డేటింగ్, ఎస్కార్ట్ పేరుతో గాలం

by Sumithra |
డేటింగ్, ఎస్కార్ట్ పేరుతో గాలం
X

దిశ, క్రైమ్ బ్యూరో: అందమైన అమ్మాయిలతో డేటింగ్, ఎస్కార్ట్​సౌకర్యం కల్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ పురుషులను మోసగిస్తున్న ఘరానా ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. సీపీ సజ్జనార్ శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పశ్చిమ్ బెంగాల్ కు చెందిన అమిత్ పాల్ అలియాస్ అమిత్ శర్మ, సుశాంక్ కుమార్ సాహి సిలిగురిలో ఈ కాల్ సెంటర్​నిర్వహిస్తున్నారు. అమ్మాయిలతో డేటింగ్ చేసేందుకు వీలుందంటూ నమ్మబలుకుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు ఫేక్ వెబ్ సైట్లను రూపొందించారు. వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంతోపాటు సెల్ ఫోన్లకు సందేశాలతో కూడిన లింకులను పంపిస్తుంటారు. అందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించుకున్నారు.

ఎవరైతే వీరి మెస్సేజులకు స్పందిస్తారో వారికి టెలీకాలర్లు ఫోన్ చేసి ఆకర్షిస్తుంటారు. వీఐపీ సభ్యత్వం, భద్రతా కార్డు, హోటల్ బుకింగ్, రిజిస్ట్రేషన్, సర్వీస్, జీఎస్టీ తదితర కారణాలతో డబ్బు చెల్లించాలని కోరతారు. వారి ఖాతాలకు రుసుములు చేరాక ఫోన్లను డిస్ కనెక్ట్​ చేస్తారు. పురుషులతో మాట్లాడేందుకు అనేక రకాల ఫేక్ సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ తరహా కేసులు రెండు నెలల్లోనే రెండు నమోదయ్యాయి. ఒకరు రూ.13.82 లక్షలకు, మరొకరు రూ.1.15 లక్షలు మోసపోయారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ముఠా పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ ప్రాంతంలోని మోర్ సిలిగురి ప్రాంతంలో ఉందని, అక్కడి నుంచే కాల్ సెంటర్‌ నిర్వహిస్తున్నారని కనిపెట్టారు. వెంటనే దాడులు నిర్వహించి బిజయ్ కుమార్ షా, బినోద్ కుమార్ షా, మహమ్మద్ నూర్ అలామ్ అన్సారీని అరెస్టు చేశారు. దీపా హాల్దార్, శిఖా హాల్దార్ కు నోటీసులు జారీ చేశారు. ప్రధాన నిర్వాహకులు అమిత్ పాల్, సుశాంక్ కుమార్షాపాటు సంతుదాస్ పరారీలో ఉన్నారు.

Advertisement

Next Story