సంచిలో బియ్యం.. ఎటు మాయం

by Anukaran |   ( Updated:2021-05-30 08:53:12.0  )
సంచిలో బియ్యం.. ఎటు మాయం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సంచిలో బియ్యం.. సంచిలోనే మాయమవుతోంది.. మూతి కుట్టింది కుట్టినట్లు ఉండగానే.. తూకం చేస్తే మాత్రం బియ్యం తక్కువ వస్తోంది. అదేంటీ సంచిలో నుంచి బియ్యం ఎవరు తీస్తున్నట్లు..ఎటు పోతున్నట్లు.. అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. తమకు తెలియదంటే తమకు తెలియదని ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 50కిలోల బియ్యం బస్తా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణం వరకు వచ్చే సరికి 6కిలోలు తగ్గిపోవటంలో ఆంతర్యం ఏంటనేది తేలాల్సి ఉంది. ప్రైవేటు ఉపాధ్యాయులకు సర్కారు ఉచితంగా పంపిణీ చేసే సన్నబియ్యంలో కొందరు అక్రమార్కులు కోత పెడుతున్నారు. బియ్యం బస్తాల్లో తక్కువ రావటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోతున్నారు..!

ముధోల్లోని మండల స్థాయి నిల్వ కేంద్రం (ఎంఎల్ఎస్ పాయింట్) నుంచి నియోజకవర్గంలోని తానూరు, ముధోల్, బాసర మండలాలకు బియ్యం సరఫరా అవుతుంది. ప్రైవేటు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 25కిలోల ఉచిత సన్నబియ్యం కూడా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు. 50కిలో బస్తా చొప్పున పంపగా రేషన్ దుకాణాల్లో తూకం వేస్తే 44-47కిలోలే వస్తున్నాయి. ఒక్కో సంచికి 3నుంచి6 కిలోల తరుగు వచ్చింది. ఒక్క సారిగా కంగుతిన్న రేషన్ డీలర్లు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ విషయాన్ని తమ యూనియన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సదరు ఎంఎల్ఎస్ పాయింటు ఇంఛార్జి దృష్టికి తీసుకెళ్లగా ఎవరికెంత తక్కువ వచ్చిందో వచ్చే నెలలో సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఇది మచ్చుకు ఉదాహరణ మాత్రమే.. ఇలా ఉమ్మడి జిల్లాలోని చాలా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లిన బియ్యం బస్తాల్లో తరుగు వచ్చిందని రేషన్ డీలర్లు లబోదిబోమంటున్నారు. కరోనా కారణంగా ప్రైవేటు బడులు మూతపడగా వీరికి సాయం ఆర్థిక సాయంతో పాటు రేషన్ బియ్యం ఉచితంగా అందించాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే నెలల్లో ఈ పథకం కింద రూ.2వేల ఆర్థిక సాయంతో పాటు 25కిలోల బియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణాలకు వస్తున్న సన్న బియ్యం బస్తాల్లో తరుగు బాగా వస్తోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్, మే రెండు నెలల్లోనూ ఇదే విధంగా తరుగు రావటంతో ఒకరి వద్ద నుంచి మరొకరు సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు.

వాస్తవానికి రైస్ మిల్లుల నుంచి బియ్యం గోదాంలకు వెళ్తుంది. అక్కడి నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరుతుంది. అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అవుతుంది. మిల్లు నుంచి రేషన్ దుకాణం వరకు ప్రతి స్థాయిలో తూకం వేస్తారు. 50కిలోల బస్తా ఉంటేనే.. ఒక చోటు నుంచి మరో చోటుకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ-పాస్ విధానం అమలు చేస్తుండటంతో బియ్యం తరుగు లేకుండా ఫౌర సరఫరాల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ 50క్వింటాళ్ల చొప్పున తూకం వేసే యంత్రాలు ఇచ్చారు. రేషన్ డీలర్లకు సరఫరా చేసే ముందు తూకం వేశాకే లారీల్లో ఎక్కించాలి. ఇది రేషన్ డీలర్ల సమక్షంలో చేసి సంతకాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులరుగా రేషన్ బియ్యానికి ఈ ప్రక్రియ అమలవుతోంది. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇచ్చే సన్నం బియ్యం రేషన్ కోటాతో పాటు సరఫరా చేయలేదు. విడిగా వాహనాల్లో ఎంఎల్ఎస్ పాయింటు నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు.

దీంతో ఎంఎల్ఎస్ పాయింటుకు డీలరు రాకుండానే.. తూకం వేసుకోకుండానే పంపించారు. గ్రామానికి పంపాక రేషన్ డీలర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో అనుమానం వచ్చిన డీలర్లు తూకం వేయగా ఒక్కో బస్తాలో 44-47కిలోల చొప్పున బియ్యం ఉన్నాయి. ఒక్కో ప్రైవేటు ఉపాధ్యాయుడికి 25కిలోలు ఇవ్వాల్సి రావటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అసలు విషయాన్ని తమ యూనియన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జిలతో మాట్లాడారు. దీంతో ఎంత మేర తక్కువ వచ్చాయో రాసి ఇవ్వాలని.. వచ్చే నెల సర్దుబాటు చేస్తామని సదరు ఇంచార్జిలు చెబుతున్నారు. అసలు సంచిలో నుంచి బియ్యం ఎందుకు తగ్గాయి.. ఎవరు తీశారు.. ఎటు వెళ్లాయనే విషయం తేలాల్సి ఉంది. సంచి కట్టు కుట్టింది కుట్టినట్లు ఉండగానే.. బియ్యం తరుగు వెనక అసలు సూత్రపాత్ర ధారులెవరనేది తేలాల్సి ఉంది. ఎంఎల్ఎస్ పాయింట్లోనే తీస్తున్నారా లారీల్లో లోడింగ్ చేశాక తీస్తున్నారా అంతా కలిసి చేస్తున్నారనేది వెలుగులోకి రావాల్సి ఉంది.

ఈ విషయమై నిర్మల్ జిల్లా ఫౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్ ను ‘దిశ ప్రతినిధి’ అడుగగా.. ఈ-పాస్ విధానం వచ్చాక పకడ్బందీ చర్యలు చేపట్టామని, ప్రతి ఎంఎల్ఎస్ పాయింటులో 50క్వింటాళ్ల చొప్పున తూకం చేసే యంత్రాలు ఇచ్చామన్నారు. రేషన్ డీలర్ల సమక్షంలో తూకం వేశాక సరిగా ఉన్నాయనే సంతకం పెట్టాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed