బిల్లుల చెల్లింపులో జాప్యం వద్దు : సీఎస్

by Shyam |
బిల్లుల చెల్లింపులో జాప్యం వద్దు : సీఎస్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు ఇకపై ఏ నెల కరెంటు బిల్లును అదే నెలలో చెల్లించాలని చీఫ్ సెక్రెటరీ జె.సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) అధికారులతో సీఎస్ శుక్రవారం సమావేశం నిర్వహించారు.

ఇప్పటివరకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం డిస్కంలు స్థానిక సంస్థల్లో పేరుకుపోయిన బిల్లుల బకాయిల వివరాలతో ఒక ప్రత్యేక నివేదికను వారంలో రోజుల్లో రూపొందించాలని కోరారు.ఈ నివేదికతో పాటు పలురకాల చెల్లింపుల ఆప్షన్లతో సీఎం కేసీఆర్‌కు అందజేస్తామన్నారు. దీనిపై సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

బోరు బావుల విద్యుత్ బిల్లుల సమస్య పరిష్కరించుకునేందుకుగాను డిస్కంలు, పంచాయతీలు, మున్సిపాలిటీల అధికారులతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సీఎస్ సూచించారు. స్థానిక సంస్థలు వాడిన విద్యుత్‌కు సంబంధించి పూర్తి బిల్లులను జనరేట్ చేయాలని, ఎక్కడ మీటర్లు ఉండవో అక్కడ నెలలోపు మీటర్లు బిగించాలన్నారు.సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ కార్యదర్శి రఘునందన్ రావు, ఎస్పీడీసీఎల్ ఎండీ జి.రఘుమారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed