లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: (జాతీయం, అవార్డులు, పుస్తకావిష్కరణ)

by Harish |   ( Updated:2023-05-19 15:13:34.0  )
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: (జాతీయం, అవార్డులు, పుస్తకావిష్కరణ)
X

జాతీయం:

గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు :

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీని ప్రకారం ఏపీలో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఈ గుర్తింపు లభించింది. ఏపీలో గుర్తింపు పొందిన వాటిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైకాపా), తెలుగుదేశం పార్టీలున్నాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ తో పాటు తెలుగుదేశం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీ హోదా పొందినట్లు వెల్లడించింది. వీటికి ప్రస్తుతం కేటాయించిన గుర్తులను ఆ రాష్ట్రాల్లో రిజర్వ్ చేయనున్నట్లు పేర్కొంది. ఇక జాతీయ పార్టీల జాబితాలో ఆప్, బీఎస్పీ, భాజపా, సీపీఐ(ఎం), కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర:

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ పేర్లను సిఫారసు చేస్తూ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన కొలీజియం సిఫార్సు చేసింది. ఇప్పటివరకు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆ స్థానాల భర్తీ కోసం కొలీజియం వెంటనే పేర్లు సిఫారసు చేసింది.

సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్:

కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ (59)ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో ఆయనను ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే ప్యానల్ ప్రవీణ్ సూద్ నియామకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్యానల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.

అవార్డులు:

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ‘ఆసియా పసిఫిక్ గ్రీన్’అవార్డు:

పర్యావరణహితమైన చర్యల్లో భాగంగా మరోసారి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ముందు వరుసలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) 2023 ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గోల్డ్ పురస్కారాన్ని పొందింది. 15 నుంచి 35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనలో ఈ అవార్డును గెలుచుకుంది. 2018 నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరుసగా ఆరుసార్లు ఈ అవార్డును కైవసం చేసుకుంది.

టీహబ్‌కు జాతీయ సాంకేతిక పురస్కారం:

తెలంగాణ రాష్ట్రంలోని టీహబ్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యుత్తమమైన జాతీయ సాంకేతిక పురస్కారాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేందర్‌సింగ్ చేతుల మీదుగా టీ హబ్ సీఈవో శ్రీనివాసరావు అందుకున్నారు. టీ హబ్ దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

పుస్తకావిష్కరణ:

రిఫ్లెక్షన్స్ ఆన్ ఇండియాస్ పబ్లిక్ పాలసీస్ పుస్తకావిష్కరణ:

దేశాభివృద్ధిలో బ్యూరోక్రసీ అత్యంత కీలకపాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. 1984వ బ్యాచ్‌కు చెందిన 10 మంది ఐఏఎస్ అధికారులు రాసిన రిఫ్లెక్షన్స్ ఆన్ ఇండియాన్ పబ్లిక్ పాలసీస్ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ విధానాల రూపకల్పనలో నిరంతరం మార్పు కనిపిస్తూ వస్తోంది. ప్రభుత్వాలు సుస్థిరత, స్వావలంబన, వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా పంచడానికి ప్రాధాన్యం ఇచ్చాయన్నారు.

ఇవి కూడా చదవండి:

Latest National and International Current Affairs: 19-5-2023

Advertisement

Next Story

Most Viewed