సిరిసిల్లలో మరో దారుణం.. Face book లైవ్‌లో దళిత యువకుడి ఆత్మహత్యాయత్నం

by Anukaran |   ( Updated:2021-11-22 08:09:57.0  )
సిరిసిల్లలో మరో దారుణం.. Face book లైవ్‌లో దళిత యువకుడి ఆత్మహత్యాయత్నం
X

దిశ, సిరిసిల్ల : సిరిసిల్లలో ఓ దళిత యువకుడు ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న వీడియో కలకలం రేపింది. సోమవారం ఈ దారుణం చోటుచేసుకోగా బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు దిలీప్ ఫేస్ బుక్ లైవ్‌లో చెప్పిన కథనం ప్రకారం.. జిల్లాలోని తంగెళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన తాను వేములవాడకు చెందిన అగ్రవర్ణాల అమ్మాయి తనను ప్రేమిస్తున్నాని చెప్పడంతో ఇద్దరం కలిసి తిరిగామని చెప్పాడు. సదరు యువతి అనారోగ్యానికి గురైతే ఆర్థిక సాయం చేశానని, కరీంనగర్‌లో చదువుకునేందుకు కూడా ఖర్చులు వెచ్చించానని వివరించాడు. ఆ తర్వాత యువతి తల్లి వద్దకు వెల్లి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, తమకు వివాహం చేయాలని కోరితే తన కులం అడిగి తెలుసుకుని దూషించిందని తెలిపాడు. అమ్మాయి నేను కలిసి తిరిగిన ఫోటోలు ఆధారాలు కూడా ఉన్నాయని, ఆమెతో తాను కలిసి తిరుగుతున్నప్పుడు ట్రాఫిక్ చలానాలు కూడా పడ్డాయని ఆ ఫోటోలు కూడా పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నాడు.

అయితే, తమ ప్రేమ విషయాన్ని నిరాకరించిన యువతి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన కొంతమంది సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అప్పుడు తనను పోలీసులు తెల్లవారు జామున ఇంటి నుండి తీసుకెళ్లి నానా దుర్భాషలాడారని దిలీప్ ఫేస్‌బుక్ లైవ్లో వివరించాడు. సిరిసిల్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఇష్టం వచ్చినట్టు తిట్టి తన మొబైల్‌లో యువతితో కలిసి తిరిగినప్పటి ఆధారాలు అన్ని తీయించేశారని ఆరోపించాడు. తనపై కేసు కూడా నమోదు చేశారని, తాను తాగుబోతునని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారన్నారు. తాను కూల్ డ్రింక్స్ తప్పా మద్యం తాగనని దిలీప్ వాపోయాడు. పోలీసులు తనను అరెస్టు చేయగా, కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చినట్టు వివరించాడు. యువతికి చెందిన బంధువులు ఒకరికి తాను ఫోన్ చేయగా, పోలీసులు మళ్లీ తనను ఠాణాకు రమ్మని ఫోన్ చేయడంతో తాను రానని చెప్పానన్నారు. టౌన్ సీఐ అనిల్ కుమార్ వేధింపులతో పాటు తనపై తప్పుడు కేసులు పెట్టిన వారి కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఫేస్‌బుక్ లైవ్‌లో వివరించారు. దిలీప్‌ను వెంటనే సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడు తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతనికి వైద్యం చేస్తున్నారు.

చట్ట ప్రకారమే వ్యవహరించాం : సీఐ అనీల్ కుమార్

దిలీప్ వ్యవహారంలో తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామని సిరిసిల్ల సీఐ అనిల్ కుమార్ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేశామన్నారు. ఆదివారం నమోదైన కేసు విషయంలో విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాలని ఫోన్ చేసి చెప్పామన్నారు. అతనిపై చేయి చేసుకోవడం వంటి చర్యలకు చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. సున్నితమైన విషయం కావడం వల్ల తాము కూడా సున్నితంగానే వ్యవహరించామని దిలీప్ చేసిన తప్పుడు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సీఐ అనిల్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed