- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అండ లేక.. ప్రైవేట్ టీచర్ల ఫొటోలకు దండ!
దిశ, తెలంగాణ బ్యూరో:
రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్ల మరణ మృదంగం కొనసాగుతోంది. గడిచిన రెండు నెలల్లో 17 మంది మరణించారు. ఒకరు కరోనాతో చనిపోగా, మిగిలిన 16 మందిలో ముగ్గురికి గుండె పోటు, 13 మంది బలవన్మారణాలకు పాల్పడ్డారు. అండగా ఉంటారనుకున్నవారు మధ్యలోనే ప్రాణాలు వదలడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. లాక్‌డౌన్ రోజుల్లో జీతాలు చెల్లించేందుకు ఇచ్చిన జీవోలు అమలు కాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ప్రైవేట్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రైవేట్ టీచర్ల ఉద్యోగ రక్షణ, వేతనాలకు సంబంధించిన జీవోలు అమలు కాకపోవడంతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం విమర్శిస్తోంది. ప్రైవేట్ టీచర్లకు 12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లించాలని చట్టాలున్నా రాష్ట్రంలో అమలు కావడం లేదు. లాక్‌డౌన్ కాలంలోనూ ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులకు, సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని తీసుకొచ్చిన జీవో ఒక్క పాఠశాలలో కూడా అమలు కాలేదంటే అతిశయోక్తి కాదు. రూరల్ ప్రాంతాల్లోని చిన్న స్కూళ్లే కాదు ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలు సైతం ఉత్తర్వులను ఉల్లంఘించాయి. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ముగ్గురు టాప్ -3 స్కూల్స్‌లో పనిచేస్తున్నవారే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జీవోల అమలు శూన్యం..
జీవోల అమలుపై పర్యవేక్షణ లేకపోవడంతో పాటు విద్యా వ్యాపారులతో ప్రభుత్వం చెట్టాపట్టాల్ వేసుకుని సాగుతుండడంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అలీ అంటున్నారు. 1994 జీవో 1 ప్రకారం అన్ని విద్యాసంస్థలు 12 నెలల పూర్తి జీతాలు, ఐడీ కార్డులతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించాలి. కానీ రాష్ర్టం ఏర్పడి ఆరేళ్లు గడుస్తున్నా ఎక్కడా అది అమలైన దాఖలాలు లేవు. లాక్‌డౌన్ రోజుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం జీఓ 45 విడుదల చేసింది. దీని ప్రకారం లాక్‌డౌన్ కాలానికి ప్రైవేట్ సంస్థలేవైనా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లించాలని ఉన్నా ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కూడా చెల్లించలేదు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు మినహా మిగిలిన వారిని తొలగించారు. మరి కొందరిని ‘ నో వర్క్ -నో పే ’ పేరుతో హోల్డ్‌లో పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం ఉండటమే గొప్ప విషయమని జీతం కోసం అడగలేని పరిస్థితుల్లోకి ప్రైవేట్ టీచర్లు వెళ్లారు. ఈ క్రమంలో కుటుంబం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అసెంబ్లీ వరకూ ప్రైవేట్ టీచర్లు
ఉద్యోగం కోల్పోయిన ప్రైవేట్ టీచర్లు రోడ్డెక్కారు. జీవోలను అమలు చేయాని కోరుతూ ధర్నాలు, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చారు. కనీసం సగం వేతనం ఇప్పించాలని కోరినా ప్రభుత్వం, యాజమాన్యాలు పెడచెవిన పెట్టాయి. నేరుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి సమస్యలను ఏకరువు పెట్టినా ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించలేదు. ఆరు నెలలుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా స్పందన లేకపోవడంతో చివరకు ప్రైవేట్ టీచర్లు ప్రగతి భవన్, అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. అయినా ఏ ఒక్క ప్రైవేటు ఉపాధ్యాయుడికి జీతం, ఉద్యోగానికి కూడా భద్రత కల్పించలేదు. పైగా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను పిలిచి ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. దీంతో విసిగిపోయిన ప్రైవేట్ టీచర్లు ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి విధానాలకు వ్యతిరేకంగా టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటన చేస్తూనే, మరోవైపు సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
ప్రైవేట్ టీచర్ల మరణాలు మచ్చుకు కొన్ని…
అక్టోబర్ 28 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడిపల్లికి చెందిన పేట సాయికుమార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి మూడు నెలల కిందటే వివాహమైంది.
అక్టోబర్ 21 : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన పోతు కిశోర్‌కు వేతనం రాక ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు ఆడ పిల్లల భారం భార్యపై పడింది.
అక్టోబర్ 21 : నిర్మల్ జిల్లా ఎల్లారెడ్డి పేట మండలానికి చెందిన వినయ్ కుమార్ పనిచేస్తున్న స్కూల్ ‘ నో వర్క్ – నో పే’ అమలు చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
అక్టోబర్ 13 : మేడ్చల్ జిల్లా సనత్ నగర్‌కు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు హరికృష్ణకు నాలుగు నెలల జీతం ఇవ్వకపోవడంతో మానసిక ఒత్తడికి గురై గుండె ఆగింది.
అక్టోబర్ 12 : నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లికి చెందిన కోదండరాం ఉద్యోగం కోల్పోవడంతో మానసిక వేదనతో ప్రాణాలు తీసుకున్నారు.
అక్టోబర్ 9 : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలానికి చెందిన శ్రీకాంత్ స్కూల్ యాజమాన్యం జీతం ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు.
అక్టోబర్ 9 : వరంగల్ జిల్లా శివనగర్ ప్రాంతంలోని మహేందర్ ఆర్థిక సమస్యలతో ఉరేసుకుని చనిపోయారు.
అక్టోబర్ 9 : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన విల్సన్
అక్టోబర్ 9 : యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూర్ మండలం సికిందర్ నగర్‌కు చెందిన దీప
అక్టోబర్ 6 : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలానికి చెందిన గుండు నరేష్.
అక్టోబర్ 4 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన మర్రి వెంకట్ (29) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అక్టోబర్ 4 : నల్లగొండ జిల్లాలోని ఒగ్గు అరుణ్ కుమార్.
అక్టోబర్ 3 : ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం రాళ్లపల్లికి చెందిన చెందిన బొలిశెట్టి పోశం హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ స్కూల్‌లో పనిచేస్తుండగా నాలుగు నెలల యాజమాన్యం జీతాన్ని హోల్డ్‌లో పెట్టింది. ఆర్థిక ఇబ్బందులు, మానసకి ఒత్తిడికి గురవడంతో హార్ట్ ఎటాక్ వచ్చి మరణించారు. ఈ టీచర్‌కు హైస్కూల్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆయన మరణానంతరం కుటుంబానికి యాజమాన్యం జీతం చెల్లించింది.
సెప్టెంబర్ 12 : వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన సొల్లేటి నాగరాజు.
సెప్టెంబర్ 7 : బోడుప్పల్‌లో ప్రైవేట్ స్కూల్ టీచర్ శివానీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మహబూబ్ బాద్ జిల్లా బయ్యారానికి చెందిన ఉపేందర్ ఆరు నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు చేసుకున్నారు
సమస్యలపై పోరాటానికే రాజకీయాలు
– షబ్బీర్ అలీ, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్ల మరణాలు ఆత్మహత్యలు కావు. యాజమాన్యాలు, ప్రభుత్వం కలిసి చేసిన హత్యలు. జీవోలను ఉల్లంఘిస్తూ టీచర్లను బాధిస్తున్న యాజమాన్యాలకు ప్రభుత్వం వత్తాసు పలకడంతోనే ఆత్మహత్యలు పెరిగాయి. ఉపాధ్యాయుల ప్రాణాలు పోతున్నాయని మేం ఆందోళన చేస్తుంటే, సర్కార్ మాత్రం యాజమాన్యాలను పిలిచి చర్చలు జరుపడం అత్యంత దారుణం. అసెంబ్లీని ముట్టడించినా సానుకూలంగా ప్రకటన కూడా చేయలేదు. వేలసంఖ్యలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క టీచర్‌కు ధైర్యం కల్పించేలా ప్రభుత్వం వ్యవహరించడం లేదు. మా సమస్యలను పరిష్కరించుకునేందుకు చట్టసభల్లో మేమే ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే టీపీటీఎఫ్ అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుపుతున్నాం.