- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం: నువ్వు అమరం.. నీ పాటకు లేదు మరణం
దిశ, వెబ్ డెస్క్: ఆయన పేరు చిరస్మరణీయం.. ఆయన గాత్రం అమరం.. ఆయన గానం స్వరరాగ నాదామృతం. లేరు ఆయనకు పోటీ.. సరి రాలేరు ఎవరు ఆయన సాటి.. సంగీత ప్రియులకు ఆయన గాన గంధర్వుడు.. సంగీత కళాకారులకు ఆయనే దేవుడు. దివి నుంచి పొరపాటున ఇలకు దిగివచ్చిన ఆ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఎన్నోకోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన ఆ గాత్రం మూగబోయిన రోజు ఈరోజు.. తన గాత్రంతో వీనుల విందుగా మధురగానాలను ఆలపించి..తన పని పూర్తి చేసుకుని సంగీత ప్రియులకు, తన అభిమానులకు కన్నీరు మిగులుస్తూ.. మళ్లీ భువి నుంచి దివికేగిన మహనీయుడు బాలు నేటితో మృతిచెంది ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గాన గంధర్వుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో ఎస్పీ సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు బాలు జన్మించారు. బాలు తండ్రి సాంబమూర్తి హరికథలు చెప్పేవారు. బాలుకి చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ ఏర్పడింది. పాటలు పాడటం అలవాటుగా మార్చుకున్నారు. పాటపై తనకున్న ఇష్టం ఆయన్ని సినిమాల వైపు నడిపించింది. 1960ల్లో చెన్నై వెళ్లి అవకాశాల వేట మొదలుపెట్టారు. ఇక ఆ ఆతర్వాత జరిగిన ఒక పాటల పోటీలో బాలు స్వరం విన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రం నేపథ్య గాయకుడిగా అవకాశమిచ్చారు. అయితే బాలును తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిలో నిలబెట్టిన చిత్రం మాత్రం ‘శంకరాభరణం’ అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు.
1981లో ఏక్ దూజే కే లియే చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు లభించింది. 1983లో సాగర సంగమం, 1986లో స్వాతిముత్యం, 1988లో రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకొన్నారు. 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే అరుదైన రికార్డ్ సృష్టించిన ఏకైక తెలుగువాడు మన బాలునే కావడం తెలుగుజాతి గర్వించదగ్గ విషయం.
ఒక్క నేపథ్య గాయకుడిగానే కాకుండా నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాన షోలకు జడ్జిగా ఆయన అందించిన సేవలు అమోఘం. ఇక చిత్ర పరిశ్రమలో ఆయనకు విమర్శకులు తక్కువే అని చెప్పాలి. ప్రతి ఒక్కరిని ప్రేమగా పిలిచి, ఆప్యాయంగా వెన్నుతట్టి ఆదర్శంగా నిలవడంలో ఎస్పీబీ ముందుడేవారు. నూతన కళాకారులను ప్రోత్సహించడం, వెనకపడిన వారిని ముందుకు నడిపించడం ఆయన స్పెషల్. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో స్టార్ గాయకులుగా ఎదిగిన వారందరు ఆయన దగ్గర శిష్యరికం చేసినవారే. క్లాస్ అయినా, మాస్ అయినా.. విషాదం అయినా, భక్తి అయినా.. వెటకారం అయినా, వ్యంగ్యం అయినా.. తన గాత్రంతో ఆ పాటకు ప్రాణం పోసే ఆ సరస్వతీ పుత్రుడు బాల సుబ్రహ్మణ్యం.
ఇక గాత్రంలో ఎన్నోరకాల ప్రయోగాలు చేసిన మొదటి వ్యక్తి కూడా మన బాలునే.. గుక్కపెట్టకుండా పాడడం.. నాలుగు నిముషాలు ఏకధాటిగా పాడి సాధ్యం కానిది సుసాధ్యం చేశారు. ఇంకా లెక్కలేనన్ని కచేరీలు,. లెక్కపెట్టలేనని అవార్డులు ఆయనకు మాత్రమే సొంతం. ఎన్నో ఏళ్లగా సంగీత ప్రియులను అలరిస్తున్న ఆ గొంతు 2020, సెప్టెంబర్ 25 న ఆగిపోయింది. ఆగస్టు 5 న కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన.. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోలుకుని తిరిగి వస్తారని అందరూ ఎదురుచూస్తున్నా వేళ.. అంతర్యామీ అలసితి సొలసితి అంటూ దివికేగారు. అయినా.. ఆయనకు మరణం లేదు.. ఆయన పాట రూపంలో ఎప్పుడు బ్రతికే ఉంటారు. నువ్వు అమరం.. నీ పాటకు లేదు మరణం.. అంటూ సంగీత అభిమానులు ఆయనకు ఘన నివాళిని సమర్పిస్తున్నారు.