వందల మందిని మోసం చేసిన ‘ధనలక్ష్మి’.. రూ.50 లక్షలు స్వాహా..!

by Sumithra |
వందల మందిని మోసం చేసిన ‘ధనలక్ష్మి’.. రూ.50 లక్షలు స్వాహా..!
X

దిశ, కామారెడ్డి : అనుమతులు లేకున్నా లక్కీ డ్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. నెలనెలా స్కీము పేరుతో లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ లక్కీ డ్రా మోసం బహిర్గతం అయింది. స్కీమ్ పూర్తయినా బహుమతులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ‘ధనలక్ష్మి ఎంటర్ ప్రైజెస్’ పేరుతో కొందరు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ధనలక్ష్మి 2, 3, 4 అని మూడు స్కీములు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. 2, 3 స్కీముల వ్యవధి పదహారు నెలలు కాగా 4వ స్కీము 10 నెలలుగా నిర్ణయించారు. ఒక్కొక్క స్కీముకు ప్రతీ నెల వెయ్యి, రెండు వేల చొప్పున వసూలు చేశారు.

ఒక్కొక్క గ్రామం నుంచి సుమారుగా 50 నుంచి 100 మంది స్కీములో చేరారు. ఇలా దాదాపుగా సుమారు రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూడు స్కీములు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. అయినా ఇప్పటివరకు బాధితులకు రావాల్సిన బహుమతులు ఇవ్వలేదు. లక్కీ డ్రా తీసే సమయంలో అనుమతి లేదు అంటూ, ఎవరినీ రానియలేదని బాధితులు చెబుతున్నారు. డ్రా కు సంబంధించి వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో పంపించారని బాధితులు తెలిపారు. ఆ వీడియోలో డ్రా లో గెలుపొందిన వారు ఆదివారం కామారెడ్డికి వచ్చి బహుమతులు తీసుకెళ్లాలని వాట్సాప్ గ్రూపులో సమాచారం అందించారు. దాంతో సుమారు 100 మంది బాధితులు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల ఓ హోటల్ వద్ద ఏజెంట్లు, నిర్వాహకులను కలిశారు.

లక్కీ డ్రాలో టీవీ వచ్చిన వారికి వాషింగ్ మిషన్ ఇస్తున్నారని బాధితులు తెలిపారు. డ్రా లో వచ్చినవి కాకుండా వారికి నచ్చిన వాటిని ఇస్తున్నారని బాధితులు తెలిపారు. అయితే, స్కీములో ఒక్కొక్కరు సుమారు రూ.30 వేల నుంచి 50 వేల వరకు చెల్లించారు. తీరా డ్రా లో వచ్చిన వస్తువులు కాకుండా వారికి నచ్చినవి ఇవ్వడంతో నిర్వహకులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వచ్చిన బహుమతులు మాత్రమే ఇవ్వాలని పట్టుబట్టారు. దాంతో పది రోజుల్లో ఎవరి వస్తువులు వారికి ఇస్తామని చెప్పి బాధితులను సముదాయించి అక్కడినుంచి పంపించేశారు. అయితే, బాధితుల నుంచి వివరణ తీసుకుంటుండగా ఓ ఏజెంట్ మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చి కాంప్రమైజ్ అయిన తర్వాత ఏం వార్త పెడతారని ప్రశ్నించారు. అసలు స్కీముకు ఎలాంటి అనుమతి ఉందో చూపించాలని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సదరు ఏజెంట్ మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు.

రమ్మని వాయిదా వేశారు..

లక్కీ డ్రాలో బహుమతి వచ్చిన వాళ్ళను రమ్మన్నారు. వచ్చి లాటరీలో వచ్చింది తీసుకెళ్లుమన్నారు. ఇప్పుడిక్కడికి వస్తే వారికి నచ్చింది ఇస్తున్నారు. మాకు అర్థం కాకుండా ఏదేదో చెప్తున్నారు. ఇక్కడికి రమ్మని ఇప్పుడు పది రోజులకు ఇస్తామని వాయిదా వేశారు.

-రాజు, బాధితుడు

16 వేలు కట్టి 20 నెలలు అయింది.

మూడు స్కీములని చెప్పారు. 16 నెలల స్కీముకు 16 వేలు కట్టిన. డబ్బులు కట్టి 20 నెలలు అవుతుంది. ఇప్పుడేమో డకోటా వాషింగ్ మిషన్లు ఇస్తామంటున్నరు. అవి కూడా 10 వ తేదీ నాడు రమ్మంటున్నారు. ఆ రోజు వస్తే వీళ్ళ కథ ఏంటో తెలుస్తుంది.

-బాధితుడు

Advertisement

Next Story