గర్జనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. అగ్గిరాజేసిన పోడు సమరం

by Sridhar Babu |   ( Updated:2021-09-12 08:25:22.0  )
గర్జనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. అగ్గిరాజేసిన పోడు సమరం
X

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో పోడు భూముల సమస్య మళ్లీ రాజుకుంది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీశాఖ సిబ్బందిని స్థానిక దళిత రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలోని దాదాపు వందకు పైగా దళిత కుటుంబాలు సుమారు 80 ఎకరాల పోడు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం అటవీ శాఖ అధికారులు ఈ భూముల్లో హరితహారం పనులు చేపట్టేందుకు రాగా దళిత రైతులు అడ్డుకున్నారు.

దీంతో అధికారులకు, రైతులకు మధ్య వివాదం జరిగింది. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో అధికారులు హరితహారం పనులు తాత్కాలికంగా నిలివేస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పోలీసుల సహకారంతో అటవీశాఖ అధికారులు మళ్లీ పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు సిద్ధమవగా దళిత రైతులు అడ్డుకున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న వివాదం మళ్లీ చెలరేగింది. దీంతో పరిస్థితి చేజారకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. రైతులను పోడు భూముల్లోకి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. ఫలితంగా గర్జనపల్లి అటవీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed