వైఎస్ వివేకా హత్యకేసులో బాంబు పేల్చిన డ్రైవర్ దస్తగిరి

by srinivas |
ys viveka
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. వైఎస్ వివేకా హత్యపై ఆగస్ట్ 30న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్‌మెంట్‌లో బడా నేతల పేర్లతో పాటు.. ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించాడు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ ప్రకారం, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్ రెడ్డితో కలిసి మర్డర్ చేసినట్టు దస్తగిరి తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.

బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంతో ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిపాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకాకు గంగిరెడ్డి, ప్రస్తుత కడప ఎంపీ అవినాశ్ రెడ్డిలు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పుకొచ్చాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం కూడా చోటు చేసుకుందని స్టేట్మెంట్‌లో పేర్కొన్నాడు. ‘నన్ను కావాలనే ఓడించారు.. మీ కథ తేలుస్తానంటూ’ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్ రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు దస్తగిరి తెలిపాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంపై ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్ రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. తర్వాత కొన్ని రోజులపాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డిల మధ్య సంబంధాలు చెడిపోయినట్లు తెలిపాడు.

కోటి రూపాయలు ఇస్తాం.. వివేకాను హత్య చేయాలని గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు దస్తగిరి వెల్లడించాడు. ‘నువ్వొక్కడివే కాదు, మేమూ వస్తాం కలిసి వివేకాను చంపేద్దామంటూ’ గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి కుండబద్దలు కొట్టాడు. దీని వెనుక అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారని తనతో ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు తెలిపాడు. మొత్తం హత్యకు రూ.40 కోట్ల రూపాయల సుపారీ ఇవ్వగా తనకు రూ.5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని, అందులో రూ.25 లక్షలు సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని పేర్కొన్నాడు. తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా రూ.75 లక్షలు దాచినట్లు తెలిపాడు. సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేశారని తెలిపాడు.

సునీల్ యాదవ్, ఉమాశంకర్‌ రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్‌లోకి దూకి లోపలికి వెళ్లినట్లు దస్తగిరి తెలిపాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్లు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తనను చూసిన వివేకా ఈ సమయంలో వీళ్ళెందుకు వచ్చారని నిర్ఘాంతపోయారని, తర్వాత వివేకా బెడ్ రూమ్‌లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని దస్తగిరి తెలిపాడు. వివేకా బెడ్ రూమ్‌లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని.. ఆ సమయంలో వివేకాను బూతులు తిడుతూ మొహంపై సునీల్ యాదవ్ దాడి చేసినట్టు తెలిపాడు. తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడి చేసినట్లు దస్తగిరి తెలిపాడు. వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతీపై 7,8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed