నిత్యం ప్రమాదాలు.. చినుకు పడితే అవి రోడ్లు కాదు

by Sridhar Babu |
నిత్యం ప్రమాదాలు.. చినుకు పడితే అవి రోడ్లు కాదు
X

దిశ, చేవెళ్ల: హైదరాబాద్ మహానగరానికి రెండుపదుల దూరంలో ఉన్న మొయినాబాద్ మండల రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. హైదరాబాద్ బీజాపూర్ అంతర్ రాష్ట్ర రహదారి నుంచి మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్, చిలుకూరు బాలాజీ దేవాలయం వెళ్ళే దారి అధ్వాన్నంగా తయారైంది. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్ని చిత్తడి చిత్తడిగా తయారయ్యాయి. ఈ రహదారిపై ప్రతి నిత్యం వందలాది ద్విచక్ర వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో రద్దీగా ఉంటుంది.

హిమాయత్‌నగర్ గ్రామ పరిధిలోని ఓ వైపు సీ.సీ రోడ్డు వేసిన హైదరాబాద్ రోడ్లు భవనాల శాఖ అధికారులు మరో వైపు సీ.సీ రోడ్డు వేయకుండా వదిలేయడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు వికలాంగులుగా మారుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఒకవైపు సీసీ రోడ్డు సరే-మరోవైపు మాటేంటి

హిమాయత్‌నగర్ గ్రామ పరిధిలో ఒకవైపు సీ.సీ రోడ్డు వేసిన అధికారులు మరోవైపు వేయకుండా కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజంత రద్దీగా ఉండే ఈ రోడ్డు మీద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎదురుగా వచ్చే వాహనానికి రోడ్డు వదిలే ఈ సమయంలో వాహనాలు బోల్తా పడుతున్నాయి. హిమాయత్ నగర్ మీదుగా, చిలుకూరు, వీరన్న పేట, ప్రగతి రిసార్ట్, పొద్దుటూరు మీదుగా ఎనికేపల్లి, కొత్తపల్లి, సిద్దులూరు, వికారాబాద్ వరకు వెళుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

వర్షం పెడితే చిత్తడే..

హిమాయత్‌నగర్-చిలుకూరు మధ్య గల రోడ్డు వర్షం పడితే చిత్తడి చిత్తడిగా తయారవుతుంది. హైదరాబాద్ బీజాపూర్ అంతర్ రాష్ట్ర రహదారి నుంచి హిమాయత్‌నగర్ చిలుకూరు వరకు రోడ్డు పక్కన గుంతలు వర్షపు నీటితో నిండి బురదమయంగా తయారవుతుంది. వాహనాల స్పీడ్‌కు పక్కనుంచి వెళ్తున్న మరో వాహనంపై బురద పడటంతో ఒకరికొకరు ఘర్షణలు సైతం పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

Advertisement

Next Story

Most Viewed