప్పుడు ప్రాణహిత ప్రాజెక్టుకు మంగళం పాడటంతో రెండు జిల్లాల ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. చెన్నూరు నియోజకవర్గంలో 1.10 లక్షల ఎకరాలకు కాళేశ్వరం (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) నుంచి నీరిచ్చేందుకు సర్వే చేయగా.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సేఫ్ అయ్యారు. ఇక మిగతా నలురుగు ఎమ్మెల్యేలు మాత్రం ఇరకాటంలో పడగా.. ప్రాణహిత గండం నుంచి ఎలా బయట పడాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట.

Advertisement

Next Story

Most Viewed