25 ఏళ్లకే ప్రాణత్యాగం.. గిరిజన బిడ్డ ‘బిర్సా ముండా’కు భారత్ సెల్యూట్..

by Shamantha N |   ( Updated:2021-06-09 08:57:13.0  )
25 ఏళ్లకే ప్రాణత్యాగం.. గిరిజన బిడ్డ ‘బిర్సా ముండా’కు భారత్ సెల్యూట్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాను పరిపాలించిన బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఎంతో మంది యోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు. స్వరాజ్యం కోసం తమ ప్రాణాలను సైతం తృణ పాయంగా వదిలేశారు. అలాంటి వారిలో దిగ్గజ గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా ఒకరు. 15 నవంబర్ 1875లో బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించిన ఈయన బ్రిటీష్ వారీకి వ్యతిరేకంగా పోరాటం చేసి కేవలం 25 ఏళ్ల వయస్సులోనే జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ జైలులో 09 జూన్ 1900లో మరణించాడు. దేశకోసం అతిచిన్న వయస్సులో ప్రాణత్యాగం చేసిన బిర్సామండా 121వ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన్ను స్మరించుకున్నారు.

బిర్సాముండా బాల్యం, పోరాటం ప్రస్థానం..

చోటా నాగ్పూర్ పీఠభూమి గిరిజన బెల్టులో జన్మించిన బిర్సా ముండా యుక్త వయసులో ఉన్నప్పుడు గిరిజన హక్కుల కోసం పోరాడటం ప్రారంభించాడు. బిర్సా ముండా బాల్యంలో ఒక జర్మన్ మిషన్ పాఠశాలలో చదువుకున్నాడు. కానీ, కొన్ని సంవత్సరాలలోనే చదువుకు ముగింపు పలికాడు. తొలుత గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బిర్సాముండా ఆ తర్వాత వలస రాజ్యాల పాలకులు, బ్రిటీష్ రూలింగ్‌లో జరిగిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ‘బిర్సైట్’ అనే తన సొంత విభాగాన్ని ప్రారంభించాడు. ఇందులో ‘ముండా మరియు ఒరాన్’ గిరిజనులలో చాలా మంది అతని శాఖలో చేరి అతనితో ఉద్యమాలలో పాల్గొన్నారు.

ధిక్కార స్వరం..

వలస రాజ్య పాలకుల దురాగతాలను ఆది నుంచి బిర్సాముండా వ్యతిరేకించారు. అతనిలో అవగాహన పెరిగే కొద్దీ అన్యాయానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వచ్చారు.1886 మరియు 1890 మధ్య చైబాసాలో మిషనరీ వ్యతిరేక మరియు స్థాపన వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు. 03 మార్చి1900న బిర్సా ముండాను బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేయగా, అదే సంవత్సరం జూన్ 9న రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తూ 25 ఏళ్ల వయస్సులో మరణించాడు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నివాళి..

దిగ్గజ గిరిజన నాయకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 121 వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన్ను గుర్తుచేసుకున్నారు. ముండా తెగకు చెందిన నిర్భయమైన యువకుడు బిర్సా ముండా.. బెంగాల్, బీహార్ మరియు జార్ఖండ్ సరిహద్దుల్లో ఉన్న బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు నాయకత్వం వహించాడని, ‘గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు, ధర్తి ఆబా బిర్సా ముండా పుణ్య తిథి సందర్భంగా వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిర్భయ గిరిజన నాయకుడు అణచివేత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా స్వాతంత్య్ర సంగ్రామానికి అమూల్యమైన కృషి చేశారని వైస్ ప్రెసిడెంట్ ఎం.వెంకయ్య నాయుడు ఆయనకు నివాళి అర్పించారు.

జార్ఖండ్ సీఎం నివాళి..

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బిర్సా ముండా 121 వర్ధంతి సందర్బంగా ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు. ‘‘బిర్సా ముండా ఎస్టీ (గిరిజన) పోరాటంతో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన తీరును గుర్తుచేసుకున్నారు. ఆయన పోరాట స్పూర్తితో ‘‘మేము COVID-19తో పోరాడాలి” అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇదిలాఉండగా, ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రం బిర్సాముండా పుట్టిన రోజు అయిన నవంబర్ 15న బిహార్ నుంచి 2000 సంవత్సరంలో ప్రత్యేకంగా అవతరించింది.

Advertisement

Next Story

Most Viewed